కేసీఅర్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం లో ప్రతిపక్షాలు విఫలం

.వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల
శ్రీరంగాపురం, ఆగస్టు26(జనంసాక్షి) :
కేసీఅర్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం లో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని, కాంగ్రెస్, బీజేపీ లు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే అని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం శ్రీరంగాపూర్ మండలానికి చేరుకోగా ఆమె ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించి మట్లాడారు. నేటికి 1800కి.మీటర్ల మైలు రాయి దాటిందని తెలిపారు.  బీజేపీ మత పిచ్చి పార్టీ అని, మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. 13 ఏళ్ల క్రితం చనిపోయిన వైఎస్సార్ ను ఇప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు.  ప్రతి పథకం ప్రజలకు గుర్తుందని,  కేసీఅర్ 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను మోసమే చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ పాలమూరు జిల్లా అంటే కేసీఅర్ కి చిన్న చూపు అని, అసలు దక్షిణ తెలంగాణ అంటే నే కేసీఅర్ కు ప్రేమ లేదన్నారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని, ఆత్మగౌరవం అని చెప్పి మోసం చేశారన్నారు. మూడు ఎకరాల భూమి అని మోసమని, ఇలా ప్రతిదీ మోసమే అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రుణమాఫీ అని చెప్పి మోసం చేశారు.  రైతులకు ఎకరాకు 5 వేలు ఇచ్చి 30 వేల లబ్ది పతకాలు బందు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎన్నికలు వస్తున్నాయి ..కేసీఅర్ మళ్ళీ వస్తాడని, గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తడని ఎద్దేవా చేశారు. ఈ సారి కేసీఅర్ కి ఓటు వేస్తే మన భవిష్యత్ మనలను క్షమించదని చెప్పారు. ఆలోచన చేసి మీకోసం నిలబడే వారికి ఓటు వేయండన్నారు. ఓటు మీ జీవితాలను మార్చే ఆయుధమని, వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకు రావడం కోసమే పార్టీ పెట్టామని, ఆశీర్వదించండి… వైఎస్సార్ ప్రతి పథకాన్ని నిలబెడతానని మాట ఇస్తున్నామని చెప్పారు.