గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి
– మంత్రి హరీశ్ సమీక్ష
– భూసేకరణపై రోజూ సవిూక్ష.
– జూలైలోపు ఎస్‌ఆర్‌ఎస్ పి ఆధునీకరణ పూర్తి .
– మిడ్ మానేరు పూర్తికి 2017 జూన్ డెడ్ లైన్.
కరీంనగర్,జూన్ 12(జనంసాక్షి):గడువులోగా కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఆదేశించారు. రీ ఇంజనీరింగ్ లో ఈ ప్రాజెక్టులే అత్యంత కీలకమని ఆయన అన్నారు. ఆదివారం ఉదయం కరీంనగర్ లో మూడు గంటలకు పైగా జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ వంటి అంశాలపై సవిూక్షించారు. కాళేశ్వరం, ఎల్లంపల్లి, వరద కాలువ, మిడ్ మానేరు, శ్రీరాంసాగర్ ప్రధాన కాలువ ఆధునీకరణ పనులను సుదీర్భంగా చర్చించారు. భూసేకరణ పనులపై ప్రతిరోజూ సవిూక్షించాలని రెవిన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు.శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద మేడారం , గంగాధర ప్రాంతాలలో లక్షా 65 వేల ఎకరాల ఆయకట్టు కు సంబంధించిన డ్రైరన్ ను నెలాఖరులోగా ఆరంభించాలని మంత్రి ఆదేశించారు. రెవిన్యూ ,అటవీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని
చీఫ్ ఇంజనీర్లను హరీష్ రావు ఆదేశించారు. వేమునూరు పంప్ హౌజ్ డ్రైరన్ ను ఆగస్టులో ప్రారంభించాలన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టుకు 2017 జూన్ కల్లా పూర్తి చేయాలని హరీష్ రావు కోరారు.ఎస్‌ఆర్‌ఎస్ పి ఆధునీకరణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. జూలై లోగా ఈ పనులు పూర్తి చేయాలని హరీష్ రావు టార్గెట్ విధించారు. ఎల్‌ఎండి ఎగువన 6 వ్యాకేజీల పనులు 40 శాతమే పూర్తయ్యాయని, ఎల్‌ఎండి దిగువన చేపట్టిన 9 ప్యాకేజీలలో 5 ప్యాకేజీలు 85 శాతం పూర్తి కాగా, నాలుగు ప్యాకేజీల పనులు 70 శాతం పూర్తయినట్లు మంత్రి గుర్తుచేశారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేయాలని ఎస్‌ఆర్‌ఎస్ పి సి. ఇ ని ఆదేశించారు. అలసత్వం విడిచిపెట్టాలన్నారు. ఎస్‌ఆర్‌ఎస్ పి కెనాల్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఈ కెనాల్ కింద 9 లక్షల ఆయకట్టు జరగాల్సి ఉండగా అత్యంత తక్కువ ఆయకట్టు జరుగుతోందన్నారు. కాల్వలను సమగ్రంగా మరమ్మత్తులు చేయాలని నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా కెనాల్ కు పూర్వ స్థితిని తీసుకురావాలని హరీష్ రావు ఆదేశించారు. తోటపల్లి లింక్ కెనాల్, తోటపల్లి రిజర్వాయర్ లకు సంబంధించిన భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. గౌరవెల్లి లో 1800 ఎకరాలు, గండిపల్లి లో 853 ఎకరాల భూసేకరణ పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కు కావలసిన 45 వేల ఎకరాలను అటవీశాఖ అధికారుల సమన్వయంతో త్వరితగతిన సేకరించాలని కోరారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిళ్ల రిజర్వాయర్లు, వీటికి చెందిన పంప్ హౌజ్ ల భూసేకరణ పనుల పురోగతిని కాళేశ్వరం సిఇ ఎన్.వెంకటేశ్వర్లు మంత్రికి వివరించారు. ఈ పనులన్నింటికీ అత్యంత ప్రాధాన్యం ఇవ్యాలని మంత్రి హరీష్ ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో, రీఇంజనీరింగ్ తో పాటు అన్ని అంశాలను పూర్తి చేసే అంశంపై మంత్రి హరీష్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రాజెక్టుల విషయంలో ఆర్థిక లోటు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా నిధులు కేటాయిస్తున్నందున అధికారులంతా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ముఖ్మమంత్రి, మంత్రితోపాటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఏకబిగిన పనిచేస్తుండటంతో… అనుకున్న సమయానికే ప్రాజెక్టులు పూర్తి అవుతాయన్న అశాభావం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అన్ని ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారని, ప్రతి విషయాన్ని పిన్ పాయింట్ గా ప్రస్తావిస్తున్నారని అని మంత్రి హరీష్ అధికారులను తెలిపారు. బీడుపడి , నెర్రబాసి ఉన్న తెలంగాణ పొలాల్లో ప్రతీ అంగుళం కూడా సాగులోకి రావాలని.. అందుకోసం ఇరిగేషన్ శాఖ అధికారులు మరింత బాధ్యతతో పని చేయాలని హరీష్ రావు సూచిస్తున్నారు. కరీంనగర్ ప్రాజెక్టుల సవిూక్ష లో చీఫ్ ఇంజనీర్లు ఎన్. వెనీకటేశ్వర్లు, అనిల్, శంకర్ తో పాటు ఆయా ప్రాజెక్టుల ఎస్.ఇలు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.