కోడి పిల్లలు
మా ఇంటికీ వంటింటికీ మధ్య చిన్నసందు వుంది. ఆ సందు అంతా గచ్చుచేసి వుంటుంది. సందుకి రెండువైపులా తలు పులు వున్నాయి. ఒకవైపు నుంచి వెళ్తే మా దొడ్డిలోకి పొయ్యే దారి వస్తుంది. మరోవైపు నుంచి వెళ్తే మా బాదం చెట్టూ, అశోక చెట్టూ వాటి కింద వుండే స్థలం వస్తుంది. ఈ రెండు చెట్లే కాదు. రెండు మల్లెచెట్లు వుండేవి. మా బావి వుండేది. రేకులతో చేసిన అరుగూ వుండేది. దాన్నిండా మా వల్ల గుమ్ములు వుండేవి. బావికి ఆనుకుని ఓ చిన్న అరుగు వుండేది. అక్కడ స్నానం చేస్తే మల్లెచెట్లకి నీళ్లు వెళ్లే వి. ఈ సందులోనే మేం ఎక్కువకాలం గడిపేవాళ్లం. మా పాల బ్రేకులూ, ఆ తరువాత టీ బ్రేకులూ ఇక్కడే గడిచేవి.ఎండాకాలం ఆకాశాన్ని చూస్తూ నలక మంచంలోనో, నవారు మంచంలోనో పడు కునేవాళ్లం. ఇక్కడ ఎండ చాలా తక్కువగా వస్తుంది. మధ్యాహ్నం మాత్రమే కాస్త ఎండ వస్తుంది. అందుకని ఎండాకాలంలో ఈ సం దులో పడుకోవడం చాలా హాయిగా వుండేది. ఆలస్యంగా నిద్రలేచే అవకాశం వుండేది.మా దొడ్డిలో మా పాలకోసం బర్రెలు వుండేవి. చాలా కోళ్లు వుండేవి. మా కోళ్లు బాదం చెట్టు కింద రోజంతా తిరి గేవి. వాటిని రోజూ రాత్రి ఈ సందులోనే కమ్మేవాడు మా మల్లయ్య. చలికాలం పూట ఫర్వాలేదు కానీ ఎండాకాలం వాటిని ఈ సం దులోనే కమ్మడం మాకు ఇష్టం వుండేది కాదు. ఎందుకంటే అవి ఉదయాన్నే కొంప మునిగినట్టు ‘కొక్కరకో’ అని అరిచేవి. అందుకని బాదం చెట్టు పక్కన వున్న రేకుల షెడ్డుకింద కమ్మమని మా మల్ల య్యతో అనేవాళ్లం. ఒక్కోసారి వినేవాడు. చాలా సార్లు విన కపొయ్యేవాడు. లేచి చదువుకొమ్మని ఉచిత సలహా ఇచ్చేవాడు రోజూ సంధ్యవేళ కోళ్లని పిలవడమూ, వాటిని గంపకింద కమ్మ డమూ మా మల్లయ్య పని. అతను రావడం ఎప్పుడన్నా ఆలస్యం అయినే నన్ను కమ్మమని మా అమ్మ చెప్పేది. నేను వినేవాడిని కాదు. కానీ సెలవుల్లో మధ్యాహ్నం పూటో, సాయంత్రమో వాటికి జొన్నలు వేస్తూ ఆడేవాడిని. జొన్నలు వేయగానే అవి పరుగు పరుగున వచ్చే వి. తరువాత తరువాత నన్ను చూడగానే పరుగు పరుగున రావడం మొదలు పెట్టాయి.
