కేసీఆర్‌ విజనున్న మహానేత

5

– రెండేళ్ల పాలనే నిదర్శనం

– గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌,జూన్‌ 2(జనంసాక్షి): కేసీఆర్‌ విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి అని గవర్నర్‌ నరసింహన్‌ కితాబిచ్చారు. ఎంతో సమర్థవంతంగా పాలన నిర్వహిస్తున్నారని శ్లాఘించారు. రాష్ట్రంలో రెండేళ్లుగా శాంతిభద్రతల విషయంలో ఢోకాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ ఆషామాషీ పథకం కాదని కొనియాడారు. ప్రజలకు మంచినీరు అందించాలనే తపన అమోఘమన్నారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్బావ వేడుకల్లో సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌ గ్రహీతలకు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన పాలనా తీరు అమోఘమన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు, కళాకారులు, ప్రముఖులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం  కేసీఆర్‌ మాట్లాడుతూ… మూడేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రమనేది ఒక కలని… 3.5కోట్ల మంది ప్రత్యేక రాష్ట్రం కోసం ఎదురుచూశారన్నారు. రాష్ట్రం కల సాకారమై.. రెండేళ్లుగా తెలంగాణ అభివృద్ధి దిశలో సాగుతోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ వృద్ధి రేటు… జాతీయ వృద్ధి రేటు కంటే అధికంగా ఉందన్నారు. రెండేళ్ల ప్రస్థానం, భవిష్యత్‌ మార్గనిర్దేశంపై అందరి సమక్షంలో గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక… ఉన్న కొద్ది శాఖలతోప్రణాళిక ప్రకారం పనిచేశామన్నారు. రాష్ట్ర వృద్ధిరేటు ప్రకారం 2019-20 నాటికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.2లక్షల కోట్లు, 2024నాటికి రూ.5లక్షల కోట్లు ఉండబోతోందని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక నిధుల సమస్యల పరిష్కారమైందన్నారు. 2022 నాటికి రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి నుంచి 1300 టీఎంసీలు రాష్టాన్రికి కేటాంయిచినట్లు కేసీఆర్‌ తెలిపారు. పోలవరం వద్ద ఏటా గోదావరిలో 2,654 టీఎంసీలు ఉంటున్నాయని… సీడబ్ల్యూసీ రికార్డులు ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ రికార్డుల ప్రకారం… కృష్ణాలో 1,204 టీఎంసీల ఇన్‌ఫ్లో, కృష్ణా, గోదావరిలో కలిపి 3,855 టీఎంసీల నీళ్లు నికరంగా కనబడుతున్నాయన్నారు.

తెలంగాణ ఆర్థిక వృద్ధిరేటు జాతీయ వృద్ధిరేటుకంటే ఎక్కువగా ఉందని సీఎం అన్నారు. ఎఫ్‌ఆర్డీం 0.5 శాతం పెంచి కేంద్రం కూడా మాటను రుజువు చేసిందని వెల్లడించారు. 2019-20 సంవత్సరంలో తెలంగాణ బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. 2014 నాటికి తెలంగాణ బడ్జెట్‌ రూ.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని వివరించారు.ఇవాళ తెలంగాణ ఏర్పడటమే కాదు, ఘనంగా ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్రం కావాలని కోరుకున్నాం, కొద్దిగా ఆలస్యమైనా విజయం సాధించామని తెలిపారు. తెలంగాణ సర్కార్‌ పొరుగు రాష్టాల్రతో సత్సంబంధాలను కొనసాగిస్తుందని సీఎం  అన్నారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు మంచిదికాదని హితవు పలికారు. విజ్ఞతతో వ్యవహరించి ఉభయ రాష్టాల్ర రైతులకు లాభం చేకూర్చుకుందామని పిలుపునిచ్చారు. కృష్ణా నదిలో ప్రతీ ఏడాది 1204 టీఎంసీల నీటి ప్రవాహం ఉంటుందని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి కలిపితే 3858 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అన్ని రకాలుగా తెలంగాణ, ఆంధ్రాకు 4200 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. 4200 టీఎంసీలతో 4 కోట్ల ఎకరాలకు సాగునీరు పారించుకోవచ్చని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన వాటాను వాడుకుని కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.

ప్రముఖులకు అవార్డుల బహుకరణ

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పలువురు ప్రముఖులకు ప్రకటించిన అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలకు రూ.లక్షా 116 నగదు పురస్కారంతోపాటు శాలువా, సర్టిఫికెట్‌, మొమెంటోతో సత్కరించారు. కాగా, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొత్తం 29 విభాగాల నుంచి 62 మంది ప్రముఖులను ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. అవార్డులకు ఎంపికైన వారిలో సాహిత్యం-7, నృత్యం-2, జానపద నృత్యం-1, సంగీతం-2, జానపద సంగీతం-5, ఉద్యమగానం-3, పెయింటింగ్‌-1, వేద పండితులు-1, అర్చకులు-2, ఆధ్యాత్మికం-1, సైంటిస్టులు-3, జర్నలిస్టులు-6, హస్త కళలు-6, క్రీడలు-2, ఉద్యోగులు-9, వైద్యులు-1, ఎన్‌జీవో-1, సోషల్‌ వర్క్‌-1, రైతులు-3, అంగన్‌వాడీ వర్కర్స్‌-1, ఉత్తమ మున్సిపాలిటీగా ఖమ్మం, ఉత్తమ గ్రామ పంచాయతీలు-3, న్యాయవాదులు-1, ఔత్సాహికులు-1, టీచర్లు-2, ఆధునిక రైతు-1, మాజీ సైనికులు-2, ధైర్యసాహసాలు-1 ఉన్నారు.