క్రీడాకారులకు అండగా సిఎం కెసిఆర్
2శాతం రిజర్వేషన్లతో ప్రోత్సాహం: ఎంపి
ఆదిలాబాద్,మే16(జనం సాక్షి): తెలంగాణలో క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, తాజాగా ప్రభుత్వ కొలువులో రెండుశాతం రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీ జి. నగేష్ అన్నారు. ఇది గ్రావిూణ క్రీడాకారులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేదని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఆశ్రమపాఠశాలల విద్యార్థుల వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న మెలకువలు, నైపుణ్యాంశాలను నిరంతరంగా సాధన చేయాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అథ్లెటిక్స్, బాక్సింగ్, ఈత, జూడో అంశాల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులందరూ గ్రావిూణ ప్రాంతాల నుంచే వచ్చినవారేనని, వారు అంకితభావంతో ఆటలపై మమకారంతో మైదానంలో నిరంతరంగా శ్రమించారని పేర్కొన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ఐటీడీఏ డీడీ చందన, ఏటీడీఓ సౌజన్య, ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, పెటా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరెడ్డి పార్థసారథి, ఎన్.హరిచరణ్, అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి రాజేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణ, ఎన్.స్వామి, రాష్ట్రపాల్, జూడో శిక్షకుడు రాజు, శిబిరం నిర్వాహకులు గోపాల్, మంగ తదితరులు పాల్గొన్నారు.