కొత్త జిల్లాలపై 10న అఖిలపక్షం

5

– సీఎం కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌,ఆగస్టు 16(జనంసాక్షి):దసరా నుంచి కొత్త జిల్లాలను ఉనికిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ పై చర్చించేందుకు ఈ నెల 20న మధ్యాహ్నం 2 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా కాంగ్రెస్‌, ఎంఐఎం, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ లకు ఆహ్వానాలు పంపనున్నారు. ప్రతి పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు రావాల్సిందిగా కోరతారు.ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌, జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న మంత్రివర్గ ఉపసంఘంలోని ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సీసీఎల్‌ఎ తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.అదే రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు.ఈ షెడ్యూలుకు సంబంధించి హైదరాబాద్‌ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్‌ మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సీఎంవో అధికారులు ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌ రావు, శాంతకుమారి, స్మితా సబర్వాల్‌, రాజశేఖరరెడ్డి తదితరులతో చర్చించారు.