కేంద్ర ప్రభుత్వం చర్యలకు నిరసనగా – లాయర్ల విధుల బహిష్కరణ

విజయనగరం, జూలై 11 : దేశంలో న్యాయవాదుల విధి విధానాలను రూపొందించి వారిని నడిపించే బార్‌ కౌన్సిల్‌ బదులు కొత్తగా ఓ నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి న్యాయవాదులు నిరసన తెలిపారు. దీనిలో భాగంగా రెండు రోజుల పాటు విధులు బహిష్కరణకు నిర్ణయించి బుధవారం గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాదులు ఎస్‌.రాజు, తమ్మన్నశెట్టి మాట్లాడుతూ, భారతదేశంలో న్యాయవాది వృత్తిని చేసుకునేందుకు విదేశీ న్యావాదులకు సైతం అవకాశం కల్పించేలా కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని భారత న్యాయవాద లోకం నిరసిస్తుందని చెప్పారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్స్‌ పిలుపు మేరకు తాము నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇలా ఉండగా విధులను బహిష్కరించిన న్యాయవాదులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.