ఖమ్మంలో దూసుకుపోతున్న కూటమి నేతలు
16 నుంచి రోడ్‌షోలతో హల్‌చల్‌కు కాంగ్రెస్ సన్నాహాలు
ఖరారు కానున్న ప్రచార కార్యక్రమాలు
ఖమ్మం,అక్టోబర్10(జనంసాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఈనెల 16 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నది. అయితే ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటున్నారు. కూటమి అభ్యర్థుల ఖరారు కాకున్నా మధిర, సత్తుపల్లి,కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో ప్రచారం చేప్టటారు. ఇప్పటికే ఈనెల ఒకటిన హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. సుమారు 105 కి.విూటర్ల వరకు బాలకృష్ణ రోడ్‌షో నిర్వహించి పలు సభలో మాట్లాడారు. ఈ పర్యటనకు మంచి స్పందన వచ్చింది. సత్తుపల్లిలో నిర్వహించిన సభకు, తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు నిర్వహించిన ర్యాలీకి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఇదేక్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉభయ జిల్లాల్లో రోడ్‌షో, బహిరంగ సభలకు ప్రణాళిక రూపొందించి ప్రజల ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించింది. ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో కాంగ్రెస్ కూడా దూకుడు ప్రదర్శించేందుకు సమాయత్తం అవుతోంది. శ్రేణులు కూడా రోడ్‌షో, సభలు విజయవంతం చేయడానికి సమాలోచనలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క నేతృత్వంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో త్వరలో ప్రచార భేరీ మోగించనుంది.ప్రచార కమిటీ ఛైర్మన్‌తోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తదితరులు ఉభయ జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రోడ్‌షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 16న సూర్యాపేట జిల్లా నుంచి పాలేరుకు ఉదయం 11 గంటలకు నాయకులు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం వరకు రోడ్‌షో నిర్వహించి సభ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు వైరా వరకు రోడ్‌షో నిర్వహించి సభనుద్దేశించి మాట్లాడుతారు. దసరా పర్వదినం పురష్కరించుకొని మూడు రోజులపాటు విరామం ఇవ్వనున్నారు. మళ్లీ 20న 11 గంటలకు బోనకల్లులో బహిరంగ సభ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు తల్లాడ లేనిపక్షంలో సత్తుపల్లిలో సభ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు కొత్తగూడెం వరకు రోడ్‌షో చేసి సభ ఏర్పాటు చేస్తారు. 21వ తేదీ 11 గంటలకు భద్రాచలం, 3 గంటలకు పినపాక, 6 గంటలకు ఇల్లెందులో సభలుంటాయి.