గత పాలకులు కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు
దీనికి కూటమి నేతలు సమాధానం చెప్పాలి: ఎర్రబెల్లి
జనగామ,నవంబర్21(జనంసాక్షి): వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దీనిని కూటమి నేతలు కాదనగలరా అని పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గతంలో ఈ పాలకులు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయారో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని అన్నారు. రైతుల కష్టాలు తెలిసిన మనిషి కేసీఆర్ అని, అందుకే పంట పెట్టుబడి కింద ఎకరాకు రెండు పంటలకు రూ.8వేలు అందిస్తున్నారన్నారు. గతంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కే వారని, నేడు సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందుతున్నాయన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నడుం బిగించిన కేసీఆర్‌ను అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే రైతు బంధు సాయాన్ని ఏడాదికి ఎకరాకు రూ.10వేలకు, ఆసరా పింఛన్ల ను రూ.2016కు పెంచుతారన్నారు. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు రూ.3016 భృతిని అందజేస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని.. రైతు ముఖంలో చిరునవ్వు చూసేందుకే రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులకు జరుగుతున్న మేలును చూసి 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. నియోజక
వర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.