ఖేల్‌రత్నాకు సోమ్‌దేవ్ పేరు సిఫార్సు
ధ్యాన్‌చంద్ రేసులో విజయ్ అమృత్‌రాజ్
న్యూఢిల్లీ ,మే 2 (జనంసాక్షి): రెబల్ ఆటగాళ్ళతో వివాదాలు నెలకొని ఉన్నప్పటకీ…ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ మాత్రం తన బాధ్యతలను మరిచిపోలేదు. విభేదాలను పక్కనపెట్టి యువ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ పేరును ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నాకు సిఫార్సు చేసింది. ఏటీపీ టూర్‌లో అంచనాలకు మించి రాణించడంతో పాటు పలు సంచలన విజయాలు సాధించినందున సోమ్‌దేవ్‌ను నామినేట్ చేసినట్టు ఎఐటిఎ తెలిపింది. 2010 కామన్‌వెల్త్‌గేమ్స్‌లో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న సోమ్‌దేవ్… తర్వాత ఆసియా క్రీడల్లోనూ అదరగొట్టాడు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది డేవిస్‌కప్ వరకూ మంచి ప్రదర్శన కనబరిచాడు. అయితే అసోసియేషన్‌పై తిరుగుబాటు చేసిన ఆటగాళ్ళకు సోమ్‌దేవ్ సారథ్యం వహిస్తున్నాడు. ఇటీవలే ఏర్పాటు చేసిన ఇండియన్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్‌లో అతనే ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 2011 జూలై నెలలో సోమ్‌దేవ్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ 62కు చేరుకున్నాడు. ఇదిలా ఉంటే మరో ప్రతిష్టాత్మక అవార్డ్ ధ్యాన్‌చంద్‌కు విజయ్ అమృత్‌రాజ్ పేరును నామినేట్ చేసింది. విజయ్ అమృత్‌రాజ్ 1976లో తన సోదరునితో కలిసి వింబుల్టన్ సెవిూఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఇక ప్రస్తుత డేవిస్‌కప్ కోచ్ జీషన్ అలీ అర్జున అవార్డుకు నామినేట్ అయ్యాడు. వెటరన్ ప్లేయర్ రుష్మీ చక్రవర్తి పేరును కూడా అర్జున అవార్డుకు సిఫార్సు చేసినట్టు సమాఖ్య తెలిపింది. అటు నందన్ బాల్ ద్రోణాచార్య అవార్డుకు సిఫార్సు చేయబడినట్టు వెల్లడించింది.