గడ్డాలూ-మీసాలూ

కథలు గుర్తుకువచ్చినప్పుడల్లా మా తాత గుర్తుకొస్తారు. ఆయన వంగిపోయిన నడుము గుర్తుకొస్తుంది. ఆయన ధోతి గుర్తుకొ స్తుంది. ఆయన నులక మంచం గుర్తుకొస్తుంది. ఆయన గడ్డం మీసాలూ గుర్తుకొస్తాయి. చివరికి ఆయన మరణం గుర్తుకొస్తుంది. మా తాతకి ముగ్గురూ కూతుర్లే. మగ సంతానం లేదు. మా బాపు డాక్టర్‌ కావడం వల్ల మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తక్కువ. అందు కని మా అమ్మ మా తాతని తన దగ్గరే వుండమని చెప్పేది. వైద్యం కూడా వుంటుందని చెప్పేది. ఈ రెండు కారాణాల వల్ల మా తాత మా దగ్గరే ఎక్కువగా వుండేవాడు. కానీ నెలకు రెండు రోజులు మిగతా బిడ్డల దగ్గరికి పొయ్యేవాడు. మిగతా ఇద్దరు బిడ్డలు వ్యవసా యదారులు.మా అరుగు పక్కన ఓ చిన్న రూం వుంది. అందులో మా తాత వుండేవాడు. ఆ రూంకి తాతర్రని పేరు. మా తాత చనిపోయి నలభై సంవత్సరాలు అవుతున్నా ఆ అర్రకి ఇప్పటికీ అదే పేరు. అం దులో ఆయనకో నులక మంచం. దానిమీద ఓ గొంగడి. ఓ చద్దరూ ఉండేవి. ఆయన మంచం పక్కన ఓ చిన్న చెక్క అలమార వుండేది. మా తాత పుట్టినప్పటినుంచి వ్యవసాయ పనులు చేశాడు. పని ఆయనతోనే పుట్టింది. అందుకని ముసలితనంలో కూడా పని గురిం చి ఆరాటపడేవాడు. సాయంత్రం కాగానే కోళ్లను గంపకింద కమ్మి నారా లేదా చూసేవాడు. బర్రెలకు మేత వేశరా లేదా అన్న విషయం పట్టించుకునేవాడు. ఉదయాన్నే లేచి మా మల్లయ్యతో పాటు మా దొడ్లోకి పోయి దగ్గరుండి పాలు పిండించేవాడు. బాదం చెట్టు కిందిక ిపోయి పక్షులు కొట్టిన బాదంకాయల్ని, జామకాయల్ని, రాలి కింద పడ్డ కాయల్ని తెచ్చి మా కోసం తన అర్రలో పెట్టేవాడు. మేం బడికి పొయ్యేటప్పుడు మాకు రెండు బాదం కాయల్నో, జామకాయల్నో ఇచ్చేవాడు.మా తాత చదువుకోలేదు. అందుని మమ్మల్ని ఎక్కువగా చదవమని చెప్పేవాడు. చదువుకుని వస్తేనే కథ చెబుతానని చెప్పే వాడు. కథలకి అతను ఊసిల్లపుట్ట. చెప్పిన కథ చెప్పకుండా రోజుకో కొత్తకథ చెప్పేవాడు. ఓ రోజు పీఠలమ్మ వారి కథ చెప్పేవాడు. మరో రోజు పేదరాసి పెద్దమ్మ కథ చెప్పేవాడు. రాము లవారి కథ చెప్పేవాడు. మా రాజన్న జాతరా కథ చెప్పేవాడు. తన చిన్నతనం ముచ్చట్లు కథలు కథలుగా చెప్పేవాడు. చదువురాని మా తాతకి ఇన్ని కథలు ఎట్లా వచ్చేవో నాకర్థం కాక పొయ్యేది.కథలే కాదు. నిమ్మకాయ డిప్పలతోని తరాజు చేసివచ్చేవాడు. చొప్ప బెండుతోని కచ్చు రం చేసేవాడు. మక్క కంకిపీచుతో మీసాలు చేసిచ్చేవాడు. మా తాత మాకొక వింత ప్రపం చంలా అన్పించేవాడు. ప్రతిరోజూ ఓ వింతని చేసేవాడు. ఒక రోజు బాణం చేసిచ్చేవాడు. ఒక రోజు గులేరు చేసిచ్చేవాడు. మరోరోజు మట్టితో కుండలు చేసిచ్చేవాడు. ఇట్లా ఎన్నో చేసేవాడు.

