కేసీఆర్ కార్యసాధన యాత్ర
న్యూఢిల్లీఫిబ్రవరి 15 (జనంసాక్షి):ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ- ముంబై టూరుకు ఆయన ఆదివారం ప్రత్యేక విమానంలో బయలు దేరి వెళ్లారు. మూడురోజులే అయినా.. అత్యంత కీలకమైన అంశాలను కొలిక్కి తెచ్చేందుకు సమాయత్తమవుతున్నారు.
ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ, ఇతర కేంద్ర మంత్రులతో వివిధ అంశాలపై చర్చించి, సోమవారం రాత్రి ముంబై వెళ్లి.. మంగళవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో పలు సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకిగా ఉన్న కీలక అంశాలపై సమావేశం కానున్నారు. మంగళవారం మహా శివరాత్రి పర్వదినమే కాకుండా.. కేసీఆర్ జన్మదినం కూడా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ జరుపుకోవాల్సిన తొలి పుట్టినరోజు కూడా ఇదే కావడం విశేషం. అయినా.. ఆ రోజు పుట్టినరోజు అయినప్పటికి అధికార పర్యలనకు పూనుకున్నారు.
రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు కీలక అంశాల పరిష్కారమే తన పుట్టినరోజు కానుకగా ఆయన భావిస్తున్నారు. తన కుమారుడి పెండ్లి రిసెప్షన్‌కు రావాల్సిందిగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆ వేడుకలో పాల్గొనేందుకు వెళుతున్న సీఎం.. పనిలోపనిగా రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని భావిస్తున్నారు.
గతవారం ఐదురోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్ర అవసరాలను ప్రస్తావించిన కేసీఆర్.. నీతి ఆయోగ్ తొలి సమావేశంలోనూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో కొద్దిసేపు ముచ్చటించారు. అయితే, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఆయనకు అప్పట్లో తగిన సమయం చిక్కలేదు. దీంతో తాజా పర్యటన సందర్భంగా ప్రధానితో ఆయన వివిధ అంశాలపై చర్చలు జరుపనున్నట్లు తెలుస్తున్నది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెండింగ్‌లో ఉన్న విషయాలను ఆయన ప్రధాని వద్ద ప్రస్తావించనున్నట్లు తెలుస్తున్నది.
ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర పథకాలకు సంబంధించి రావాల్సిన బకాయిలు తదితరాలపైనా ప్రధాని నుంచి స్పష్టమైన హావిూ పొందనున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఐదున్నరకు మోదీని ఆయన నివాసానికి వెళ్లి కలువనున్నారు. రానున్న బడ్జెట్‌లో తెలంగాణకు వివిధ పథకాలకు నిధులను కేటాయించాలని ఈ సమావేశం సందర్భంగా మోదీకి కేసీఆర్ విన్నవించనున్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల తరహాలోనే తెలంగాణ ప్రభుత్వంకూడా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్ర పథకాలకు ఇచ్చే నిధులను రాష్ట్ర పథకాలకు వెచ్చించే విషయంపై కూడా ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్ కాకతీయను లాంఛనంగా ప్రారంభించడానికి ప్రధానిని స్వయంగా ఆహ్వానించే అవకాశం కూడా ఉంది. ఈ పర్యటనలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో కూడి కేసీఆర్ భేటీ అవుతారని సమాచారం. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ ¬దాతోపాటు అవసరమైన అన్ని సాంకేతిక అనుమతులను మంజూరు చేయాలని కోరడం, కేంద్రంనుంచి ఈ పథకానికి ఆర్థిక సాయం కోరడం కూడా ఢిల్లీ పర్యటనలో ప్రధాన అంశంగా ఉండనుంది. కాకతీయ మిషన్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా తొలి నుంచీ ఉమాభారతికి విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి స్వయంగా ఆమెను ఆహ్వానించే అవకాశం కూడా ఉంది.
ఢిల్లీ నుంచి ముంబైకి
రెండు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి నేరుగా ముంబై వెళ్ళనున్నారు. రాష్ట్రంలోని ప్రాణహిత-చేవెళ్ళ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుతో పాటు ఇచ్ఛంపల్లి, పెన్‌గంగ, లెండి తదితర సాగునీటి ప్రాజెక్టుల గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కేసీఆర్ చర్చించనున్నారు.
పలు చెక్ డ్యామ్‌ల గురించి కూడా ఈ భేటీలో వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించే దిశగా ఫడ్నవిస్‌తో కేసీఆర్ చర్చలు జరుపుతారని, రాష్ట్రానికి సానుకూలరీతిలో ఒప్పందాలు చేసుకుని వస్తారని సమాచారం. ఉద్యమం సందర్భంగా తాను ఇచ్చిన హావిూలన్నింటినీ నెరవేర్చడంతోపాటు, పెండింగ్ ప్రాజెక్టుల అంశాలను ఒక కొలిక్కి తేవాలని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన సన్నిహితవర్గాల ద్వారా తెలుస్తున్నది. మంగళవారం మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా సెలవు అయినప్పటికీ.. మహారాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌తో చర్చలకు సానుకూలత వ్యక్తం చేయడం విశేషం. ఇటీవలే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ముంబై వెళ్లి.. వివిధ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర నుంచి సహకారాన్ని కోరి వచ్చారు. ఇప్పుడు వాటికి తుదిరూపునిచ్చేందుకు కేసీఆర్ వెళుతున్నారు.
లోయర్ పెన్‌గంగ పొంగడం వల్ల ప్రతిసారీ తాంసీ, బేల, జైనథ్ మండలాలు జలదిగ్బంధంలో చిక్కుపోతున్నాయి. వేల ఎకరాల్లో పత్తి, సోయాబీన్ వంటి పంటలు మునిగిపోతున్నాయి. వీటన్నింటినీ గతంలో ప్రత్యక్షంగా పరిశీలించిన సీఎం.. ఎట్టిపరిస్థితుల్లోనూ లోయర్‌పెన్‌గంగ ప్రాజెక్టు కట్టితీరుతామని హావిూ కూడా ఇచ్చి ఉన్నారు. దీనికి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర అనుమతి కూడా తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో మార్గం సుగమం చేసే దిశగా కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనను ఉద్దేశించుకున్నారు.
లోయర్ పెన్‌గంగ ప్రాజెక్ట్ కడితే దాదాపు 70వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ఇచ్ఛంపల్లి విషయంలో కూడా గత సమైక్య ప్రభుత్వాల హయాంలో తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై గతంలో ఒప్పందాలు కుదిరినా ఆచరణలోకి తేలేదు. దాని ఫలితాన్ని ఆదిలాబాద్ ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇకనైనా దీనికి చెక్ చెప్పాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. దీనితోపాటు లెండి తదితర పెండింగ్ ప్రాజెక్టులపైనా, గోదావరిపై నిర్మించ తలపెట్టిన అన్ని ప్రాజెక్టులపైనా తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారులు, ఇరిగేషన్ మంత్రుల మధ్య చర్చలు కూడా జరిగాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఇదే పనిపై గతంలో పర్యటన కూడా జరిపారు. ఇప్పుడు దీనికి తుదిరూపునిచ్చేందుకు ముఖ్యమంత్రి సంకల్పించారు. తన పుట్టినరోజున మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపే చర్చలు ఫలప్రదమైతే.. అదే తనకు గొప్ప బహుమతిగా ఆయన భావిస్తున్నారు.