కోదండరామ్‌కు బెయిల్‌ నిరాకరణ

మహబూబ్‌నగర్‌, మార్చి 22 (జనంసాక్షి) :
టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సహా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలకు అలంపూర్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. బెంగుళూర్‌ హైవే దిగ్బంధనం సందర్భంగా అరెస్ట్‌ చేసిన టీజేఏసీ నేతలు, టీిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు, నేతలకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు ససేమిరా అంది. గురువారం అరెస్టు చేసిన కోదండరామ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఈటెల రాజేందర్‌, జూపల్లి కృష్ణారావు, జితేెందర్‌రెడ్డిలను శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిలో ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య హాజరుకాకపోవడంతో విచారణ పూర్తికానందునే బెయిల్‌ నిరాకరించినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. అయితే న్యాయవాదులు, న్యాయవాద జేఏసీ నేతలు తీర్పుకాపీకోసం వేచి చూస్తున్నామని పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జైలులో ఉన్న నేతలను పకడ్బందీ బందోబస్తు మద్య అలంపూర్‌ కోర్టుకు తరలించారు. వారిని కలిసేందుకు ఎమ్మెల్యేలు, ఉద్యమ సంఘాల నేతలు, పలువురు నాయకులు తరలివచ్చారు. ఉదయం నుంచే అరెస్ట్‌ అయిన వారిని కలిసేందుకు వేలా దిగా కార్యకర్తలు, రాజకీయ పార్టీల నాయకులు కోర్టు వద్దకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ మాట్లాడుతూ ఉద్యమాన్ని అణచివేసేందుకు కీలకమైన వ్యక్తులను అరెస్ట్‌ చేస్తే చాలు అని ప్రభుత్వం అనుకుంటోందని, తద్వార ఉద్యమ తీవ్రత తగ్గిపోతుందని ప్రభుత్వం భావించడం శోచనీయమన్నారు. కోదండరామ్‌, శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్టు చేసి జైలులో పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గబోమన్నారు. సకల జనుల సమ్మెతో ప్రభుత్వానికి కర్రుకాచి వాత పెట్టిన ఐక్యత తమలో ఉందన్నారు. మరోనేత విఠల్‌ మాట్లాడుతూ నాయకుల అరెస్టు వెనుక జిల్లాకుచెందిన మంత్రి డీకే అరుణ ఉన్నారని ఆరోపించారు. మంత్రికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా జైలులో ఉన్న నాయకులను విడిపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. లేని పక్షంలో ఉద్యోగులంటే చిన్నచూపు చూస్తే ఆనాడు చంద్రబాబుకు పట్టిన గతే నీకు పడుతుందని హెచ్చరించారు. తక్షణమే మంత్రి జోక్యం చేసుకుని కేసులు ఎత్తివేయించడంతోపాటు అరెస్ట్‌ అయినవారందరిని విడుదల చేయించాలన్నారు. పేరుకు నాలుగున్నర లక్షలమంది ఉద్యోగులమే అయినా తమ వెనుక 40 లక్షల మంది ఉన్నారన్న వాస్తవాన్ని మంత్రి, ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బెయిల్‌ నిరాకరించినందున తర్వాత చేపట్టబోయే కార్యాచరణపై చర్చించేందుకు టీజేసీ సమావేశం నిర్వహిస్తామన్నారు.