ఖరీఫ్ రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం
ఏలూరు, జూన్ 25 : ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఆందోళన నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా ఏలూరు సహా 15 నియోజకవర్గ కేంద్రాల్లో రైతు మహాధర్నాలు జరిగాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ పిలుపు మేరకు జిల్లా పార్టీ కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు కొవ్వురులోని మహాధర్నాలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అధోగతిపాలు చేస్తున్నదని ఆరోపించారు. రైతులు సాగు చేసేందుకు అనుకూల వాతావరణం కల్పనలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మొత్తం ఏడు లక్షల ఏడు వేల ఎకరాల పంటకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత రైతులను పీడిస్తున్నదని అన్నారు. 50 వేల క్వింటాళ్ల విత్తనాల కొరత రైతులను కష్టాల పాలు చేసిందని అన్నారు.
ఖరీఫ్ సాగుకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాలు అందించే విషయంలో ప్రభుత్వంలో ముందు చూపు కరవైందని, కిరణ్‌కుమార్ ప్రభుత్వం కేవలం స్వార్ధ రాజకీయాలతో కాలం వెల్లదీస్తున్నదని విమర్శించారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలో ఉంటే రైతులేమి బాగుపడతారని అన్నారు. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్, సీనియర్ నేత వేగిరాజు రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆపై తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తోట గోపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో పార్టీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి ధర్నా చేపట్టారు. నారాయణపురంలో జి.సుబ్బరాజు, వి.అచ్యుతరామారావు ధర్నా చేపట్టగా ఉంగుటూరులో మరో వర్గం నేతలు ధర్నా నిర్వహించారు. దెందులూరులో తహశీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా జరిగింది.
ఏలూరులో కలెక్టరేట్ వద్ద సిటీ కన్వీనర్ ఒద్దాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో పాల్గొన్న నేతలు ఒంటికాలిపై నిల్చుని నిరసన చేశారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా అదనపు జేసీ ఎంవి శేషగిరిబాబును కలిసి మాజీ డిప్యూటీ మేయర్ జి.బ్రహ్మావతి, జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ బి.వి.రమణ, స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎన్.జాన్ గురునాధ్, శ్రీనివాసరావు, ఎం.ఖైదర్‌లు వినతిపత్రం సమర్పించారు. 50 శాతం సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని, ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల పరిధిలో 58 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు, కృష్ణా, ఏలూరు కాల్వకు సత్వరం సాగునీటిని సరఫరా చేయాలని వారు కోరారు.