ఖేడ్‌లో దూసుకెళ్లిన కారు

5A

– 53,625 ఓట్లతో భూపాల్‌ రెడ్డి ఘన విజయం

– టీడీపీకి డిపాజిట్‌ గల్లంతు

మెదక్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి): వరుస విజయాలతో దూసుకుని పోతున్న అధికార టిఆర్‌ఎస్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగించింది.  ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి భూపాల్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన తన సవిూప కాంగ్రెస్‌ ప్రత్యర్ధి పి.సంజీవరెడ్డి పై 53625 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ దక్కించుకుని గౌరవ ప్రదమైన రీతిలో ఓట్లు పొందగా, తెలుగుదేశం పార్టీ డిపాజిట్‌ కోల్పోయింది. టిడిపి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌ రెడ్డికి 14787 ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటైన ఖేడ్‌లో టీఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధించి టీఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టించింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణఖేడ్‌ నియోజకవర్గ ప్రజలు అధికారి పార్టీ టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఖేడ్‌ ఉప ఎన్నికలో 1,88,373 ఓట్లకు గానూ 1,54,866 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌కు 93,076, కాంగ్రెస్‌కు 39,451, టీడీపీకీ 14,787 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, టీడీపీకి డిపాజిట్‌ గల్లంతైంది. కాంగ్రెస్‌ తరపున పటోళ్ల కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి, టీడీపీ నుంచి విజయపాల్‌రెడ్డి పోటీ చేశారు. పటోళ్ల కిష్టారెడ్డి మృతితో ఖేడ్‌కు ఉప ఎన్నిక జరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖేడ్‌ నియోజకవర్గంలో 14,746 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస అభ్యర్థిగా కిష్టారెడ్డి గెలుపొందారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌ ఉదయం 11.30 గంటలకు ముగిసింది. 21 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తి అయింది. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరించింది. ఇక ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ రెండో స్థానంలో, కాంగ్రెస్‌ రెండో స్థానంలో, టీడీపీ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ నెల 13న జరిగిన ఉప ఎన్నికలో 81.79 శాతం పోలింగ్‌ నమోదైంది.2014 సార్వత్రిక ఎన్నికలో 77.75 శాతం పోలింగ్‌ నమోదైన విషయం విదితమే.  ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో సంబురాలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ నేతలు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తున్నాయని నేతలు తెలిపారు. ఇక నేతలు, కార్యకర్తలు తీన్మార్‌ స్టెప్పులేసారు. గులాబీ రంగులు చల్లుకుంటూ మిఠాయిలు పంచుకూంటూ సంబురాల్లో మునిగితేలారు. తెలంగాణ భవన్‌లో జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి.

ఖేడ్‌ అభివృద్దికి కృషి చేస్తానన్న భూపాల్‌ రెడ్డి

నారాయణ్‌ ఖేడ్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయంతో టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆనందం పరవళ్లు తొక్కుతోంది. ఈ ఎన్నికలో 53వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  భూపాల్‌రెడ్డి ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు. ఈ ఘనవిజయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు జన్మదిన కానుకగా అందిస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్‌ బుధవారం ఫిబ్రవరి 17న 63వ పడిలో అడుగుపెట్టనున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంలో నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఘనవిజయంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింతగా తొణికిసలాడుతోంది. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించుకున్నారు. ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లతో గెలుస్తామనుకున్నా కాంగ్రెస్‌ పార్టీకి నిరాశే మిగిలింది. సిట్టింగ్‌ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డి రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఇక టీడీపీకైతే డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపించిన ఖేడ్‌ ప్రజలకు ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి టికెట్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలకు రుణపడి ఉంటాను. నారాయణఖేడ్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా. అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాను. ఈ నియోజకవర్గంపై సమగ్ర అవగాహన ఉంది. వలసల నివారణ చేపడుతాం. కాంగ్రెస్‌ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కారిస్తాను. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. నారాయణఖేడ్‌ లో తన విజయం వెనుక హరీష్‌రావుదే కీలకపాత్ర అని ఎమ్మెల్యేగా విజయం సాధించిన  భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌ విజయం కేసీఆర్‌కు జన్మదిన కానుకగా అందిస్తానన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తాను నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని భూపాల్‌ రెడ్డి చెప్పారు.  రేపు సీఎం కేసీఆర్‌ను కలిసి నారాయణఖేడ్‌కు ఆహ్వానిస్తానని  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వివరించారు.

