క‌ర్నాట‌క ఉప ముఖ్య‌మంత్రిగా కాంగ్రేస్ నేత‌

క‌ర్నాట‌క( జ‌నం సాక్షి):ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు, ప్రజలు హాజరయ్యారు. కుమారస్వామి ప్రభుత్వం బలనిరూపణ చేసుకున్న అనంతరం మిగతా మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు 22 మంత్రి పదవులు.. జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. స్పీకర్‌ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించగా.. డిప్యూటీ స్పీకర్‌ పదవిని జేడీఎస్‌కు ఇచ్చారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మూడువేల మందికిపైగా వీఐపీలు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. దేశవ్యాప్తంగా పలుపార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. జేడీఎస్‌ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌, పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ నేత తేజస్వి యాదవ్‌,బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి తదితరులు హాజరయ్యారు.కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. 2006లో తొలిసారిగా ఆయన ముఖ్యమంత్రిగాప్రమాణస్వీకారం చేశారు. అయితే అప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటవడం గమనార్హం. 2006లో భాజపాతో పొత్తుపెట్టుకుని సీఎం అయ్యారు. అయితే కేవలం 20 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికార బదిలీకి ఆ పార్టీతో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించటంతో 2007 నవంబరు 2న భాజపా మద్దతు కోల్పోయారు. దీంతో ఆయన సీఎం పదవికిరాజీనామా చేయాల్సి వచ్చింది.