క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా బాంబు పేలుళ్లు

– ఎనిమిది మంది మృతి, 45మందికి గాయాలు
– తూర్పు ఆఫ్ఘాన్‌లో ఘటన
జలాలాబాద్‌, మే19( జ‌నం సాక్షి) : క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని తూర్పుఆఫ్ఘాన్‌ నగరమైన జలాలాబాద్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ‘రంజాన్‌ కప్‌’ క్రికెట్‌ టోర్నీలో భాగంగా మ్యాచ్‌ జరుగుతుండగా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో స్టేడియంలో ఒక్కసారిగా వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా క్రికెటర్లేనని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. మ్యాచ్‌ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివచ్చారు. మ్యాచ్‌ చూస్తూ
కేరింతలు కొడుతుండగా ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో క్రికెటర్లు, ప్రేక్షకులు చెల్లాచెదురయ్యారు. భయంతో పరుగులు పెట్టారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎనిమిది మంది మృతి చెందగా, మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగ్గా శనివారం ఉదయం అధికారులు ప్రకటన విడుదల చేశారు. రంజాన్‌ నెల ప్రారంభమైన తర్వాత ఇది తొలి ఘటన అని నంగర్‌హార్‌ ప్రావిన్షియల్‌ గవర్నర్‌ కార్యాలయం తెలిపింది.
పేలుళ్లకు తామే కారణమని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే, తాలిబన్‌ మాత్రం పేలుళ్లు తమ పనేనని వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా తెలిపింది. స్టేడియంలో మూడు పేలుళ్లు జరిగాయని, పవిత్ర రంజాన్‌ మాసంలో ఇటువంటి ఘటనలకు పాల్పడడం దారుణమని ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ అన్నారు.
——————————————–