గత ఎన్నికల హావిూలను విస్మరించిన కెసిఆర్
మళ్లీ ఓటేస్తే రజాకార్ల పాలన తీసుకొస్తారు
మార్పు కోసం బిజెపికి పట్టం కట్టాలి
ప్రచారంలో ఆచారి పిలుపు
కల్వకుర్తి,నవంబర్27(జనంసాక్షి): గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నమ్మి ప్రజలు కేసీఆర్‌ను గెలిపిస్తే, వాటిని వమ్ము చేశారని బీజేపీ రాషట్‌ర కార్యదర్శి, కల్వకుర్తి అభ్యర్థి ఆచారి ఆరోపించారు. ప్రజలు కెసిఆర్‌ను నమ్మి ఓటేస్తే మోసం చేసి గడీల పాలనకు తెరతీసారని అన్నారు. మళ్లీ గెలిపిస్తే రజాకర్ల పాలన వస్తుందని హెచ్చరించారు. మార్పు కోసం, మంచి భవిష్యత్ కోసం బీజేపీకి పట్టంకట్టాలని కోరారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు అవకాశం ఇచ్చారని, ఈ ఒక్కసారి బీజేపీకి పట్టం కట్టండన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలోనే తెలంగాణను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హావిూ ఇచ్చారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలన్నీ అభివృద్ధిని అడ్డుకున్నాయని ఆరోపించారు. ఆయా పార్టీల పాలనలో ఈ ప్రాంత భవిష్యత్ కుంటుపడిందన్నారు. ఓవైసీపై కేసు నమోదు అయినప్పటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎవరికి భయపడి కేసుపైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రజాకార్లు, మజ్లిస్‌ను ఎదుర్కొనే దమ్ము కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. ఎంఐఎంకు భయపడే టీఆర్‌ఎస్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు నమ్మి ప్రజలు కేసీఆర్‌ను గెలిపిస్తే, వాటిని వమ్ము చేశారని ఆచారిఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తామని ఇచ్చిన హావిూ ఏమైందని ప్రశ్నించారు. కనీసం భవిష్యత్‌లోనైనా చేసే సంకల్పం ఉందా అని అడిగారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 4,500మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, సీఎం సొంత నియోజకవర్గమైన ఒక్క గజ్వేల్‌లోనే 130మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమాల్లో అమరులైన వారి కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాటమార్చారని విమర్శించారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాలు మరచిపోయారన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ బిడ్డలపై పట్టింపు లేదని, తన కొడుకు, కూతురుకు అధికారం కట్టబెట్టడంపైనే ఉందని విమర్శించారు. గిరిజనలతో కలిపి మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కేసీఆర్ ప్రతిపాదించారని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేదని తెలిసినా టీఆర్‌ఎస్ ఈ పని చేసిందని మండిపడ్డారు.