మా రేకుల షెడ్డు దగ్గర వున్న గు మ్ముల దగ్గర, మా తాతర్ర మంచం కింద మా కోళ్లు గుడ్లను పెట్టేవి. ఆ రెండు స్థలాలు వాట ికి అనువైన స్థలాలు. కోడిగుడ్లని మా అమ్మ అమ్లెట్లు వేసేది. కొన్నిసార్లు పిల్లలు చేయడం కోసం వుంచేది. పొదుగు పెట్టినప్పుడు మా కోడి చేసే ధ్వని అదోరకంగా వుండేది. ఓ ఇర వై రోజుల తరువాత కోడిగుడ్ల నుంచి పిల్లలు వచ్చేవి. అవి ఎంతో అందంగా వుండి, ఎంతో ముచ్చటేసేవి. వాటిని పట్టుకోవడానికి ప్రయ త్నం చేసేవాడిని. తల్లికోడి కోపంగా నావైపు పరుగెత్తుకొచ్చేది. అది ఎక్కడ పొడుస్తుందోనని పరుగెత్తేవాడిని. తల్లికోడి పిల్లల్ని వేసుకుని బా దం చెట్టు కింద షికారుకు వెళ్లేది. చెట్టుకింద వున్న ఆహారం దినుసులని, పురుగలని ఇంకా వేటినో అవి తినేవి. ఉదయం నుంచి సాయ ంత్రం దాకా ఎంతో పనివున్నట్టు మా బాదం చెట్టూ, అశోకచెట్టూ వున్న ప్రాంతాలన్నీ తిరి గేవి. వాటి రాజ్యంగా భావించేవి. చెట్లకింద తన కాళ్లతో తన్ని పొక్కిలి పొక్కిలి చేసేవి. ఇంటి నిండా దిడ్డికి (పియ్యి) వెళ్లేవి. మంచినీళ్ల కోసం కట్టిన హవుజు మీద వున్న రేకుని కూడా ఖరాబు చేసేవి. ఇవి చూసినపుడు మా త్రం కోళ్లమీద కోపం వచ్చేది. చిరాకేసేది. ఇంకా ఇల్లంతా నానా గందరగోళం చేసేవి.పిల్లి కన్పించినా, ఆకాశంలో గద్ద తిరుగుతున్నా మా కోడి తన పిల్లల్ని తన రెక్కలకింద కాపాడేది. పిల్లని పొడుస్తుం దేమోనన్నట్టుగా చూసేది. గద్ద ఆకాశంలో వుండేది కనుక దాన్ని అలా చూసే అవకాశం మా కోడికి లేకపొయ్యేది. మా కోడి అప్రమ త్తంగా వున్నప్పుడు పాడు గద్ద మా కోడిపిల్లలని ఎత్తుకొని పొయ్యేది. అది గమనించిన తల్లికోడి కోపంతో ఊగిపొయ్యేది. పైకి ఎగిరెగిరి గద్దను అందుకోవడానికి ప్రయత్నం చేసి విఫలం అయ్యేది. తల్లికోడి సంరక్షణ మనుషుల సంరక్షణకన్నా ఎక్కువ అన్పించేది.చీకటి నడక ముందే గంపకింద కోళ్లని కమ్మి గంపమీద బరువుగా ఓ పెద్ద బండ ని పెట్టేవాడు మల్లయ్య. తల్లికోడిని పిల్లల్ని వేరే గంపకింద అమ్మే వాడు. ఆ బండ ఎలా కిందపడేదో లేక మా మల్లయ్య బండ పెట్ట డం మరిచిపోయ్యేవాడో తెలియదుగానీ ఓ అర్ధరాత్రిపూట కోళ్లు విప రీతంగా గోలచేసేవి. మా అమ్మ వెంటనే లేచి చూసేది. ఏముంది? మా పిల్లి మహాశయుడు ఓ కోడిని కరుచుకొని వెళ్లిపోయిన సంద ర్భం. మిగతా కోళ్లని గంపకింద కమ్మి దానిమీద బండని పెట్టేది మా అమ్మ.ఉదయాన పాలు పిండటానికి వచ్చిన మా మల్లయ్యని మా అమ్మ మందలించేది. ‘బండ నేను పెట్టిన, పిల్లలేమన్న తీసినారే మో’నని గొణిగేవాడు. నెపం మా మీదకు తీసేవాడు.
