కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తా

1

సీఎంతో భేటీ అనంతరం రాజయ్య

హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): తాను సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య స్పష్టం చేశారు. సోమవారం ఆయన సీఎంను కలిసిన అనంతరం విూడియాతో మాట్లాడారు. తాను జిల్లా ఇన్‌ఛార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి కేసీఆర్‌ను కలిశానని వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటిపై సీఎంతో మాట్లాడానని రాజయ్య పేర్కొన్నారు. రేపటి పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకావాలని సీఎం తనను వ్యక్తిగతంగా ఆహ్వానించారని రాజయ్య వెల్లడించారు. కొంపల్లిలోని ఆర్డీ ఫంక్షన్‌హాల్‌లో జరుగబోయే సమావేశానికి తాను హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. కాగా, రేపు టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగనున్న విషయం తెలిసిందే. గులాబీ జెండా పట్టుకుని కేసీఆర్‌తో కలిసి తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు. అడగకుండానే సీఎం తనకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారని అన్నారు. మళ్లీ కార్యకర్తగా టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన నియోజకవర్గం ప్రజల సంక్షేమానికి, నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాలు, స్వైన్‌ఫ్లూ పట్ల నిర్లక్ష్యం వహించారంటూ జనవరి 25న రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి కేసీఆర్‌ తొలగించిన విషయం తెలిసిందే.