కోల్‌కతాలో నిఫా వైరస్‌ కలకలం

– ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కేరళ సైనికుడు మృతి
– నిఫాతోనే చనిపోయి ఉంటాడ‌ని వైద్యుల అనుమానం
– మృతుడి శాంపిల్స్‌ను ఎన్‌ఐవీకి పంపిన వైద్యులు
– నిఫా కలకలంతో వణికిపోతున్న కోల్‌కత్తా వాసులు
కోల్‌కొత్తా,మే30(జ‌నం సాక్షి) : కేరళ, కర్నాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘నిఫా’ వైరస్‌ ప్రస్తుతం కోల్‌కత్తా వాసుల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. కోల్‌కతా మహానగరంలో కేరళకు చెందిన సైనికుడు ఆసుపత్రిలో చికిత్స పొందతూ ప్రాణాలు విడిచారు. శీను ప్రసాద్‌ ఫోర్ట్‌ విలియం కోటలో పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్సకు స్పందించని ప్రసాద్‌ సోమవారం తుది శ్వాస విడిచారు. కాగా, ప్రసాద్‌ నిపా వైరస్‌ సోకి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ప్రసాద్‌ శాంపిల్స్‌ను పూణెళిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి వ్యాధి నిర్ధారణకు పంపారు. భారతదేశంలో నిపా వైరస్‌ను గుర్తించగల సామర్ధ్యం ఉన్న ఏకైక లాబోరేటరీ ఎన్‌ఐవీలోనే ఉంది. కాగా, కేరళలో ఇప్పటికి నిపా వైరస్‌తో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్‌కొత్తా ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో నిఫా భయంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు..
భయం పుట్టిస్తున్న సోషల్‌ విూడియా…
కేరళను వణికిస్తున్న నిఫా వైరస్‌పై సోషల్‌ విూడియా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను భయకంపితులను చేస్తోంది. గబ్బిలాలు, పందుల ద్వారా ఈ వైరస్‌ విజృంభిస్తుందని, సోకిన వెంటనే మనుషుల ప్రాణాలు పోతాయని, ఈ వ్యాధికి మందులే లేవంటూ వస్తున్న సమాచారం అందరి గుండెల్లో గుబులు రేపుతోంది. గబ్బిలాలు కాయలను తినే ఫొటోలు సైతం వైరల్‌ అవుతుండడంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు.