కోడలికి మామ శిరోముండనం

చీమకుర్తి(జ‌నం సాక్షి): కోడలికి మామ శిరోముండనం చేయించిన అమానవీయ సంఘటన ఇది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఒక గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ఈ దురాగతానికి పాల్పడినట్లు అభియోగం. పొరుగూరి నుంచి క్షురకుడిని పిలిపించిన ఆయన తన కోడలికి గుండు గీయించాడు. అనంతరం గ్రామంలోని వీధుల్లో నడిపిస్తూ, బొడ్డురాయి వద్దకు తీసుకెళ్లాడు. ‘తాను తప్పు చేశానని, క్షమించమ’ని ఆమెతో చెప్పిస్తూ… టెంకాయ కొట్టించాడు. విషయం బయటికి పొక్కడంతో చీమకుర్తి పోలీసులు శనివారం మధ్యాహ్నం, బాధితురాలిని, ఆమె మామను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. ఒంగోలు నుంచి రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవిని కూడా రప్పించారు. తన చిన్న కొడుకు అనారోగ్యంతో ఉన్న సమయంలో గుండు చేయించుకుంటానని మొక్కుకున్నానని ఆ మేరకు తాను శిరోజాలను తొలగించుకున్నట్లు బాధిత మహిళ లిఖితపూర్వకంగా తెలిపింది. ఇందులో ఎవరి ప్రమేయం లేదని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు లేనందున కేసు నమోదు చేయడమెలా అనే విషయమై పోలీసులు రాత్రి వరకూ తర్జనభర్జనలు పడ్డారు. చివరకు ఉన్నతాధికారుల సూచనతో స్థానిక వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఒంగోలు గ్రామీణ సీఐ మాకినేని మురళీకృష్ణ తెలిపారు.