కొత్త జిల్లాలపై నేడు అఖిలపక్షం

5

– తుదిదశకు జిల్లాల ఏర్పాటు

హైదరాబాద్‌,ఆగస్టు 19(జనంసాక్షి): తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు నేటితో కొలిక్కి రానుంది. ఇప్పటికే దీనిపై దాదాపు ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం కొత్తగా 17 జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదించింది. శనివారం జరిగే అఖిలపక్షంలో ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప, విపక్షాల ఒత్తిడికి ఒకటి రెండు మార్పులు చేయాల్సి వస్తే తప్ప సిఎం కెసిఆర్‌ నిర్ణయమే ఫైనల్‌ కానుంది. శనివారం సిఎం అధ్యక్షతన జరిగే అఖిలపక్షం కీలక చర్చ చేయనుంది. ఇందులో ప్రధానంగా గద్వాల, జనగామలపై ఇంకా డిమాండ్‌లు వెనక్కి పోలేదు. జనగామలో శుక్రవారం కూడా పెద్ద ఎత్తున  నిరసనలు, రాస్తారోకోలు జరిగాయి. గద్వాల కోసం డికె అరుణ ఇంకా పట్టుబడుతూనే ఉంది. అయితే ఇటీవల సిఎం తుది కసరత్తులో వీటికి ప్రాధాన్యం లేకపోవడంతో ఇక ఈ రెండు జిల్లాల వ్యవహారం మరుగున పడినట్లేనని భావించాల్సి ఉంటుంది. ఈ నెల 20న అఖిలపక్ష సమావేశం, అదేరోజుకేబినేట్‌ భేటీతో జిల్లాల కసరత్తు ముగియనుంది.  ఇప్పటికే పలుదఫాలుగా వేగం పెంచి  కసరత్తు  చేశారు. బహుశా అవసరమైతే సెప్టెంబర్‌లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబధించిన వ్యవహారాలను కూడా చక్కదిద్దవచ్చు. జిఎస్టీ కోసం అసెంబ్లీ సమావేశాలు తప్పనిసరి కావడంతో పనిలోపనిగా దీనికి సంబంధించి లాంఛనాలు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.  ఇప్పటికే కేబినేట్‌ సబ్‌కమిటీతో సిఎం కెసిఆర్‌, ఉద్యోగ సంఘాలు, వివిధ శాఖల అధికారులతో అన్ని శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ చర్చలు ముగించారు. ప్రధానంగా ఆయా జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాలు, జిల్లా స్థాయిలో ఉండే వివిధ శాఖ కార్యాలయాల ఏర్పాటు, వాటి స్వరూపం, సిబ్బంది విభజన తదితర అంశాలపై విధాన పరమైన నిర్ణయంపై సవిూక్షించారు. నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కేడర్‌ బలం ఎంత?ఎంత మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు? పదోన్నతులు, నూతన నియామకాలు తదితర అంశాలపై చర్చించారు. ఇనూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో సిబ్బంది విభజనకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఓ సమగ్ర స్వరూపంతో  నిర్ణయాలు తీసుకుని శనివారం అఖిలపక్షం ఏర్పాటు చేసింది.ఇందులో జిల్లాల ఏర్పాటు అవసరం, పరిపాలనా సౌలభ్యం తదితర అంశాలపై చర్చిస్తారు. కనీసం ఈ అఖిలపక్షంలో అయినా గద్వాల,జనగామలపై నిర్ణయం తీసుకోవాలని మాజీమంత్రిఉలు డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్యలు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటుపై ముందుగానే నిర్ణయాలు తీసుకుని విపక్షాలను భేటీకి పిలవడంలో అర్థం లేదన్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు అన్ని రాజకీయ పక్షాలతో భేటీ కావాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు పాల్గొనేలా ఆహ్వానం పలికారు. ఇకపోతే  జిల్లాల ప్రజాప్రతినిధులతో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన విషయం విదితమే. ఈనెల 20న అఖిలపక్ష సమావేశానికి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు ఆహ్వానాలు పంపించాలని సీఎం స్పష్టం చేశారు. అఖిలపక్ష భేటీ పూర్తికాగానే అదే రోజు సాయంత్రం 4.30కు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం కొత్త నిబంధనలను ఆమోదిస్తారు. కలెక్టర్ల నుంచి నివేదిక తెప్పించుకొని ప్రాథమిక నోటిఫికేషన విడుదల చేస్తారు.  జిల్లాల ఏర్పాటుకు ఒక్క జనాభాయే ప్రాతిపదిక

కారాదని, విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉపసంఘం సూచించనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఉద్యోగుల జోనల్‌ విధానాన్ని సవిూక్షించాలని నివేదించనుంది. కొత్త జిల్లాల కసరత్తులో భాగంగా ఏర్పాటైన ఉపసంఘం మంత్రులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, తమ అధ్యయనాల ఆధారంగా కీలక సిఫార్సులు చేయాలని ఉపసంఘం నిర్ణయించినట్లు తెలిసింది. ఉపముఖ్యమంత్రి మహ్మూద్‌అలీ అధ్యక్షతన ఏర్పాటైన ఉపసంఘంలో మరో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులు. ఈనెల 12నుంచి 14 వరకు ఈ ఉపసంఘం జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలను సేకరించింది. మరోవైపు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘానికి నివేదికను సిఎం కెసిఆర్‌ సవిూక్షించారు.

ఇక గద్వాలను జిల్లా చేయాలని ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపతకుమార్‌లు విజ్ఞప్తి చేశారు. వరంగల్‌ జిల్లాలో ఆచార్య జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ములుగును చేయాలని, లేదంటే వరంగల్‌లోనే ములుగును కొనసాగించాలని మంత్రి చందూలాల్‌, ఎంపీ సీతారాం నాయక్‌లు కోరారు. ప్రతిపాదిత జిల్లాల్లో మండలాలను మార్చాలని ఎక్కువగా ప్రతిపాదనలొచ్చాయి. సిద్దిపేట జిల్లాలోకి చిగురుమామిడి, కొహెడ, హుస్నాబాద్‌లను చేర్చరాదని పలువురు ప్రతిపాదించగా.. ఆ ప్రాంత ఎమ్మెల్యే మాత్రం కొహెడ, హుస్నాబాద్‌లను సిద్దిపేటలో చేర్చాలని కోరారు. ఇక కొడంగల్‌ నియోజకవర్గంలోని మూడు మండలాలను వికారాబాద్‌లో ప్రతిపాదించడాన్ని ఎమ్మెల్యే రేవంతరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మహబూబ్‌నగర్‌లోని ఆమనగల్‌, మాడుగుల, తలకొండపల్లిలోని కొన్ని గ్రామాలను మాత్రమే ప్రతిపాదిత హైదరాబాద్‌లో చేర్చాలని, మండలాలన్నింటినీ వద్దని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి కోరారు. మొత్తంగా ఈ వ్యవహారాలతో పాటు మరికొన్ని డిమాండ్లను అఖిలపక్షనేతలు చర్చించనున్నారు.