కొత్త జిల్లాలపై నోటిఫికేషన్‌ విడుదల

5

– నెలరోజులపాటు అభ్యంతరాల స్వీకరణ

హైదరాబాద్‌,ఆగస్టు 22(జనంసాక్షి): తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణపై ప్రభుత్వం సోమవారం ముసాయిదా ప్రకటన జారీ చేసింది. 17 కొత్త జిల్లాలు కలిపి మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లుగా విభజిస్తున్నట్లు ముసాయిదాలో పేర్కొంది. వీటిపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలపవచ్చు. అభ్యంతరాలను కలెక్టరేట్లు, సీసీఎల్‌ఏ కార్యాలయాల్లో స్వీకరించనున్నారు. పాలనా సౌలభ్యం కోసం ప్రజల కోరిక మేరకే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, రాజకీయాల కోసం కాదని తెలిపారు. మండలాల సంఖ్యను 505కు పెంచామని వెల్లడించారు. జయశంకర్‌ సార్‌జిల్లా కోసం చాలా డిమాండ్లు వచ్చాయని తెలిపారు. కొత్త జిల్లాల అంశంపై మళ్లీ అఖిలపక్షం పెడతామని వెల్లడించారు. /ూష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న కొత్త జిల్లాల అంశం కొలిక్కి వచ్చింది. ఈమేరకు ఇవాళ జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లుగా విభజన చేయనున్నట్టు ముసాయిదాలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్‌సట్‌లో పొందుపరిచింది. దీనిపై ఏవైనా సూచనలు, అభ్యంతరాలుంటే నెల రోజుల లోపు తెలిపేందుకు అవకాశం ఇచ్చింది. కొత్తగా 17 జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. 9 జిల్లాలకు విడివిడిగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మార్గదర్శకాల కోసం జీవో నెంబరు 194 విడుదల చేశారు. సూర్యాపేటను జిల్లాగా ప్రకటించినందుకు మంత్రి జగదీష్‌రెడ్డి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాగా చేసినందుకు సూర్యాపేట ప్రజలు కేసీఆర్‌కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాగా ఏర్పడటంతో సూర్యాపేట రూపురేఖలే మారనున్నాయని పేర్కొన్నారు. కాగా, సూర్యాపేట,

మహబూబాబాద్‌, వనపర్తిని జిల్లాలుగా ప్రకటించినందుకు అక్కడి స్థానికులు సంబురాలు జరుపుకుంటున్నారు.  కాగా ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ముఖచిత్రం మారిపోనుంది. తొలుత 74 కొత్త మండలాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జనాభా ప్రాతిపదికన ఈ సంఖ్యను 31కి కుదించింది. దీంతో మొత్తం మండలాల సంఖ్య 490కి చేరింది. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల అనంతరం 30 రోజుల వ్యవధిలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, అర్జీలను స్వీకరిస్తారు. గడువులోగా వచ్చిన అర్జీలన్నీ పరిశీలించి జిల్లాల తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. మొత్తంగా ఈ పక్రియను సెప్టెంబరు 30 లోగా పూర్తి చేసి.. అక్టోబర్‌లో దసరా పండుగ నుంచి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేలా సన్నాహాలు మొదలయ్యాయి