ఆయన చెప్పే కథల్లో మంత్రాలుం డేవి. మాయల మరాటీలు వుండేవాళ్లు. ఇవన్నితోటిబాటూ చుట్టకంపూ వుండేది. కథలు చెప్పి చెప్పీ నన్ను గట్టిగా ముద్దు పెట్టుకునే వాడు. అప్పుడు మాత్రం ఆయన మీద నాకు విపరీతమైన కోపం వచ్చేది. ఎందుకంటే ఆయన మీసాలు గుచ్చు కునేవి. గడ్డం గుచ్చుకొని మంటవేసేది. చుట్టకంపుతో కక్కొచ్చినంత పనయ్యేది. కాళ్లూ చేతులూ కొట్టుకునేవాడిని. విసుక్కునేవాడిని. చేతుల్తో కొట్టేవాడిని. తప్పించుకొని పారిపొయ్యేవాడిని.మా బాపు లాగా రోజూ గడ్డం తియ్యకపోయ్యేవాడు. వారం రోజులకొకసారి గడ్డం తీసేవాడు. అది కూడా ఆయన కాదు. మంగలి తీసేవాడు. ఎన్నో పనులు చేసే మా తాత తన గడ్డం తాను ఎందుకు తీసుకున ేవాడు కాదో నాకర్థం కాకపొయ్యేది. అప్పటికింకా మా వూర్లో సెలూ న్లు రాలేదు. ఇంటికి వచ్చి తీసేవాళ్లు. మా తాత నన్ను గట్టిగా ముద్దు పెట్టుకున్నప్పుడల్లా నేను ఆయన అర్రలోకి పోవడానికి ఇష్టపడేవాడిని కాదు. పోకపొయ్యేవాడిని. కానీ ఒకటి రెండు రోజుల తరువాత మళ్లీ మామూలే. ఒక్కరోజు నేను మా తాత దగ్గరికి పోకపోతే మా అక్క నాకొక కొత్తకథ చెప్పేది. మా అక్క నాకు కొత్త కథ చెప్పడం ఇష్టం వుండేది కాదు. అందుకని మా తాత చుట్టకంపునీ, గడ్డం మీసాలని భరించేవాడిని. ఎందుకంటే నాకు కథ కావాలి. ఓ కల కావాలి. నేను మాయల మరాటిని ఓడించే యువరాజునైపోవాలి. వద్దన్న దిక్కుకే వెళ్లే వీరుణ్ణయిపోవాలి. అందుకని మా తాత గడ్డం మీసాలని భరించే వాడిని.మా తాత గడ్డం తీయించుకుంటున్నప్పుడు మా తాత ముందు అద్దం పట్టుకుని నిల్చుండేవాడిని. ఆయన ముఖం ఆయనకే కన్పించ కుండా అటూ ఇటూ తిప్పేవాడిని. అద్దంలో నా ముఖం చూసు కునేవాడిని. మా తాతకి విసుగు తెప్పించేవాడిని. మా తాత మీసాలు గొరిగెయ్యమని ఎన్నిసార్లు చెప్పినా మా మంగలి తీసేసేవాడు కాదు. మా తాతకి కోపం వచ్చేది. ‘నా మీసాల సంగతి నీకెందుకు’ అనే ేవాడు. అంతేకాని తిట్టేవాడు కాదు. కూతురు పిల్లలం కాబట్టి మమ్మ ల్ని రారా పోరా అనేవాడు కాదు.మేమెవ్వరమూ లేనప్పుడు ఆయనకి మీసాలతోనే కాలక్షేపం అయ్యేది. మీసాలమీద నిమ్మకాయలు పెట్టా లనేవాడు. మీసాలతోనే అందం అనేవాడు. నన్ను ఇబ్బంది పెట్టే వాడు. మీసాలని కత్తెరతో కట్‌ చేద్దామని చాలాసార్లు అనుకున్నాను. కానీ చెయ్యలేకపోయాను. ఆయన అర్రలోకి అడుగుపెట్టగానే ఆయ నకు మెలకువ వచ్చేది.

‘ఆ తెల్ల మీసాలెందుకు’ అని మా తాతను అడిగేవాడిని. అవి తీసెయ్యమని, మా బాపులాగా రోజూ గడ్డం తీసుకొమ్మని చెప్పే వాడిని. అప్పుడు మా తాత గడ్డాలు మీసాల మీద ఓ కథ చెప్పేవాడు.

‘మీ బాపులాగా నేను దవాఖానాకి పొయ్యేపనుందా? లేదు. మరి ఎందుకు తియ్యడం. రక్తం కారెటట్టు రోజూ తీసుకో వడం నాకు చేతగాడు’ అనేవాడు. మీసాలు ఒకసారి తీసేశాడట. ఆ రోజు అమ్మమ్మతో పెద్ద గొడవ జరిగిందట. రెండు రోజులు మాట్లా డలేదట. అప్పటి నుంచి మీసా లు చూస్తూ అమ్మమ్మని యాది చేసుకు ంటున్నానని చెప్పే వాడు.ఈ రెండు విషయాలు చెప్పిన తర్వాత ఆయ నని విస ిగించడం మానేశాను. ఆ మీసా లు ఎంత ఇబ్బంది పెట్టినా ఆ యన చెప్పే కథల కోసం భరి ంచేవాడిని.కొంతకాలానికి మా తాతని కాలం కాటేసింది. అతని మీసాలు గడ్డం కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ తర్వాత కొత్త కథలు చెప్పేవాళ్లు లేరు. మా అమ్మకి తీరిక వున్నప్పుడు ఓపిక వున్నప్పుడు ఏదో ఒక కథ చెప్పేది. ఆకాశంలో చందమామని చూపించి ఎన్నో కథలు చెప్పే మా తాత చంద్రునిలో కలిసిపొయ్యాడు. ఇక మాకు చందమామ, బాలమిత్రలే నేస్తాలయినాయి. తెలుగు చందమామల నుంచి ఇంగ్లిషు చందమామాల్లోకి వచ్చేశాను. గడ్డాలు మీసాల సంగతే మర్చి పొయ్యాను.కాలగర్భంలో కలిసిపోయిన మా తాత గడ్డం మీసాలు మళ్లీ కన్పించడం మొదలైంది. కొత్తలో బెరుకు బెరుకుగా వుండేది. అందరి ముందుకు పోవాలంటే సిగ్గుగా వుండేది. ‘అబ్బో! వీడికి మీసాలు గడ్డాలూ వస్తున్నాయని’ ఎవరో ఒకరు అనేవాళ్లు. ఆ మాటలతో నాలోకి నేనే కుంచించుకుపొయ్యేవాడిని. చాలా రోజులకి కన్పించిన పెద్దవాళ్ల ముందుకు పోవడానికి సంకోచించేవాడ్ని. ఎవరూ లేనప్పుడు అద్దంలో తరచూ నా ముఖం నేనే చూసుకునేవాడిని. నా ముఖం విస్తృతమయ్యేది. కొత్తలో గొప్ప సరదాగా వుండేది. తెల్లటి ముఖం మీద నల్లటి మీసాలూ గొప్ప అందంగా కన్పించేది. మీసాలని గడ్డాన్ని నిమురుకుంటూ మురిసిపొయ్యేవాణ్ని.కొద్ది రోజులకి ముఖం నిండా వెంట్రుకలు వచ్చేశాయి. మా వూరి నిండా సెలూన్లు వచ్చాయి. అక్కడికెళ్లి గడ్డం తీయించుకోవడం ఇష్టంలేదు. గడ్డం తీసెయ్యాలని మాత్రం అన్పించేది. ఒక రోజు నేనూ మా ముగ్గురు మిత్రులం కలిసి మూడు బ్లేడ్లు కొనుక్కుని మా బాపు క్షవరం పెట్టెను తీసుకుని మా బంగ్లా మీదికి పోయినాం. అప్పుడప్పుడే హిందీ సినిమాలను చూస్తున్న దశ. హిందీ సినిమాల్లో ఏ హీరోకి మీసాలుండవు. గడ్డం వుండదు. తెలుగు సినిమాల్లో కూడా దేవతలకి గడ్డాలుండవు. మీసాలుండవు. ఆ ప్రభావం మా నలుగురి మీద వుంది. గడ్డంతో బాటు మీసాలు తీసివెయ్యాలన్న నిర్ణయానికి వచ్చాం. ముందుగా బాపురెడ్డి గడ్డం మీసాలు తీసేశాడు. ఆ తరువాత నా వంతు వచ్చింది. నేనూ తీసే శాను. ఏదో కలవరం. గగుర్పాటు, అందరి ముఖాల్లో ఏదో తెలి యనిబెరుకు,సిగ్గు,ఒకరినొకరంచూసుకుని నవ్వుకున్నాం.