‘ఖని’లో రౌడీషీటర్ కాల్చివేత – నాటు తుపాకీ, కత్తి స్వాధీనం
గోదావరిఖని, జూన్ 10, (జనం సాక్షి) : గోదావరిఖని కార్మిక నగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిపిన ఎదురుకాల్పుల్లో కట్టెకోల సుధీర్(24) అనే రౌడీషీటర్ హతమయ్యాడు. మృతుని నుంచి నాటు తుపాకీ, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పవర్‌హౌస్‌కాలనీకి చెందిన సుధీర్ ఆరు కేసుల్లో ప్రధాన నిందితుడు. 2010లో స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 18వ రౌడీషీటర్‌గా సుధీర్ పేరు ‘ఖని’లో రౌడీషీటర్ .. నమోదైంది. పలుకేసుల్లో ప్రధాన నిందితుడిగా సుధీర్ ఉండగా, గతనెల 21న స్థానిక సప్తగిరికాలనీలో నేరెళ్ళ అశోక్ అనే చికెన్‌సెంటర్ వ్యాపారిపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ కేసులో సుధీర్ పరారీలో ఉండగా, పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలో ఈ కేసులో మరో ఇద్దరు నిందితులైన నీలపు వంశీ, దాసరి ప్రేమ్‌కుమార్‌లు పట్టుబడ్డారు. అయితే సుధీర్ సూత్రధారుడిగా వన్‌టౌన్ ఐడి బృందంపై దాడిచేసి, వారిలో ఎవరినైనా ఒకరిని హతమార్చాలని పథకం వేసినట్లు పట్టుబడ్డ ఈ ఇద్దరి ద్వారా పోలీసు విచారణలో బయటపడింది. ఇలా ఉండగా… స్థానిక ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి సమీపంలో జనసంచారం లేని ప్రదేశంలో సుధీర్ ఉన్నట్లు సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ ఎడ్ల మహేష్, ప్రత్యేక పోలీసు బృందం అక్కడికి వెళ్లారు. లొంగిపోవాలని సుధీర్‌ను పోలీసులు హెచ్చరించగా, బేఖాతరు చేసిన సుధీర్ పోలీసు జీపుపై తన వద్దనున్న నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీనికి ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. నాలుగు రౌండ్ల కాల్పుల్లో సుధీర్ కుప్పకూలాడు. మృతిచెందిన సుధీర్ నుంచి నాటు తుపాకీతో పాటు ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుధీర్ జరిపిన కాల్పుల్లో పోలీసు జీపు అద్దం పాక్షికంగా ధ్వంసమైంది. కాగా, పలుకేసుల్లో ప్రధాన నిందితుడైన సుధీర్ కరీంనగర్‌లో తాత్కాలిక నివాసముంటున్నాడు. ఒక ముఠాను ఏర్పరుచుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేస్తున్నాడని జిల్లా అడిషనల్ ఎస్పీ బిల్లా జనార్దన్‌రెడ్డి తెలిపారు. జనవరి 10, 2009లో స్థానిక పవర్‌హౌస్‌కాలనీలో దీటి మౌనికను ఈవ్‌టీజింగ్ చేసిన కేసులో, జనవరి 3, 2010లో ఆముదాల సందీప్, సయ్యద్ అయాజుల్లాలను కిడ్నాప్ చేసిన కేసులో, జనవరి 8, 2010లో కరీంనగర్ శివాజీనగర్‌లో దీటి మౌనికను తండ్రి శంకర్‌ను, సోదరుడు నాగరాజును హతమార్చిన కేసులో నిందితునిగా ఉండగా, నవంబర్ 6, 2010లో స్థానిక ఐబికాలనీలో పిడుగు సతీష్‌ను హత్యచేసిన ఘటనలో నిందితునిగా పాటు, మే 21, 2012లో నేరెళ్ళ అశోక్‌పై హత్యాయత్నం చేసిన ఘటనలో నిందితునిగా ఉన్నాడని ఆయన తెలిపారు. పోలీసులను సైతం హతమార్చాడానికి కుట్రపన్నాడని అన్నారు. కాగా, రామగుండం తహశీల్దార్ బైరం పద్మయ్య శవపంచనామా నిర్వహించగా, సుధీర్ శరీరంపై మూడు బుల్లెట్ గాయాలున్నట్టు నిర్ధారించారు. ఈ ఎన్‌కౌంటర్ సంఘటనపై మంథని సీఐ టి.తిరుపతిరావు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని అడిషనల్ ఎస్పీతో పాటు పోలీసు అధికారులు, ఉదయ్‌కుమార్‌రెడ్డి, లక్ష్మినారాయణ, ఆర్.ప్రకాష్, రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వర్లు, ఉపేందర్, ఎల్.