ప్ర‌భుత్వ అధికార లాంఛ‌నాల‌తో ముగిసిన గ‌ద్ద‌ర్ అంత్యక్రియలు

హైద‌రాబాద్ :  ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అంతిమ సంస్కారాలు బౌద్ధ సంప్రదాయం ప్ర‌కారం నిర్వ‌హించారు. గ‌ద్ద‌ర్ అమ‌ర్ ర‌హే అంటూ అభిమానులు నిన‌దించారు. అల్వాల్‌లోని మ‌హోబోధి విద్యాల‌యంలో ప్ర‌భుత్వ అధికార లాంఛ‌నాల‌తో గ‌ద్ద‌ర్ అంతిమ సంస్కారాలు ముగిశాయి. గ‌ద్ద‌ర్ అంత్య‌క్రియ‌ల‌ను ఆయ‌న పెద్ద కుమారుడు సూర్యుడు నిర్వ‌హించారు. మ‌హాబోధి విద్యాల‌యాన్ని గ‌ద్ద‌రే స్థాపించారు. ఇక గ‌ద్ద‌ర్ అంత్య‌క్రియ‌ల సంద‌ర్భంగా ఆయ‌న భార్య విమ‌ల‌, కుమారుడు సూర్యుడు, కూతురు వెన్నెల బోరున విల‌పించారు. గ‌ద్ద‌ర్ అంత్య‌క్రియ‌ల నేప‌థ్యంలో మ‌హాబోధి విద్యాల‌యం జ‌న‌సంద్రంగా మారింది. అంతిమ సంస్కారాల‌కు రాజ‌కీయ నాయ‌కులు, మేధావులు, క‌వులు, క‌ళాకారులు భారీగా త‌ర‌లివ‌చ్చారు.