ఆటలకోసం బయటకు వెళ్లలేదు. మీసాలు తీసేస్తున్నప్పుడు మా తాత గుర్తుకొ చ్చాడు. మీసాల గురించి ఆయన మాటలూ గుర్తుకొచ్చాయి. చీకటి పడిన తారువాత కిందికి వెళ్లకతప్పలేదు. మా అన్నయ్య, బావలు కూడా ఆరోజు ఇంట్లో వున్నారు. మమ్మల్ని చూడగానే వాళ్ల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది. వాకిట్లో నుంచి మెల్లగా జారుకుంటున్న మా మిత్రులనీ నన్నూ కచేరీలోకి పిలిచారు. రాజేశ్‌ఖన్నాలా మేం వున్నామని మమ్మల్ని బనాయించారు. వెక్కిరించారు. మేం ఏమీ మాట్లాడలేదు. కాసేపటికి అక్కడినుంచి మెల్లగా జారుకున్నాం. ఆరో జు నుంచి మీసాలు ఎప్పుడూ తీసెయ్యలేదు. మా మిత్రులు అంతే!

నాకు పరమ విసుగు కలిగించిన మా తాత గడ్డాలు మీసాలు నాలో ప్రవేశించి నన్నో యువకుణ్ని చేశాయి. కొత్తలో ఈ గడ్డం తీయడం ఏదో ఘనకార్యం చేసినట్లుగా అన్పించేది. ఆ తరువాత కష్టాలు మొదలైనాయి. మొదట్లో రెండు రోజులకోసారి గడ్డం పెరిగిన ట్టు అన్పించేది. కాని ఆ తరువాత తెల్లవారేసరికే గడ్డం పెరిగినట్టు వుండేది. తరువాత్తర్వాత సాయంత్రానికే పెరిగినట్టుగా అన్పించడం మొదలైంది. ఒక్కరోజు గడ్డం తియ్యకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు, ముఖమంతా విచారం గూడుకట్టుకుని వున్నట్టు అన్పించేది. ఒక్క రోజు గడ్డం తీసుకోకపోతే ఎంతోమందికి జవాబు చెప్పాల్సి వచ్చేది. రోజూ చేసే దైనందిన కార్యక్రమాలు ఏవీ విసుగ్గా అన్పించేవి కాదు కానీ గడ్డం తీసుకోవడం మాత్రం చాలా విసుగ్గా అన్పించేది. మా తాత వారం రోజులకొకసారి గడ్డం ఎందుకు తీసుకునేవాడో, అదీ మంగలితోఎందుకుతీయించుకునేవాడో నాకర్థమయ్యింది.డిగ్రీకొచ్చిన తర్వాత గడ్డం తీయడం మానేశాను. వారం కొకసారి సెలూన్‌కి వెళ్లి ట్రిమ్‌ చేయించేవాడిని. ఈ పద్ధతే హాయిగా అన్పించింది. గడ్డం పెంచి ట్రిమ్‌ చేయించుకోవడం వల్ల చాలా లాభాలుండేవి. మిగతా వాళ్లకన్నా డిఫరెంట్‌గా కన్పించవచ్చు. ఓ కళాకారునిగా కన్పించవ చ్చు. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మేధావిలా ఫోజు పెట్టడానికి గడ్డం చాలా ఉపయోగపడింది.