శ్రీను తదితరులు పరిశీలించారు. జిల్లా క్లూస్ టీం సైతం ఇక్కడికొచ్చారు. ‘శిష్ట రక్షణ… దుష్ట శిక్షణ’ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారెవరైనా… శిక్ష తప్పదని పోలీసు ఉన్నతాధికా రులు స్థానిక వన్‌టౌన్ పోలీస ్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేక రుల సమావేశంలో పేర్కొన్నా రు. జిల్లా అడిషనల్ ఎస్పీ బి.జనార్ధన్‌రెడ్డి, గోదావరిఖని డిఎస్పీ డి.ఉదయ్ కుమార్‌రెడ్డి, పెద్దపల్లి డిఎస్పీ లక్ష్మినారా యణ, వన్‌టౌన్ సిఐ ఎడ్ల మహేష్‌లు మాట్లాడుతూ… అనైతిక సంఘటనలకు పాల్పడితే తక్షణ చర్యలు చేపడుతామన్నారు. డబ్బు సులువుగా సంపాదించాలనే కాంక్షతో… కొంతమంది యువకులు తప్పుడు మార్గంలో పయనిస్తున్నారని… ఇప్పటికే చాలామందిలో కౌన్సిలింగ్ ద్వారా పోలీసుశాఖ మార్పులు చేపట్టిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజాశాంతికి భంగం కలగకుండా… పోలీసుశాఖ కఠినచర్యలు చేపడుతుందన్నారు. ప్రజలకు ఉపకరించే సమాచారం ఇచ్చేంత వరకే తమ ఆదరణ ఇన్‌ఫార్మర్‌లకు ఉంటుందని… హద్దుమీరితే వారిని సైతం వదిలేది లేదన్నారు. రౌడీయిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో బ్రతుకాలని పలువురికి వారు పిలుపునిచ్చారు. ‘లంగల సోపతితోనే… ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు’ చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న సుధీర్ ఎన్‌కౌంటర్ వార్తను తెలుసుకున్న అతని తల్లి లక్ష్మి కుంభపోతగా కురుస్తున్న వర్షంలో… పవర్‌హౌస్‌కాలనీ వీధుల్లో రోధిస్తు… తిరుగులాడిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. లంగసోపతి వద్దంటే వినకుండా… చిన్నప్పటి నుంచి తప్పుడు తిరుగుళ్ళు తిరిగిన సుధీర్ చివరకు ప్రాణం మీదికి తెచ్చుకున్నాడని… లక్ష్మి విలేకరులతో పేర్కొంది. మర్డర్ కేసులో జైలుకెళ్ళిన సుధీర్‌ను ఉన్న బంగారం అమ్మి బయటకు తీసుకవచ్చానని… బయటకు రాకున్న బతికిపోయే వాడని బోరున విలపించింది. కడుపుకోత ఎలా ఉన్నా సుధీర్ చేసిన నేరఘటనలు తమను ఎంతగానో బాధించేవన్నారు. ఏడాదిగా తమ ఇంటికి తన కొడుకు రావడం లేదని పేర్కొంది. కరీంనగర్‌లో నివాసం ఉంటున్న సుధీర్ చెత్తకుప్పల్లో శవమై ప్రత్యక్షమయ్యాడని, విలపించింది. ‘పట్టుకొచ్చి చంపారు’ తన తమ్ముడు సుధీర్‌ను కరీంనగర్ నుంచి పోలీసులు పట్టుకొచ్చి… చంపారని మృతుని సోదరి సునీత విలేకరులతో ఆరోపించింది. ఏడాదిగా సత్ప్రవర్తనతో కరీంనగర్ కోర్టు ఏరియాలో నివాసం ఉంటున్నాడని, అసలు గోదావరిఖనిలో జరిగిన నేరాలతో, హత్యలతో సుధీర్‌కు ఎటువంటి సంబంధం లేదని, అనవసరంగా ఆ కేసుల్లో ఇరికించారని అన్నారు. ఇటీవల అశోక్‌పై జరిగిన హత్యాయత్నంతో తనకు సంబంధం లేదని సుధీర్ ఏడుస్తు… తనతో తెలిపాడని సునీత పేర్కొంది. బ్రతికున్నంత కాలం చస్తు… బతికాడని బోరున విలపించింది. ‘రహస్య ఆనందోత్సవాలు’ ప్రజకంఠకుడిగా స్థానికంగా పేరొందిన సుధీర్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడన్న వార్త స్థానికంగా దావనంలా వ్యాపింది. ఘటన స్థలానికి… పోస్టుమార్టం జరిగిన ప్రభుత్వాసుపత్రికి చాలామంది చూడటానికి తరలొచ్చారు. అయితే నగరంలోని కొన్ని చోట్ల కొందరు… రహస్యంగా ఆనందోత్సవాలు జరుపుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా పవర్‌హౌస్‌కాలనీ, ఐబికాలనీ, సప్తగిరికాలనీ, బస్టాండ్ ఏరియాల్లో ఈ ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. చాప కింద నీరులా… కోల్‌బెల్ట్‌లో విస్తరిస్తున్న రౌడీయిజానికి ఈ ఎన్‌కౌంటర్ ‘చెంపపెట్టు’ అని వాఖ్యానం ప్రముఖంగా వినవస్తోంది. ఇదిలా ఉండగా… సరిగ్గా 12యేండ్ల క్రితం స్థానిక శివాజీనగర్‌లో సుకాశి రాజేష్ అనే రౌడీషీటర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన ఘటనను స్థానికులు నెమరువేసుకున్నారు.