కొనసాగనున్న 22వ ప్యాకేజీ
కామారెడ్డి,ఫిబ్రవరి18(జనంసాక్షి): ప్రాణహిత చేవెల్లలో భాగంగా ఈ పథకంలోని 22వ ప్యాకేజీలో మంచిప్ప నుంచి భూంపల్లి ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంత వాసుల్లో ఆందోళన తొలగింది. ప్రాణహిత,చేవెళ్ల పథకంలోని 22వ ప్యాకేజీని యథావిధిగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కామారెడ్డి ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి ప్రాణహిత చేవెళ్ల పథకానికి రూపకల్పన చేశారన్నారు. అయితే భూంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని అందించవచ్చని, భూసేకరణ కూడా చాలా వరకు జరిగిందని సీఎంకు వివరించామన్నారు. ఇదే విషయమై ఇటీవల ఇరిగేషన్ అధికారులు తనతో చర్చించారని, పాత ప్రణాళికతోనే సాధ్యమని తాను వారికి వివరించానని పేర్కొన్నారు. పనులను సకాలంలో ప్రారంభిస్తే ఏడాదిన్నరలో ఈ ప్రాంతానికి సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.