న్యాయవాదిగా ప్రాక్టీసులోకి వచ్చిన తర్వాత గడ్డం తీసెయ్యమని చాలామంది సీనియర్లు ఉచిత సలహాలు ఇచ్చారు. ఉత్తర తెలంగాణాలో వుంటున్నావు కదా నక్సలైట్‌ న్యాయ వాదివని అనుకుంటారని కూడా చెప్పారు. జడ్జీలు తమ విచక్షణా ధికారాలని నాకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారని కూడా బెదిరించారు. అయినా నేను గడ్డాన్ని తియ్యలేదు. అదే పద్ధతిని కొనసాగించాను. రోజూ ఓ అరగంట సమయం కలసి వస్తుందని వాదనలు చేశాను. కొంతకాలం తర్వాత సలహాలు ఇవ్వడం మానేశారు. వారం పది రోజులకొకసారి సెలూన్‌కి వెళ్లి ట్రిమ్‌ చేయించుకోవడం హాయిగా వుండేది. కొంతకాలం తర్వాత ట్రిమ్‌ చేసుకునే మిషన్‌ కొన్నాను. సెలూన్‌కి వెళ్లే బాధ కూడా తప్పింది.మరికొంతకాలానికి నాకు పెళ్లయింది. నా గడ్డం మా ఆవిడకి అడ్డం వచ్చింది. నా వాదలేవీ ఆవిడ ముందు నిలువలేదు. న్యాయవాదులని ఒప్పించగలిగాను, న్యాయమూర్తులను ధిక్కరించాను, కాని, మా ఆవిడ కోర్టులో నా కేసు ఓడిపోయింది. నా వాదనల్లో బలం లేదని తేల్చింది. నా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఒక్కరోజు గడ్డం తియ్యకపోయినా ఆవిడతో గొడవే. అందకుని రోజూ గడ్డం తీయడం మొదలు పెట్టాను. పెళ్లి తర్వాత వచ్చిన మార్పుని చూసి చాలామంది నవ్వుకున్నారు. స్నేహితులు కొంతమంది లెక్కలేనన్ని జోకులు వేశారు. అన్నీ భరించాను.ఓ మాంచి షేవింగు బ్రష్షూ, మంచి క్రీం, మంచి బ్లేడ్లు కొనుక్కుని గడ్డం రోజూ తీయడం మొదలు పెట్టాను. గడ్డం తీసిన తర్వాత పెట్టుకోవడానికి ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌, ఎన్నో సువాసనలు. రేజర్‌ బ్లేడునుంచి, యూజ్‌ అండ్‌ త్రోకి మారాను. రెండు బ్లేడ్ల నుంచి మూడు రేజర్ల వున్న మాచ్‌-3కి మారాను. ఎన్ని బ్లేడ్లు మార్చినా గాట్లు తప్పకపొయ్యేవి.గాట్లు పడకుండా గడ్డం తీసుకోవడం కోసం చెయ్యని ప్రయోగాలు లేవు. రాత్రిపూట ముఖం కడిగి వాసిలేనో, బోరోలినో పూసి పడుకునేవాడ్ని. తరువాత ఉదయం ముఖం కడిగి ఆ తర్వాత క్రీము పూసి షేవ్‌ చేసే వాడ్ని. ఎన్ని చేసినా గాట్లు తప్పకపొయ్యేవి. సబ్బు పెట్టిన ముఖం కడుగకుండా గడ్డం తీసిన రోజూ, హడావిడిగా వున్న రోజు ఎక్కువ గాట్లు పడేవి. పాపం మా ఆవిడ నా మీద జాలిపడి షేవింగ్‌కి సంబంధించి కొత్త వస్తువులు ఏవైనా మార్కెట్లోకి వస్తే అవి నాకోసం తెచ్చేది. ఎన్ని క్రీములో, ఎన్నిలోషన్లో, ఎన్ని కత్తెర్లో, ఎన్ని వెరైటీ బ్లేడ్లో, ఎంత ప్రపంచం గడ్డం వెనుక.ఎన్ని పనులున్నా, ఎంత హడావిడి వున్నా ఈ గడ్డం తీసుకోవడం మాత్రం తప్పేది కాదు. మీసాలు తియ్యడానికి వీల్లేదు. అది ఆవిడ కోరిక. బహుశా ఆజ్ఞేనేమో. రోజూ గడ్డం తియ్యడం ముఖాన్ని గాట్లు పెట్టి అయినా నాగరీకం చేసు కోవడం రోజూ అత్యంత ప్రముఖమైన ఘట్టం.

సాధ్యమైనన్ని తక్కువ గాట్లతో గడ్డం తీసుకోవాలనుకున్న ప్రయత్నంలో ప్రతిరోజూ గడ్డం తీసేవాణ్ని. ఎంతజాగ్రత్తగా వున్న మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నా గాట్లు తప్పకపొయ్యేవి. రక్తం చూసి జాలి పడేది. ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌ పెట్టేది. కానీ గడ్డం తీసుకోకుండా వుండటానికి మినహాయింపు ఇచ్చేది కాదు మా ఆవిడ. గాట్లతో నడు స్తున్న రోజులని కాలం అలాగే నడువనివ్వదు కదా! అంతలోనే మధ్య వయస్సుని తెచ్చింది. తెలియకుండానే మీసాల్లో ఒకటి రెండు తెల్ల మీసాలు కన్పించడం మొదలైంది.కొత్త సమస్యలు ముందుకొచ్చాయి. ప్రతిరెండు మూడు రోజులకోసారి తెల్లమీసాల ఏరివేత కార్యక్రమం. కత్తెరకు పని కల్పించడం, తెల్లగడ్డమూ కన్పించడం మొదలైంది. దానితో బాధలేదు. ఎందుకంటే దాన్ని ఉదయాన్నే తీసేస్తాను. ఈ మీసాలతోనే చచ్చేంత బాధ. ఒకటి రెండు తెల్లమీసాల సంఖ్య నుంచి తెలియనంతగా పెరిగిపోయాయి. కత్తెరకకు పని కల్పిస్తే మీసాలు క్రమపద్ధతిలో కన్పించేవి కావు.చాలామందికి మీసాలకి రంగులు వేస్తున్నారు. అలర్జీలతో బాధపడుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కోరకమైన అనుభవం. అందుకని మీసాలు తీసేస్తానన్న ప్రతిపాదన చేశాను. సమర్ధిస్తూ వాదన చేశాను. మళ్లీ కేసు వీగిపోయింది. ముఖం చూడలేమన్న పరిశీలనతో అదీ ఆవిడ తీర్పు.ఏం చేస్తాను? అలాగే కత్తెరకి పని కల్పిస్తూ రోజూ గడ్డంతో కుస్తీ పడుతూ. ఈ గడ్డం మీసాలకి నాకు ఏదో అవినాభావ సంబంధం వుంది. నా చిన్నప్పుడు కథల కోసం మా తాత మీసాలని గడ్డాలని భరించాను. ఇప్పుడు మా ఆవిడ కౌగిలింత కోసం ఈ మీసాలని భరిస్తున్నాను. గడ్డాన్ని తీసేస్తున్నాను.ఈ కౌగిలింతలో కూడా ఎన్నో కథలు. మరెన్నో వెతలు.ఇప్పుడు అద్దంలో నాముఖం విస్తృత కావడం లేదు. నల్లమీసాల్లో తెల్లవాటిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. కానీ కాలం వూరుకోదు కదా! ఇప్పుడు అద్దం మా అబ్బాయి ముఖాన్ని తనలో విస్తృతం చేస్తోంది.