కేటీఆర్ రాకతో మారనున్న సీన్
పార్టీ బలోపేతం లక్ష్యంగా కార్యాచరణ
రెండు ఎంపీ సీట్లు గెలవడం కోసం దిశానిర్దేశం
ఖమ్మం,మార్చి5(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల విజయమే స్ఫూర్తిగా తీసుకొని అన్ని పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 6 నుంచి రాష్ట్రంలో 16పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ¬దాలో కేటీఆర్ సవిూక్షలు చేపట్టబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తలెత్తిన లోపాలు పునరావృతం కాకుండా రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలోని జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక ఓట్లను పొందేలా ఈ సమావేశాల్లో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత యువనేత తొలిసారిగా హాజరుకానున్న సమావేశంలో పాల్గొనేందుకు జిల్లాలోని యువతీ, యువకులు, పార్టీ ముఖ్యనాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉత్సాహం చూపుతున్నారు. భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ముందుగా అనుకున్న షెడ్యూల్‌లో మార్పు జరిగింది. శుక్రవారం ఈ సన్నాహక సమావేశాల షెడ్యూల్ విడుదల కావడంతో పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లేలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు వ్యూహరచన చేయనున్నారు. తొలిసారిగా ఈ నెల 16న ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహాక సమావేశాలకు భద్రాద్రి జిల్లాలోని పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలి వెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుండగా, ఇల్లెందు, పినపాక, భధ్రాచలం నియోజకవర్గాలు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తున్నాయి. ఖమ్మం ఎంపీ సీటు పరిధిలోని రెండు నియోజకవర్గాలు, మహబూబాబాద్ ఎంపీ సీటు పరిధిలోని మూడు నియోజకవర్గాల నుంచి భారీస్థాయిలో పార్టీ శ్రేణులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు.