కేజ్రీవాల్ నిర్ణయాలు జంగ్ పరిశీలిస్తారట
– ఢిల్లీలో (అ)ప్రజాస్వామ్యం
దిల్లీ,ఆగస్టు 8(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. దిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆయన ఎడ్డం అంటే ఈయన తెడ్డం అన్నట్లుగానే సాగుతోంది వ్యవహారం. తాజాగా వీరి మధ్య మరో వివాదం రాజుకుంది. కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలను జంగ్ పరిశీలిస్తారట. ఈ మేరకు ఆప్ అధికారం చేపట్టినప్పటి నుంచి కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను తీసుకురావాలని జంగ్ ఆదేశించినట్లు సమాచారం. అధికారుల బదిలీలు, నియామకాల ఫైళ్లను కూడా దిల్లీ మంత్రులకు కాకుండా నేరుగా తనకే పంపాలని చెప్పినట్లు తెలుస్తోంది.దిల్లీలో అధికారంపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. దిల్లీలో కేంద్ర ప్రభుత్వం కంటే.. రాష్ట్ర ప్రభుత్వానికే ఎక్కువ అధికారాలుండాలని కోరుతూ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేజ్రీవాల్ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దేశరాజధానికి అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా ఉన్న లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు దిల్లీ కేబినెట్ నిర్ణయాల్లో సూచనలు చేసే అధికారం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆప్ ప్రభుత్వం తెలిపింది.