కొత్త రైతులకు రూ. 20 కోట్ల రుణాలు
డీసీసీబీ డీజీఎం జ్యోతిర్మయి
శ్రీకాకుళం, జూలై 26 : జిల్లాలోని 13 సహకార కేంద్రబ్యాంకు శాఖలు, 49 పీఏసీఎస్‌ల ద్వారా ఇంతవరకూ రుణ సౌకర్యం పొందని కొత్త రైతులకు రూ. 20 కోట్ల వరకూ పంట రుణాలను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) డెప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) పి.జ్యోతిర్మయి వెల్లడించారు. పొందూరు మండల కేంద్రంలోని మహరాజా మార్కెట్‌లో గల సహకార కేంద్ర బ్యాంకు శాఖలో ఆన్‌లైన్ సౌకర్యాన్ని ఆమె లాంచనంగా ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే నరసన్నపేట, కోటబొమ్మాళి శాఖల్లో ఆన్‌లైన్ విధానం అమలవుతోందన్నారు. మిగిలిన శాఖల్లో కూడా ఈ సౌకర్యం త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో కొత్తగా మరో రెండు బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్‌లో నవీకరణ కింద (రెన్యువల్) రూ. 140 కోట్ల పంట రుణాల పంపిణీకి గాను, ఇంతవరకూ రూ. 130 కోట్లు పంపిణీ చేశామన్నారు. మిగతా రూ. 10 కోట్లు సెప్టెంబరు నెలాఖరులోగా అందజేస్తామన్నారు.సెప్టెరబర్ నెలాఖరు వరకు పంట రుణాలు పొందేవారికి మాత్రమే శూన్య శాతం వడ్డీ అమలవుతుందన్నారు. అలాగే పంట నష్టం జరిగితే పరిహారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాఖ ప్రబంధకులు డి.కృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.