కేజ్రీవాల్‌ కారుపై దుండగుల దాడి

2

– తాటాకు చప్పుళ్లకు భయపడను

– కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 29(జనంసాక్షి):  పంజాబ్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ కారుపై సిక్కు కార్యకర్తలు ఇనుప రాడ్లతో, రాళ్లతో దాడి చేశారు. లూధియానాలో పార్టీ తరఫున ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కేజీవ్రాల్‌ సోమవారం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బయట నిలిపిన కేజీవ్రాల్‌ వాహనాన్ని కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ విషయమై కేజీవ్రాల్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఇతర పార్టీలు భయపడుతున్నట్లున్నాయి.. ఎవరెన్ని చేసినా నా స్ఫూర్తిని అడ్డుకోలేరు… అంటూ ట్వీట్‌ చేశారు.

కొన్ని రోజుల క్రితం లూధియానాలోని బోహా గ్రామంలో ఇద్దరు దళిత యువకులు బూటకపు ఎన్‌కౌంటర్‌గా పేర్కొంటున్న ఘటనలో మృతిచెందారు. కేజీవ్రాల్‌ ఇటీవల లూధియానా వెళ్లి మృతుల బంధువులను కలిశారు. మరో ఏడాదిలో బాదల్‌ టెర్రర్‌ పాలనను అంతమొందిస్తామని కేజీవ్రాల్‌ మృతుల కుటుంబీకులతో అన్నారు. ఇదిలావుంటే తాను ప్రధాని నరేంద్రమోదీ కన్నా పెద్ద దేశభక్తుడినని  కేజీవ్రాల్‌ అన్నారు. జేఎన్‌యూలో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వాళ్లు కశ్మీర్‌కి చెందినవారని కేజీవ్రాల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కశ్మీర్‌కి చెందిన వారు జేఎన్‌యూలో జాతి వ్యతిరేక నినాదాలు చేసినా.. వారిని ఎందుకు అరెస్టు చెయ్యలేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. వారిని అరెస్టు చేస్తే పీడీపీ నేత మహబూబా ముఫ్తీకి కోపం వస్తుందని… అందుకే అరెస్టు చెయ్యడం లేదని కేజీవ్రాల్‌ విమర్శించారు. సైనికులు ప్రతిరోజూ సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలు కోల్పోతుంటే.. ప్రధాని మోదీ కశ్మీర్‌లో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజమైన ద్రోహులను కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. తాను

దళితుల కోసం.. వెనకబడిన వర్గాల వారి కోసం పోరాడానని.. అలాంటి తనపై దేశద్రోహం కేసు నమోదైందని.. అయినా.. పేదలు, దళితుల కోసం తాను పోరాటం సాగిస్తానని ఆయన పేర్కొన్నారు. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా 9మందిపై హైదరాబాద్‌లో దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే.