కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి
శాస్త్రవేత్తలు ఆ దిశగా కృషి చేయాలి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం
హైదరాబాద్ మార్చి 29 (జనంసాక్షి):
ప్రాథమిక దశలోనే కేన్సర్‌గుర్తించేలా శాస్త్ర వేత్తలు కృషి చేయాలని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కోరారు. బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఆంకాలజీ సమ్మిట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నానో టెక్నాలజీ, మాలిక్యూలర్ బయాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా కేన్సర్‌ను గుర్తించే పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. పొగాకు ఉత్పత్తులను అరికట్టడం వల్ల కేన్సర్‌ను అరికట్టవచ్చన్నారు. మారుమూల ప్రాంతాల్లో కేన్సర్‌పై ప్రచారం చేయాల్సిన అవసరముందన్నారు. అనంతరం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి సేవలను కలాం ప్రశంసించారు. ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ కేన్సర్ నిర్ధారణ, చికిత్సకు అత్యాధునికి పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలున్న బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం దేశంలో కేన్సర్ వ్యాధి నివారణకు కృషి చేసిన డాక్టర్ డీడీ పటేల్‌ను రాష్ట్రపతి సత్కరించారు. ఆస్పత్రి సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, కేన్సర్ వైద్య నిపుణులు పాల్గొన్నారు.