కేసీఆర్‌ను ఫాంహౌస్‌కే..  పరిమితం చేద్దాం


– కృష్ణా నదీ జలాలు తెస్తానని కేసీఆర్‌ మోసం చేశాడు
– బీడు భూములను చూస్తుంటే బాధేస్తుంది
– కాంట్రాక్టర్ల జేబులను నింపేందుకు కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు
– అది తెలిసిన తరువాతనే కేసీఆర్‌ ను వ్యతిరేకించాం
– ప్రజాకూటమితోనే అభివృద్ధి సాధ్యమవుతుంది
– కొస్గీ బహిరంగ సభలో ప్రజా కూటమి కన్వీనర్‌ కోదండరాం
మహబూబ్‌నగర్‌, నవంబర్‌28(జనంసాక్షి) : నాలుగేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల కలలకు విరుద్ధంగా కేసీఆర్‌ పాలన సాగించారని, కేవలం ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని, ఓటుతో బుద్దిచెప్పి శాశ్వితంగా ఫాంహౌస్‌కే కేసీఆర్‌ను పరిమితం చేద్దామని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. బుధవారం
మహబూబ్‌ నగర్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం కొస్గీలో జరిగిన రాహుల్‌గాంధీ బహిరంగ సభలో కోదండరాం పాల్గొని ప్రసంగించారు. మహబూబ్‌నగర్‌లో వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్‌ జిల్లాలో ఏ పార్టీకి సరైన నాయకత్వం లేని వేళ, ఓ యువకుడిగా వచ్చిన రేవంత్‌ రెడ్డి రాజకీయాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఇక్కడి ప్రజల సమస్యలను తీరుస్తూ, ఓ కొదమసింహంలా ప్రభుత్వాలతో పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కోదండరామ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం రావాలని పోరాటం చేసిన నేతల్లో రేవంత్‌ కూడా ఉన్నారని గుర్తు చేశారు. కృష్ణా నదీ జలాలను ఇక్కడికి తెస్తానని టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హావిూలు నెరవేరలేదని అన్నారు. ఇక్కడ కురిసే ప్రతి వర్షం చుక్కా కృష్ణానదిలోకే వెళుతుందని కోదండరాం గుర్తుచేశారు. చాలా సులభంగా ఆ నీటిని ఈ ప్రాంతానికి తరలించవచ్చని, కానీ ఆ ఆలోచన పాలకులకు రాలేదని విమర్శలు గుప్పించారు. ఇక్కడి పొలాలు బీడు భూములుగా కనిపిస్తున్నాయని, వస్తాయనుకున్న నీరు రావడం లేదని, ముక్కెక్కడుందంటే, చుట్టూ తిప్పి చూపించినట్టుగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జూరాలను వదిలి శ్రీశైలం నుంచి నీటిని మళ్లించడం ఏంటని ప్రశ్నించారు. ఆయన మాటలను నమ్మేందుకు చెవుల్లో పూలు పెట్టుకుని లేమని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో పట్టుదల ఉన్నవారని, ఇక్కడికి నీరు తెప్పించేవరకూ వారు విశ్రమించరని అన్నారు. కాంట్రాక్టర్ల జేబులను నింపేందుకు కేసీఆర్‌ నిర్ణయించుకున్నారని తెలిసిన తరువాతనే కేసీఆర్‌ ను వ్యతిరేకించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ను ఓడించాల్సిందేనని, తద్వారా ఫాంహౌస్‌లో ఉండే ఆయన్ను అక్కడికే పరిమితం చేద్దామని కోదండరాం పిలుపునిచ్చారు.