కొందరికి మార్పు వశపడుతలేదు

5

పబ్లిక్‌ హెల్త్‌ ప్రాంతీయ క్యాంపస్‌కు శంకుస్థాపన

10 కోట్లు తక్షణం విడుదల

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి3(జనంసాక్షి): తమ ప్రభుత్వం చేస్తున్న పనులను, తలపెట్టిన మార్పును కొందరు సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారని సిఎం కెసిఆర్‌ అన్నారు. సమాజాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మేధావులపై ఉందన్నారు. ఓ మంచి నిర్ణయం అమలు కావాలంటే మార్పులు తప్పవన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ ఆమోదం తెలపాలన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ దక్షిణ ప్రాంతీయ క్యాంపస్‌కు మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ సంస్థను ప్రారంభించినందుకు ఆనందంగా ఉందన్నారు.  ప్రభుత్వ వైద్యులకు, పారామెడికల్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఈ సంస్థ ఉపయోగపడుతుందన్నారు. సంస్థకు విశ్వవిద్యాలయ ¬దా ఇవ్వాలని కోరారు… పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి రూ.60కోట్లు ఇవ్వాలని సంస్థ ప్రతినిధులు కోరారు… సానుకూలంగా పరిశీలిస్తామని వెల్లడించారు. ఐఐపీహెచ్‌కు ఇప్పటికిప్పుడే రూ.10కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మంచి ఆశయంతో ఏర్పాటు చేసిన సంస్థను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ సంస్థను ఏర్పాటు చేసిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరపున ఈ సంస్థకు సహకారం అందిస్తామని ప్రకటించారు. హెల్త్‌ క్యాంపస్‌ కోసం తక్షణమే రూ. 10 కోట్లు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.. అయినా ఎక్కడో ఏదో లోపం ఉన్నదని పేర్కొన్నారు. ఎంతసేపు మందులు, ప్రిస్కిప్షన్‌, డయాగ్నోస్టిక్‌ తప్ప హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ శిక్షణ ఇంత వరకు లేదని గుర్తు చేశారు. డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందికి హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌ తనకు తాను ఒక సంఘంగా బతుకుతుంది. హైదరాబాద్‌ను తామే బతికిస్తున్నామనే భ్రమలో ఉండొద్దని సూచించారు. పనికిమాలిన ఇగోలు పెట్టుకోవడం మంచిది కాదన్నారు. మంచితనమే సమాజాన్ని బతికిస్తుందన్నారు. దేశంలోనే తెలంగాణ బెస్ట్‌ హెల్త్‌ స్టేట్‌గా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వంద శాత బాగుపడుతదని చెప్పారు. అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు  విశ్వేశ్వర్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు.