కేంద్ర దర్యాప్తు సంస్థకు స్వతంత్ర హోదా

మంత్రుల కమిటీ ఏర్పాటు
‘సుప్రీం’ చివాట్లతో కదిలిన సర్కార్‌

న్యూఢిల్లీ : సర్వోన్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు స్వతంత్ర ¬దా కల్పించే విషయమై చర్యలు చేపట్టింది. సీబీఐపై ఇతరుల ప్రభావం లేకుండా చట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. దర్యాప్త సంస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం నేతృత్వంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని ఈ కమిటీలో న్యాయ శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌, విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, ప్రధాని కార్యాలయ వ్యవహారాల శాఖ మంత్రి వి.నారాయణ స్వామి సభ్యులుగా ఉన్నారు. సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా కమిటీలో ప్రాతినిథ్యం వహించనున్నారు. సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు గాను అవసరమైన ముసాయిదా నివేదిక రూపొందించాలని, కోర్టుకు సమర్పించేందుకు అవసరమైన అఫిడవిట్‌కు రూపకల్పన చేయాలని ప్రధాని కమిటీకి సూచించారు. ఈ కమిటీ సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై చర్చించి, ముసాయిదా నివేదిక రూపొందించనుంది.బొగ్గు కుంభకోణం దర్యాప్తులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, సీబీఐ స్థాయి నివేదికను తెప్పించుకొని చూడడంతో పాటు మార్పుచేర్పులు చేయడంపై తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ఇటీవల సీబీఐకి, ప్రభుత్వానికి గట్టిగా చివాట్లు పెట్టింది. సీబీఐ పంజరంలో చిలుకలా మారిపోయిందని, మాస్టార్లు చెప్పినట్లు పలుకుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎవరి నేతృత్వంలోనూ పని చేయాల్సిన అవసరం లేదని, పూర్తి స్వతంత్రంగా వ్యవహరించాలని ఆదేశించింది. అదే సమయంలో ప్రభుత్వానికి గట్టిగా మొట్టికాయలు వేసింది. సీబీఐ నివేదికను తెప్పించుకోవడంతో పాటు మార్పు చేర్పులు చేసిన తీరును తీవ్రంగా ఆక్షేపించింది. దర్యాప్తు సంస్థలో జోక్యం చేసుకోవడంపై మండిపడింది. సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. స్వతంత్ర ¬దా కల్పించాలని 16 సంవత్సరాల క్రితమే న్యాయస్థానం ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసిన ధర్మాసనం… ఆ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. సీబీఐకి స్వతంత్ర ¬దా కల్పించే విషయంలో జూలైలోగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేకుంటే తామే చర్యలు చేపట్టాల్సిన వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై మంత్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.