కేటీఆర్ అమెరికా పర్యటన సక్సెస్
హైదరాబాద్,జూన్ 10(జనంసాక్షి): రెండు వారాలపాటు సాగిన అమెరికా పర్యటన విజయవంతమైందని మంత్రి కేటీఆర్ శుక్రవారం తెలిపారు. అమెరికాలోని అనేక రాష్టాల్రతో తెలంగాణ నూతన సంబంధాలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ పర్యటన దోహదం చేసిందన్నారు. తెలంగాణతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెట్టుకునేలా ఆయా రాష్టాల్రను ఒప్పించడంలో ఈ పర్యటన సత్ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల చైర్మన్లు, సీఈఓలతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. వాటి విస్తరణ ప్రణాళికలను తెలుసుకున్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. సిలికాన్ వ్యాలీలో మంత్రి చేసిన ప్రసంగంతో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఆలోచనలు అక్కడి ప్రముఖ కంపెనీ ప్రతినిధులు, పెట్టుబడిదారులను ఆకర్షించాయి. ఐటీ, బయోటెక్నాలజీ, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్, క్లీన్ టెక్ రంగాల్లోని కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమావేశాలు జరిపారు. అక్కడి టెక్నాలజీ పనితీరును తెలుసుకున్నామన్నారు. మొత్తంగా పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందన్న నమ్మకాన్ని కలిగించడంలో విజయవంతం అయ్యామని మంత్రి తారకరామారావు తెలిపారు. తన అమెరికా పర్యటనపై మంత్రి స్పందిస్తూ.. అమెరికాలోని పలు రాష్టాల్రతో సంబంధాలకు పర్యటన దోహదపడింది. వివిధ రాష్టాల్ర నుంచి పెట్టుబడులు వచ్చేలా చర్చలు జరిపాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని సంబంధిత రాష్టాల్ర గవర్నర్లను కోరాం. అక్కడి నగరాల విజయాలను రాష్ట్ర అభివృద్ధిలో వినియోగం చేయడంపై చర్చించాం. ప్రవాసులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు ముందుకువచ్చారు. ఈ పర్యటనతో రాష్టాన్రికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు.