కౌంటర్‌ ఎటాక్‌! జమ్మూజైల్లో పాక్‌ ఖైదీపై దాడి

విషమంగా సన్నావుల్లా పరిస్థితి
విచారణకు ఆదేశించిన సర్కారు
జమ్మూ, మే 3 (జనంసాక్షి):జమ్మూకాశ్మీర్‌లోని ఓ జైలులో పాకిస్తాన్‌కు చెందిన ఖైదీ సనావుల్లాపై భారతీయ ఖైదీలు దాడికి పాల్పడ్డారు. అతడ్ని విచక్షణా రహితంగా చావబాదారు. పాకిస్తాన్‌లో తోటి ఖైదీల చేతిలో గాయపడి సరబ్‌జిత్‌ సింగ్‌ మృతి చెందిన తర్వాతి రోజే ఈ ఘటన జరగడం విశేషం. తీవ్రంగా గాయపడిన పాక్‌ ఖైదీని జైలు అధికారాలు జమ్మూ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి   తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి చండీగఢ్‌కు తరలించారు. హై సెక్యూరిటీ ఉండే జైలులో తోటి ఖైదీలు దాడికి పాల్పడిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. జైలు సూపరింటెండెంట్‌పై వేటు వేసింది. దాడి ఘటనపై విచారణకు ఆదేశించింది. మరోవైపు, జీవత ఖైదు అనుభవిస్తున్న వినోద్‌కుమార్‌ సనావుల్లాపై దాడికి దిగినట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌కు చెందిన వినోద్‌కుమార్‌.. గతంలో సైన్యంలో పని చేశాడు. యావజ్జీవ శిక్ష పడడంతో ఆయనను కోట్‌ బల్వాల్‌ జైలులో ఉంచారు.

పాకిస్తాన్‌కు చెందిన సనావుల్లాను భారత భద్రతా బలగాలు 1999 ఏప్రిల్‌లో అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై ఐదు కేసులు నమోదయ్యాయి. జమ్మూలోని కోట్‌ బల్వాల్‌ జైలుకు తరలించగా.. సనావుల్లా అప్పటి నుంచి ఆ జైలులో ఉంటున్నారు. అయితే, ఆయనపై శుక్రవారం తోటి ఖైదీలు దాడికి దిగారు. విచాక్షణా రహితంగా చితకబాదారు. మరికాసేపట్లో సరబ్‌జిత్‌సింగ్‌ అంతిమయాత్ర ప్రారంభమవుతుందనగా.. ఈ దాడి జరగడం గమనార్హం. దాడికి గల కారణాలు ఇంకా తెలియరానప్పటికీ, పాక్‌లో సరబ్‌జిత్‌ను హతమార్చడానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని జైలు అధికారులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సనావుల్లా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. జైలు అధికారులు తొలుత జమ్మూలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఛండీగఢ్‌కు తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. పదునైన ఆయుధాలతో దాడికి దిగడంతో తీవ్రంగా గాయపడిన సనావుల్లా పరిస్తితిపై ఇప్పుడే ఏవిూ చెప్పలేమని తెలిపారు. ఇదిలా ఉంటే, తాజా ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కోట్‌ బల్వాల్‌ జైలు సూపరిండెంట్‌ రజనీ సెహగాల్‌పై సస్పెండ్‌ వేటు వేసింది. అలాగే, ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉంటే, భారత్‌లో తమ ఖైదీపై దాడి జరగడాన్ని పాక్‌ తీవ్రంగా పరిగణించింది. సనావుల్లకు మెరుగైన వైద్యం అందించాలని భారత్‌లోని పాక్‌ హైకమిషనర్‌ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. పాక్‌లో సరబ్‌జిత్‌పై దాడి తర్వాత.. భారత జైళ్లలో ఉన్న పాక్‌ ఖైదీలపై దాడి జరిగే అవకాశం ఉందని కేంద్ర ¬ం మంత్రిత్వ శాఖ ముందే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. పాక్‌ ఖైదీలకు గట్టి భద్రత కల్పించాలని ఆదేశించింది. కానీ, అంతలోనే సనావుల్లాపై దాడి జరగడం గమనార్హం.