‘కోల్‌గేట్‌’ ముద్దాయి మన్మోహనే

సీపీఐ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) :
బొగ్గు కుంభకోణంలో అసలు ముద్దాయి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆయనను వదిలి మాజీ మంత్రి దాసరి నారాయణరావుపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేజీ బేసిన్‌లో అక్రమ వ్యాపారాలు చేస్తున్న రిలయన్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బంజారాహిల్స్‌లోని రిలయన్స్‌ కార్యాలయం ఎదుట సీపీఐ నేత నారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు. లోనికి వెళ్లేందుకు యత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. కేజీ బేసిన్‌లో వేల కోట్ల రూపాయలను రిలయన్స్‌ సంస్థ లూఠీ చేస్తోందని ఆరోపించారు. కృత్రిమ కొరతను సృష్టించి రేట్లు పెంచేలా చేశారని విమర్శించారు. కేజీ బేసిన్‌ గ్యాస్‌ను రిలయన్స్‌ దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రిలయన్స్‌ చెప్పినట్లే కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటోందని, రిలయన్స్‌కు ప్రభుత్వం దాసోహమైందని ధ్వజమెత్తారు. కేజీ బేసిన్‌లో జరుగుతున్న అక్రమాలపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీని బర్తరఫ్‌ చేయాలని కోరారు. బొగ్గు కుంభకోణంలో ప్రధాన ముద్దాయి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగేనని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి, దర్శక రత్న దాసరి నారాయణరావు మీద కేసు పెట్టడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ఆందోళనకు దిగిన నారాయణ సహా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు.