కొలంబో టెస్టులో కివీస్‌ విజయం 195 పరుగులకే కుప్పకూలిన లంక- సిరీస్‌ సమం

కొలంబో ,నవంబర్‌ 29 : శ్రీలంక పర్యటనను న్యూజిలాండ్‌ విజయంతో ముగించింది. కొలంబో వేదికగా జరిగిన చివరి టెస్టులో 167 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 4 వికెట్లకు 47 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇవాళ ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక డ్రాగా ముగించేందుకు పోరాడింది. సమరవీరా వికెట్‌ త్వరగానే కోల్పోయినప్పటకీ… మరో బ్యాట్స్‌మెన్‌ మాథ్యూస్‌ , జయవర్థనేతో కలిసి జట్టును గట్టెక్కించేందుకు ప్రయత్నించాడు. పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తున్నా… పట్టుదలతో కివీస్‌ పేస్‌ను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న మాథ్యూస్‌ ఆరో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. లంచ్‌ వరకూ మెరుగ్గానే కనిపించిన లంక తర్వాత జయవర్థనే వికెట్‌ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జయవర్థనేను ఆస్ట్‌లే పెవిలియన్‌కు పంపి కివీస్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. వెంటనే రణ్‌దీవ్‌ డకౌటవగా.. కులశేఖర , మాథ్యూస్‌కు సపోర్ట్‌ ఇచ్చేందుకు యత్నించాడు. అయితే 18 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ దగ్గర బౌల్ట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌ విజయం ఖాయమైంది. 84 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన మాథ్యూస్‌ ఆఖరి వికెట్‌గా వెనుదిరగడంతో లంక రెండో ఇన్నింగ్స్‌కు 195 పరుగుల దగ్గర తెరపడింది. దీంతో 14 ఏళ్ళ తర్వాత లంక గడ్డపై న్యూజిలాండ్‌ జట్టు తొలి విజయం నమోదు చేసింది. కివీస్‌ బౌలర్లలో సౌథీ 3 , బౌల్ట్‌ 3 , బ్రేస్‌వెల్‌ 2 వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన కివీస్‌ కెప్టెన్‌ రాస్‌ టేలర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ , సిరీస్‌లో నిలకడగా వికెట్లు పడగొట్టిన రంగన హెరాత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి. లంక పర్యటనలో కివీస్‌ జట్టుకు ఇదే తొలి విజయం. ఇప్పటికే ఆ జట్టు వన్డే సిరీస్‌ను కోల్పోగా… తొలి టెస్టులో కూడా పరాజయం పాలైంది. అయితే బౌలర్లకు అనుకూలించిన రెండో టెస్టులో చక్కని ఆటతీరు ప్రదర్శించి సిరీస్‌ను సమం చేసింది.