ఫలించిన హరీష్‌ రావు వ్యూహం

ఈ ఎన్నిక విజయంతో మంత్రి హరీష్‌రావు వ్యూహం ఫలించింది. ఉప ఎన్నిక నేపథ్యంలో హరీష్‌రావు చేసిన ప్రచారానికి తగిన ఫలితం లభించింది. రాత్రినక, పగలనక ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన హరీష్‌రావు కృషికి ఖేడ్‌ ప్రజలు నీరాజనం పలికారు. హరీష్‌రావు వ్యూహం, రికార్డ్‌ స్థాయి పోలింగ్‌తో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని ఆ పార్టీ పెద్దలు భావించిన విషయం విదితమే. ఖేడ్‌ విజయాన్ని సీఎం కేసీఆర్‌కు జన్మదిన కానుకగా ఆ నియోజకవర్గలు ప్రజలు ఇచ్చారు.నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌కు అఖండ విజయాన్ని కట్టబెట్టిన నారాయణఖేడ్‌ ప్రజలకు మంత్రి హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు. అనుకున్నట్టుగానే విజయం సాధించి సీఎం కేసీఆర్‌కు జన్మదిన కానుకగా ఈ విజయాన్ని అందించామని చెప్పారు. ప్రభుత్వ పనితీరుకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. సానుభూతి పవనాలను పక్కనపెట్టి ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు అని తెలిపారు.  ఖేడ్‌ ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌కు అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఈ విజయానికి కారణమైన మంత్రి హరీష్‌రావుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఖేడ్‌ గెలుపుకు కృషి చేసిన మంత్రి హరీష్‌రావు, మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి కేటీఆర్‌ అభినందనలు చెప్పారు. నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగించింది. 21 రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యం కనబరిచి విజయాన్ని సొంతం చేసుకుంది. 21వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి 53,625 ఓట్ల మెజార్టీ వచ్చింది.  అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ 62,347 ఓట్లతో పటోళ్ల కిష్టారెడ్డి విజయం సాధించారు. అప్పుడు టీఆర్‌ఎస్‌ 47,601 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. టీడీపీకి 22,057 ఓట్లు పోలయ్యాయి.  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌ రెడ్డికి 93, 076 ఓట్లు వచ్చాయి. తన సవిూప కాంగ్రెస్‌ అభ్యర్థి సంజీవరెడ్డికి 39, 451 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 14, 787, స్వతంత్ర అభ్యర్థి భాస్కర్‌ కు 5,377 ఓట్లు వచ్చాయి. నోటాకు 853 మంది ఓటేశారు. టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించటంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నారాయణఖేడ్‌ మండలం జూకల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కొనసాగింది.   మొత్తం 137 మంది సిబ్బంది లెక్కింపు పక్రియలో పాల్గొన్నారు. లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. టీఆర్‌ఎస్‌ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలో గెలుపుతో టీఆర్‌ఎస్‌ చరిత్ర తిరగరాసింది. కాంగ్రెస్‌ కంచుకోటను టీఆర్‌ఎస్‌ బద్దలు చేసింది. ఖేడ్‌ ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌కు అభినందనలు వెలువెత్తుతున్నాయి. తెరాస అనే మహాశక్తి నిరాటంకంగా తన ఆధిపత్యాన్ని చలాయిస్తోందంటూ కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎన్నికల్లో 50వేలకు పైగా అద్భుత మెజారిటీ సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్‌ మంత్రి హరీశ్‌రావుకు, నారాయణఖేడ్‌ పార్టీ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌ కళకళలాడుతుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ ఆఫీసలు వెలవెలబోతున్నాయి. ఈ రెండు పార్టీ కార్యాలయాల వద్దకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కరూ రాలేదు. ఇళ్లకే పరిమితమయ్యారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు మాత్రం రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చుతూ.. మిఠాయిలు పంచుకుంటూ.. సంబురాల్లో మునిగితేలారు. నారాయణఖేడ్‌లో విజయంపై తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో  ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.  మొన్న జరిగిన వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయ ఢంకా మోగించింది. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో పసునూరి దయాకర్‌ 4,59,092 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ గుండెకాయ భాగ్యనగరంలో జరిగిన ఎన్నికల్లో కూడా కారు దూసుకుపోయింది. విపక్షాల అర్థరహిత ఆరోపణలను కొట్టివేస్తూ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగించింది. 150 డివిజన్లకు గానూ.. 99 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొంది గ్రేటర్‌ పీఠంపై గులాబీ జెండాను రెపరెప లాడించింది.