‘ఏం మల్లయ్య తాతా! నీ తప్పు పెటు ్టకొని మా మీదికు తోసేస్తున్నావని’ అడిగేవాళ్లం. మ మ్మల్ని ఏవో చెప్పి బుదరకి చ్చే వాడు. ‘ఈ పిల్లి పని పట్టాలి’ అనే వా డు.ఇంట్లో వంట దినుసులు వున్నా యికాబట్టి ఎలుక లు వుంటాయి. వాటిని నియం త్రిం చడానికి పి ిల్లిఅవసరమే. అందుకని పిల్లిని దొరకబట్టి బయటకు పంపే అవకాశం లేదు. ఆ సంగతి మా మల్లయ్యకీ తెలుసు.నాకు ఐదుగురు బావలు. మా బావ లు ఇంటికి వచ్చినారంటే ఓ కోడి ప్రాణాలు పొయ్యేవి. మొదటిరోజు కొడిగుడ్డుతో భోజనం. తెల్లవారి కోడి కూరతో భోజనం వుం డాల్సిందే. మరో రోజు వుంటే కటిక దుకాణం నుంచి మాంసం తెప్పించేవాళ్లు. కోడిని కోయడం ఓ పెద్ద ప్రహసనం లాగుండేది. అన్ని కోళ్లని గంపకింద కమ్మి, గుడ్లు పెట్టడం ఆపిన కొడినో, కోడి పుంజునో మా మల్లయ్య ఎంచుకునేవాడు. అంతకుముందే ఆ కోడ ిని కోయడానికి రేకుల షెడ్డు నుంచి కత్తిని బయటకు తెచ్చేవాడు. దాన్ని బండమీద నూరేవాడు. ఎంచుకున్న కోడిని మా బాదం చెటు ్టకిందికి తీసుకొచ్చేవాడు. ఓ చెంబులో మంచినీళ్లు తెచ్చి చేతిలో ఉన్న కోడినోట్లో పోసేవాడు. చంపేముందు దాని దాహాన్ని తీర్చేవాడు. ఆ తరువాత కత్తితో కోడి తలని కోసేవాడు. తలలేని కోడిమొండెం మా బాదం చెట్టుకింద ఎగిరెగిరి కొట్టుకునేది. అలా కాసేపు కొట్టుకొని నేలమీద పడిపొయ్యేది. ఆ దృశ్యం హృదయవిదారకంగా వుండేది. పిల్లల్ని ఆ దృశ్యం చూడనిచ్చేది కాదు అమ్మ. ఎందుకంటే అలాంటి దృశ్యాలు చూసే మా అయిదుగురు అక్కలు కోడిమాంసం తినడం మానేశారు. ఆ తరువాత పూర్తిగా శాకాహారులుగా మారి పోయినారు. అయినా మేం ఏ కిటికీ సందుల్లోనుంచో చేసేవాళ్లం. ఆ దృశ్యం చూసినపుడు హృదయం బాధతో మూల్గేది. ఒళ్లు గగుర్పొ డిచేది. ఆ కోడి మొండాన్ని వేడివేడి నీళ్లలో పెట్టి దాని ఈకెలు పీకేసే వాడు. కొద్దిసేపటి తరువాత దాన్ని శుభ్రం చేసి నిప్పుల మీద కమిరి ంచేవాడు. తరువాత దాన్ని ముక్కలు చేసి మా అమ్మకి ఇచ్చేవాడు. మసాలాలు వేసి ఆ కోడితో బ్రహ్మాండమైన కూరవండేది మా అమ్మ.