కోల్‌కతా విద్యార్థి నాయకుడి మృతిపై దుమారం

కోల్‌కతా/ఢిల్లీ, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) :
కోల్‌కతా నగరంలో మంగళవారం చనిపోయిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకుడు సుదీప్తో గుప్తా మృతిపై పెను దుమారమే రేగింది. కోల్‌కతాలో  మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న కొందరు విద్యార్థులను అరెస్ట్‌ చేసి బస్సులో తరలిస్తుండగా వారిలో ఉన్న గుప్తా బస్సులో నుంచి జారిపడి మృతిచెందాడు. అతడు స్తంభానికి గుద్దుకుని చనిపోయాడని పోలీసులు చెబుతుం డగా, పోలీసులు కొట్టి చంపారని అతని తండ్రి, సీపీఎం నాయకులు ఆరోపించారు. ఈ మృతిపై న్యాయవిచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు. సీపీఎం అగ్రనేత సీతారామ్‌ ఎచూరి ఈ విషయమై బుధవారం ఢిల్లీఓ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల వాదన నమ్మద గినదిగా లేదని అన్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. అతని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే విద్యార్థి తండ్రి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం తనకు అవసరంలేదని తేల్చిచెప్పారు. తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. మరోవైపు విద్యార్థులను తరలించిన బస్సు డ్రైవర్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.