కేంద్ర ప్రాధాన్యతలను బట్టే.. బడ్జెట్‌ను రూపొందించాం
– బడ్జెట్‌లో ఏముందో అదే చెప్పాం
– కాంగ్రెస్ నేతలు బడ్జెట్‌పై అవగాహన పెంచుకోవాలి
– కాంగ్రెస్ పాలనలో మైనర్ ఇరిగేషన్ ధ్వసమైంది
– వారి హయాంలో ఉన్న ఆయకట్టును కోల్పోయారు
– మిషన్ కాకతీయతో 22వేల చెరువులను బాగుచేశాం
– సంక్షేమం, అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉన్నాం
– ఎస్సీ, ఎస్టీ నిధులు దుర్వినియోగం అయ్యాయి
– మా హయాంలో సక్రమంగా ఖర్చు చేశాం
– ఏడాదిలో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తాం
– పరిపాలనలో కఠినంగా వ్యవహరిస్తాం
– గిరిజనుల పోడుభూముల బాధలు తీరుస్తాం
– పోడుభూముల సమస్యలను స్వయంగా పరిష్కరిస్తా
– నిరుద్యోగ భృతి అమలు కోసం అధ్యయనం చేస్తున్నాం
– సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత భృతి ఇస్తాం
– పనులు పారదర్శకంగా జరగాలనే రెవెన్యూశాఖను తనవద్దే ఉంచుకున్నా
– ద్రవ్య వినియోగ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి25(జనంసాక్షి) : కేంద్ర ప్రాధాన్యతలను బట్టే బడ్జెట్ రూపొందించామని, బడ్జెట్‌లో ఏముందో అదే చెప్పామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ద్రవ్య వినియోగం బిల్లుపై సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.. బడ్జెట్‌పై కాంగ్రెస్‌కు అవగాహన లేదన్నారు. పరిపాలనలో కూడా పెను మార్పులు వస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు. పరిమిత సమయానికి ఖర్చులు చూసుకోవడమే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని అన్నారు. అంతిమంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరిపాలనలో కఠినంగా వ్యవహరిస్తామని కేసీఆర్ అన్నారు. గిరిజనులు దరఖాస్తు చేసుకున్న భూములను ప్రభుత్వం నిరాకరిస్తే.. వారిని ఖాళీ చేయించమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. పోడుభూముల సమస్యలను స్వయంగా పరిష్కరిస్తామని కేసీఆర్ హావిూ ఇచ్చారు. నాలుగైదు నెలల్లో నిరుద్యోగ భృతి అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశామన్నారు. కరెంట్ కష్టాలను అధిగమించామని, 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ పదవుల్లో 34శాతం రిజర్వేషన్ ఇచ్చామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయంఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రం నియమించిన అధికారులు చేసే పనికి రాష్ట్రంపై నిందలు వేశారని విమర్శించారు. గతంలో కూడా తెరాస ప్రభుత్వంపై విపక్షాలు చాలా నిందలు వేశాయన్నారు. అయితే ప్రజలు మాత్రం కాంగ్రెస్ ఆరోపణలు తప్పని.. తెరాస విధానాలు సరైనవని తీర్పు ఇచ్చారని గుర్తు చేశారని సీఎం తెలిపారు. తెరాస విధానాలు, పనులు తప్పయితే ప్రజలు రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించే వారు కాదని పేర్కొన్నారు. విద్యారంగానికి 11.2 శాతం నిధులు కేటాయించామని కేసీఆర్ తెలిపారు. నిధులు తక్కువ ఖర్చు చేయడమనేది కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు కేటాయించిన దానికంటే అధికంగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అటవీ భూములకు పట్టాలు ఇచ్చి రైతులను మభ్యపెట్టిందని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో భయంకరమైన విద్యుత్ సమస్య ఉండేదని సీఎం గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉన్నామని కేసీఆర్ అన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తి 5వేల మెగావాట్లకుపైగా పెంచామని సీఎం తెలిపారు. పనులు పారదర్శకంగా జరగాలనే రెవెన్యూ శాఖను తన వద్దే ఉంచుకున్నానని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలో రైతుబంధు కొనసాగుతుందన్నారు. నిరుద్యోగ భృతి అమలు కోసం అధ్యయనం చేస్తున్నామని.. సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత భృతి ఇస్తామన్నారు. నిమ్స్ కోసం 270 ఎకరాల భూసేకరణ జరుగుతోందని చెప్పారు. పనులు జరగాలని కోరేది, కేసులు వేసి అడ్డుకునేదీ కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తులేనని కేసీఆర్ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో
రిజర్వేషన్లు పెంచితే కోర్టుకు వెళ్లింది కాంగ్రెస్ వాళ్లేనన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టులు తీర్చు ఇచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు న్యాయం జరగలేదని.. మార్కెట్ కమిటీ ఛైర్మన్లలో బీసీలకు 50 శాతం ఇచ్చింది తెరాసయే అని చెప్పారు. బీసీల కోసం 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం తమదన్నారు.
కాంగ్రెస్ పాలనలో మైనర్ ఇరిగేషన్ ధ్వసమైంది..
కాంగ్రెస్ పాలనలో మైనర్ ఇరిగేషన్ ధ్వసమైందని కేసీఆర్ అన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సులతో గుత్తేదారులకు దోచిపెట్టింది ఎవరో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రజలు ఉన్న ఆయకట్టును కోల్పోయారన్నారన్నారు. మిషన్ కాకతీయ కింద 22 వేల చెరువులను బాగుచేశామని చెప్పారు. చిన్ననీటి వనరులు ధ్వంసమవుతుంటే కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును యథావిధిగా కొనసాగిస్తే తీవ్ర నష్టం జరిగి ఉండేదని కేసీఆర్ వివరించారు. మహారాష్ట్రతో ఒప్పందం లేకుండానే గోదావరిపై ప్రాజెక్టులు చేపట్టారన్నారు. రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ సమస్యను పరిష్కరించలేదని దుయ్యబట్టారు. గోదావరిలో గతేడాది 1470 క్యూసెక్కుల నీరు వృథాగా పోయిందని చెప్పారు. రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామన్నారు. ఎకరాకు రూ.60లక్షల పరిహారం కోరుతూ రైతులను రెచ్చగొట్టి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించారని కేసీఆర్ ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో 7లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేందుకు నిర్ణయించామని చెప్పారు. వర్షాకాలంలో ఖమ్మం జిల్లాలో ఎన్‌ఎస్పీ ఆయకట్టుకు గోదావరి నీళ్లు ఇవ్వనున్నామన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే రైతులు ఏడాదిలో రూ.1.25 లక్షల కోట్ల పంట పండిస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చివరి రోజుల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రకటించారని.. ఆ ప్రాజెక్టు కోసం తనతో పాటు తెరాస ఎంపీలమంతా ఢిల్లీలో పోరాడమని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ఐటీ రంగం విస్తరణకు కృషి చేస్తున్నామని.. తెరాస హయాంలో ఐటీ ఎగుమతులు రూ.50వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు దాటిందని చెప్పారు. గత ఐడేళ్లలో టీఆర్‌ఎస్ విధానాలు సరైనవని ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. టీఆర్‌ఎస్ విధానాలు, పనులు తప్పయితే ప్రజలు రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించేవారు కాదన్నారు. పూర్తి పారదర్శకంగా పాలన అందిస్తామని, కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.