ఒక్కో బావ వచ్చినప్పుడల్లా ఒక్కో కోడి ఎగిరిపొయ్యేది. కోడ ిపిల్లలు పెద్దవయ్యేవి. గుడ్లు పెట్టేవి. ఆ తరువాత ఆహారం అయ్యేవి. అయినా పాపం మిగతా కోళ్లు ఉదయాన్నే మా రాజన్న సుప్రభాతం కన్నా ముందే సుప్రభాతం పాడేవి. మా బావలు వూరికి వెళ్లడానికి వీలుగా వాళ్లని నిద్రలేపేవి.మా కళ్లముందే కోడిగుడ్లు కోళ్లయ్యేవి. ఇల్లంతా ఎగిరేవి. ఎక్కడపడితే అక్కడ దొడ్డికి పొయ్యేవి. ఇల్లంతా పొక్కిలి పొక్కిలి చేసేవి. మాతో ఆడేవి. మమ్మల్ని నిద్రలేపేవి. విసి గించేవి. చివరికి మాకు ఆహారం అయ్యేవి. ఇవి ఇంత చేసినా అవి వద్దని ఎప్పుడూ ఎవ్వరం అనుకోలేదు.నేను యూనివర్సిటీకి వచ్చే సరికి మా ఇంట్లో వున్న కోళ్ల సంఖ్య తగ్గిపోయింది. అప్పుడు ఒకటో రెండో వుండేవి. పరిశుభ్రత సోయి ఎక్కువైపోయింది. మల్లయ్య కూడా ముందున్నంత ఉత్సాహంగా లేడు. కోడిగుడ్లు బజార్లో విపరీ తంగా దొరుకుతున్నాయి. మా వూరి చుట్టూ కోళ్లఫారాలు వచ్చే శాయి. మా ఇంటి చుట్టూ చికెన్‌షాపులు అయిపోయినాయి. మా ఇంట్లో వున్న ఒకటి రెండు కోళ్లు కూడా లేకుండా పోయినాయి. కొక్కొరకోలు లేవు. ఇల్లంతా కోడి పియ్యిలేదు. వాటి ఈకలూ లేవు. కోడిగంపా లేదు. ఇల్లంతా పొక్కిలి కావడం లేదు. అదృశ్యమైనాయి.
ఓసారి మా వూరి బయట వున్న కోళ్లఫారాన్ని చూడ్డానికి పోయినాను. అక్కడంతా అదోరకం వాసన. ప్రతికోడికి ఓ నిర్ణీత స్థలం. దానిముందే దానికి కావాల్సినంత దాణా. అందులో ఒక లైటు. మిగతా కోళ్లతో పొట్టాటలు లేవు. పొడుచుకోవడం అంత కంటే లేదు. వీటి బాగోగులు చూడ్డానికి ఓ మనిషి. వాటిముందు ఓ చిన్న చిప్పలో కొన్ని నీళ్లు. దానికోసం వెతుక్కోవనక్కర్లేదు. పిల్లి భ యం లేదు. గద్దల భయం అంతకన్నా లేదు. వైద్యం కూడా వుంది.
