కేసీఆర్ చెప్పిందే హరీశ్ చేశాడు
` సొంతంగా ఏదీ చేయడు: నిరంజన్ రెడ్డి
` ఆయనను టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరం
` వీరబ్రహ్మం చరిత్రలో సిద్ధయ్యలాగా పనిచేశారు
` కేసీఆర్ ఏది చెపితే అది కాదనకుండా చేశారు
` మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్(జనంసాక్షి):వీరబ్రహ్మం చరిత్రలో సిద్ధయ్యలాగ కేసీఆర్ ఏది చెపితే అది హరీశ్‌రావు చేశారు అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి హరీశ్‌రావు గొప్ప సంపద, ఆయన ట్రబుల్ షూటర్ అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత సభలో హరీశ్‌రావు అధికార పక్షాన్ని అద్భుతంగా చెడుగుడు ఆడుకున్నాడు. 30సార్లు ఆటంకం కలిగించినా అన్ని విషయాలను వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లతనాన్ని ఎండగట్టారు. ఎవరి ప్రయోజనం నెరవేర్చడానికో, ఎవరికి బలం చేకూర్చడానికో కొంత మంది హరీశ్‌రావును టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సందర్భంలో కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీకి ఎవరైనా సరే తెలంగాణను ప్రేమించే వారు, ప్రత్యేకంగా బీఆర్‌ఎస్ నేతలు రక్షణ కవచంగా ఉండాల్సిన సందర్భం ఇది. బీఆర్‌ఎస్‌పై చేస్తున్న కుట్రపూరిత ఆరోపణలరకు తావ్వికుండా చీల్చి చెండాల్సింది పోయి, ఖండిరచాల్సింది పోయి వారికి ఊతమిచ్చే విధంగా మాట్లాడడం బాధాకరమని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.కేసీఆర్ 2000లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి హరీశ్‌రావు ఉన్నారు. ఎదురు చెప్పకుండా, ప్రశ్నించకుండా.. వీరబ్రహ్మం చరిత్రలో కేసీఆర్ ఏది చెపితే అది సిద్ధయ్యలాగ హరీశ్‌రావు చేశారు. పార్టీ కలర్ కోసం బేగం బజార్ పోయి రంగులు తీసుకొచ్చింది ఆయనే. జలదృశ్యంలో దిమ్మె కట్టించింది హరీశ్‌రావే.. అక్కడ్నుంచి ప్రస్థానం మొదలుపెట్టారు. ఇవాళ శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా క్రమశిక్షణ కలిగిన పార్టీ వర్కర్‌గా పని చేస్తున్నారు. ప్రజల కోసం పని చేశారు హరీశ్‌రావు. విరామం లేకుండా పని చేశారు. ఆయన పనితీరును గతంలో ఇప్పుడు మాట్లాడుతున్న వారు కూడా ప్రశంసించారు. ఇవాళ రివర్స్ గేర్ చేసి ఆలయనను తులనాడి మాట్లాడడం మనసు ఎలా ఒప్పుకుంటుంది అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.ఈటల రాజేందర్ పార్టీలో ఉండేలా చివరి నిమిషం వరకు హరీశ్‌రావు ప్రయత్నించారు. ప్రజాభిమానాన్ని చూరగొనడంలో హరీశ్‌రావును చూసి నేర్చుకోవాలి. బీఆర్‌ఎస్ పార్టీకి హరీశ్‌రావు ఒక సంపద.. ట్రబుల్ షూటర్.. ఉప ఎన్నిక ఎక్కడ వచ్చినా గెలిపించుకున్న కార్యదక్షుడు ఆయన. ఇలాంటి నాయకులను బలహీన పరుచుకుంటే తెలంగాణ సమాజానికి నష్టం కలుగుతుంది. కాళేశ్వరం అనుమతుల కోసం 27 సార్లు మహారాష్ట్ర పోయిండు. అనేక ప్రయత్నాలు చేసి కాళేశ్వరం నిర్మించారు. కేసీఆర్ ఆయనకు అప్పగించిన అన్ని శాఖలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. గతంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన పనితీరును బహిరంగంగా మెచ్చుకున్నాయి. హరీశ్‌రావుపై నిందలు వేయడం సరికాదు. రేవంత్ కాళ్లు హరీశ్‌రావు మొక్కాడు అని రాజకీయాల కోసం నీచంగా మాట్లాడడం సరికాదు. ఇలాంటి ప్రచారం ఎవరూ నమ్మరు. కవితకు కష్టం వచ్చినప్పుడు పార్టీ మొత్తం అండగా నిలిచింది. కవితను జైలు నుంచి తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీశ్‌రావు ఎన్నో ప్రయత్నాలు చేశారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లతనాన్ని కేటీఆర్, హరీశ్‌రావు ఎండగడుతున్నారు. ఎవరికి లాభం జరగాలని హరీశ్‌రావును టార్గెట్ చేస్తున్నారు..? కేసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడు సంతోష్ రావు. ఆయన గురించి మాట్లాడడం కూడా సరికాదు. భవిష్యత్ పట్ల ఏదేదో ఊహించుకుని మాట్లాడితే అది అపరిపక్వత అవుతుందని నిరంజన్ రెడ్డి అన్నారు.