కొబ్బరి ‘పరిశోధన’కు కదలిక
కవిటిలో ఏర్పాటునకు సన్నాహాలు
శ్రీకాకుళం, జూలై 26 : ఉత్తరాంధ్ర కొబ్బరి రైతులు దశాబ్దాలుగా కలలుగంటున్న కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటునకు సన్నాహాలు ఊపందుకున్నాయి. మరో కోనసీమగా గుర్తింపు పొందిన ఉద్దానం కవిటి మండలంలో పరిశోధన కేంద్రం దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి కనీసం 3 నుంచి 5 ఎకరాల వరకు స్థలం అవసరం. స్థల సేకరణలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే అధికారులు కవిటి మండలంలోని బొరివంక, కవిటి, బల్లిపుట్టుగ, మాణిక్యపురంతో పాటు జాతీయ రహదారి పక్కన కొన్ని స్థలాలను పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో అంబాజీపేట తర్వాత ఇది రెండో కేంద్రంగా గుర్తింపు పొందనుంది.