ఎంత విచిత్ర వీటి జీవితం. ఇవి మా కోళ్లలా కాదు. ఎక్కడికో పోయి గుడ్డు పెట్టాల్సిన పనిలేదు. పొదుగుడు పట్టడం లేదు. గడ్లని పొదడాల్సిన పనిలేదు. వీటికి తమ రెక్కలు విదిలించే అవకాశమే లేదు. ఇక ఎగరడం అన్న విషయం ఎప్పుడో అవి మరి చిపోయాయి. కోడిపిల్లలకి గద్దల భయం లేదు. గర్డ్‌ఫ్లూ భయం మా త్రమే ఉంది. వీటి పుట్టుక వీటికోసం కాదు. ఎలక్ట్రిక్ దీపం కింద పెరగడం, పెట్టిన ఆహారాన్ని తినడం, తరువాత గుడ్లు పెట్టడం, తరువాత తలకిందులుగా వేలాడే చికెన్ సెంటర్లోకి వెళ్లడం. ఆ తరువాత ప్రాణాలు కోల్పోవడం, ముక్కలు ముక్కలు కావడం. నూనెలో గోలి, చికెన్ 65లు కావడం. చికెన్ బిర్యానీలు కావడం. వీటి జీవిత నిర్దేశ్యం ఇదే. వీటి పరమార్థం ఇదే. వీటి జననం ఇం దుకే.కాలం ఎన్ని మార్పులని తెస్తుంది. సహజ సిద్ధంగా ఎగిరే లక్ష ణం. రెక్కల్ని విదిలించే లక్షణం, ఆహారాన్ని వెతుక్కుని తినే లక్షణం, తమకు తాము పిల్లల్ని పుట్టించే లక్షణం, జాతి లక్షణమైన కొక్కొరకోని అనలేకపోవడం, ఇవేవి లేకుండా కాలం వీటిని ఎట్లా తయారు చేసింది? దీన్ని కాదనే ధైర్యం ఎవరికైనా వుందా? కల్తీలేని ఆహారం గుడ్డు వద్దనే సాహసం మరెవరికైనా వుందా?కొంతకాలానికి ఈ హైదరాబాద్‌లో సెటిల్ అయిన తరువాత ఇక్కడ ప్లాట్లలో పెరుగుతున్న మా పిల్లల్నీ, ఇతర పిల్లల్నీ చూస్తే నాకు మా ఊరి చివర్లో వ చ్చిన కోళ్లఫారాలే గుర్తుకొచ్చేవి. స్కూలుకు వె ళ్లడం రోజుకి నలభై ఎనిమిది గంటలు చద వడం, ర్యాంకుల పంట పండించడం, నూటికి తొంబైకన్నా తక్కువ మార్కులు రాకుండా ప్రయత్నాలు చెయ్యడం. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఐటీలు, హెచ్‌వన్ వీసాలు, డాలర్ సంస్కృతి ఇదే వీళ్ల ప్రయత్నం. ఆ దిశగా వాళ్లని తయారు చేసే మన యత్నం.ఇక్కడి పిల్లలకి బళ్లలో కోతికొమ్మచ్చి ఆటలు లేవు. మట్టితో బొమ్మలు చేయడం తెలియదు. ఒళ్లంతా మట్టి చేసుకోవడం తెలియదు. మట్టి వాసనా తెలి యదు. చూరునుంచి కారుతున్న వర్షం నీళ్లలో ఎగరడం తెలియదు. ఆ నీళ్ల ప్రవాహంలో కాగితం పడవలు వదలడం అంతకంటే తెలియదు.పెద్ద బొంగుతో బాదం కాయలు కొట్టుకోవడం తెలి యదు. జామచెట్టు ఎక్కి జామకాయలు తెంపుకోవడం తెలియదు. కాలికి గాయం చేసుకోవడమూ తెలియదు. పెరడుకు పోయి మక్క కంకులని కాల్చుకొని తినడం తెలియదు. కోతి కొమ్మచ్చి ఆటా తెలియదు., పాటా తెలియదు, నాటకాలు తెలియవు.
వీళ్లకు తెల్సింది కంప్యూటర్ ఆటలు. ఇంట్లో వుండే ప్లాస్టిక్ చెట్లు. నీడలో పెరిగే మరుగుజ్జు మొక్కలు. చదువు. చదువు. మట్టివాసన తెలియని చదువు. మనిషి సహవాసం లేని చదు వు.ఇక్కడ పిల్లల్ని కోళ్ల ఫారమ్‌లోని పిల్లల్లాగే పెంచుతున్నాం. వాటి లాగా పిల్లల సహజసిద్ధమైన లక్షణాలు కోల్పోతున్న పిల్లలు. మేము మా అమ్మ చేతిలో పెరిగిన కోడిపిల్లలం వీళ్లు మా చేతిల్లో పెరు గుతున్న కోళ్లఫారమ్‌లోని కోడిపిల్లలు.