కేంద్ర కేబినెట్‌ విస్తరణ

నలుగురు కేబినెట్‌, మరో నలుగురికి సహాయ హోదా
గిరిజా, ఆస్కార్‌, కావూరి, శీలం తదితరులకు చోటు
న్యూఢల్లీి, జూన్‌ 17 (జనంసాక్షి) :
కేంద్ర కేబినెట్‌ను సోమవారం పునర్వ్యస్థీకరించారు. మంత్రివర్గంలోకి కొత్తగా ఎనిమిది మందికి చోటు కల్పిస్తూ ప్రధాని మన్మోహన్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. వీరిలో నలుగురికి కేబినెట్‌ హోదా లభించగా మరో నలుగురికి సహాయ హోదా దక్కింది. కేబినెట్‌ మంత్రులుగా ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, గిరిజావ్యాస్‌, కావూరి సాంబశివరావు, శీష్‌రాం ఓలా ప్రమాణం చేశారు. సహాయ మంత్రులుగా జేడీ శీలం, సుదర్శన్‌ నాచియప్పన్‌, మాణిక్‌రావ్‌ గవిట్‌, సంతోష్‌ ల్మదురి ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వీరితో ప్రమాణం చేయించారు. త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రమంత్రి వర్గ విస్తరణ చేపట్టినట్లుగా ఊహాగానాలు సాగుతున్నాయి. రాజస్థాన్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రం నుంచి కీలక జాట్‌ నేతగా ఉన్న శీష్‌రాం ఓలా, గిరిజావ్యాస్‌లను మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆంధప్రదేశ్‌కు చెందిన కావూరి సాంబశిరావు, జేడీ శీలంకు చోటు కల్పించారు. తాజా విస్తరణతో కేంద్ర ప్రభుత్వంలో అమాత్యుల సంఖ్య 75కి చేరింది. ఇటీవల కాంగ్రెస్‌ అధిష్టానంపై అలిగి ఎంపీ స్థానానికి రాజీనామా చేసి నిరసన చాటిన కావూరి కల నెరవేరింది. ఇక ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తున్న ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, గిరిజావ్యాస్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆస్కార్‌ ఐదుసార్లు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుకు కాంగ్రెసు అధిష్టానం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చినట్లయ్యింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక సంస్థ సీడబ్ల్యూసీలో ఆయనను ఇప్పటికే శాశ్వత ఆహ్వానితుడిగా నియమించాక ఇప్పుడు కేబినెట్‌ హోదా కల్పించారు. కావూరి సాంబశివరావుకు కేబినెట్‌ హోదా ఇవ్వడం ద్వారా తెలంగాణకు చెందిన ఎస్‌ జైపాల్‌రెడ్డి స్థాయిలో మన్మోహన్‌ సింగ్‌ ఆయనను నిలబెడుతున్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరికి మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కినా కావూరికి కేబినట్‌ హోదా దక్కడం విశేషం.
తెలంగాణకు మొండిచేయి
కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తెలంగాణను చిన్నచూపు చూస్తోందని తేటతెల్లం అయింది. నిన్నటికి నిన్న ప్రకటించిన ఆల్‌ఇండియా కాంగ్రెస్‌ కమిటీలో ఒక్కటంటే ఒక్క పదవిని కేటాయించక పోగా, సోమవారం కేంద్ర కేబినెట్‌లో సైతం మొండి చేయిచ్చింది. ఇంతకాలం తెలంగాణ విషయంలో ఏదో చేస్తున్నామనే భ్రమలు కల్పిస్తూ వచ్చిన కేంద్రం పార్టీపరంగాను, అధికారికంగానూ ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడాన్ని రాజకీయ పరిశీలకులు వేలెత్తి చూపిస్తున్నారు. అసలే తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్రం నాన్చుతూ వస్తూండడం వల్ల పార్టీకి గడ్డుకాలం వస్తోంది. రోజురోజుకు తెలంగాణలో పార్టీ పరిస్థితి దిగజారిపోతున్నా కూడా ఇసుమంత కూడా పట్టించుకున్న పాపాన పోవడంలేదని ఈ విస్తరణలతో తేటతెల్లం అయిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. గత అరవై ఏళ్లకు పైగా తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్‌తో పాటు, ఇతర పార్టీల నేతలు, మేధావులు అధిష్టానాన్ని వేలెత్తి చూపిస్తున్నా కూడా కనీసం కదలిక లేక పోవడమే కాక మరింత చావు దెబ్బతీసేలా చర్యలుంటున్నాయని తేలిపోయిందంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గడంతోనే పార్టీ దిగజారుడు ప్రారంభమైనప్పటికి, కనీసం పదవులతోనైనా సమతుల్యం చేయకుండా ఇలా ఒంటెద్దు పోకడలతో పోవడం ఎంతవరకు ప్రజల మనస్సులను చూరగొంటారని నిలదీస్తున్నారు. తెలంగాణాలో నేడు నెలకొన్న అనేక సమస్యలకు కారణంగా ఉన్నా కూడా నాయకులను కాపాడుకునే ప్రయత్నం చేయక పోవడం మరీ దారుణంగా మారుతోంది. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం జరుగుతూనే ఉందని పార్టీనేతలతో పాటు ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తూనే ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీని ప్రజలు నమ్మకంతో అధికారం కట్టబెట్టడంలో ముందున్నారు. సీమాంధ్రలో వైఎస్సార్‌సిపి వల్ల పెద్ద పెద్ద దెబ్బలు తగులుతున్నా కూడా తెలంగాణలో మాత్రం నాయకులు హైకమాండ్‌పై ఇంకా ఇంకా నమ్మకంతో మెలుగుతుండడాన్ని అసమర్థతగా బావిస్తుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణలో సైతం అనుభవం, సీనియార్టీ ఉన్న నేతలు చాలామందే ఉన్నారు. కాని ఆవిధానంగా పార్టీ అడుగులు వేసినట్లుగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ల విషయానికి వస్తే విహన్మంతరావు, నంది ఎల్లయ్య, డి. శ్రీనివాస్‌తో పాటు ఇంకా ఇంకా వేళ్లపై లెక్కపెట్టలేనంత మంది ఉండనే ఉన్నారు. ఇప్పటికే రాజకీయంగా అపారఅనుభవం కలుగి ఉండడమేకాక, పరిపాలనా పరంగా కూడా అనుభవం ఉన్న వారిని ఏమాత్రం లెక్కలోకి తీసుకోక పోవడంచూస్తుంటే తెలంగాణపై కాంగ్రెస్‌ సవతి ప్రేమ చూపిస్తూనే ఉందని తేటతెల్లం అయింది. ఏళ్లతరబడి పార్టీలో ఉన్న నేతలు కూడా బుజాలపై జండాను వేసుకుని ప్రజాప్రతినిధులను గెలిపించుకు వచ్చిన వారున్నారు. అంతే కాకుండా ప్రజాభిమానం ఉన్న నేతలు కూడా ఉన్నా వారికి అధికారిక మంత్రి పదవులు కట్టబెట్టకుండా నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈరోజు కేబినెట్‌లో బెర్త్‌లు పొందిన వారిని చూస్తే పక్కాగా తెలంగాణకు వ్యతిరేకులు, అనునిత్యం తెలంగాణవాదాన్ని బొందపెట్టేందుకు ప్రయత్నిస్తున్నవారే కావడం మరోవిశేషం. అంటే తెలంగాణవాదాన్ని ఎత్తుతున్నవారిని ఎంతమాత్రం ఉపేక్షించరనే వాదన కూడా స్పష్టం అవుతోందని, ఇదే నిజమైతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి దుర్బర స్థితులు ఎదురు కాక తప్పవనేది వాస్తవం. ఎన్నికల సంవత్సరంలో కూడా కాంగ్రెస్‌ అధిష్టానం ఇలా తెలంగాణకు చెందిన నేతలను ఏమాత్రం ఖాతరు చేయకుండా సీమాంధ్రులకు అందునా తెలంగాణాను అడుగడుగునా వ్యతిరేకిస్తున్న వారికే పదవులు కట్టబెట్టడం శోచనీయం అంటున్నారు పరిశీలకులు. ఈ వ్యవహారాన్ని చూస్తుంటే తెలంగాణలో ఎలాగూ కాంగ్రెస్‌ బతికి బట్టగలిగే పరిస్థితులు లేవని గుర్తించారా అనే అనుమానం కూడా కలుగుతోంది. తెలంగాణలో ఎలాగూ పార్టీ మునిగిపోక తప్పదని, కనీసం సీమాంధ్రలోనైనా కాపాడుకుందామనే భావనలో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడ  బలంగా ఉన్న వైసిపిని ఎదుర్కొనేందుకు ఇలా పార్టీ, మంత్రి పదవులను కట్టబెట్టి అయినా ప్రజల్లోకి వెల్లేలా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణాకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు వస్తుంటే ఈచర్యలు మాత్రం పార్టీకి ఇబ్బందులు కలుగక మానదు.