గద్దెలపై వనదేవతలు

5

– పోటెత్తిన భక్తజనం

మేడారం(తాడ్వాయి),ఫిబ్రవరి 18(జనంసాక్షి):ప్రపంచంలో మరెక్కడా కానరాని విధంగా అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. గత కొన్ని రోజులుగా మేడారం చుట్టు పక్కల నాలుగు గ్రామాల వెడల్పులో లక్షలాది మంది ప్రజల రాకతో జనసంద్రంగా మారింది. అమ్మలగన్న అమ్మ అయిన సమ్మక్కను గురువారం గద్దెలపైకి తీసుకువచ్చిన ఉద్విగ్న సన్నివేశం ఆవిష్కృతమైంది. లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తూ జయజయ ద్యానాలు మిన్నంటగా, అధికార లాంఛనాలతో మేడారం సమీపంలోని చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను కుంకుబరిణ రూపంలో గిరిజన పూజారులు మేడారంలోని సమ్మక్క గద్దెపైకి చేర్చారు. వేలాది మంది పోలీసుల భారీ బందోబస్తు మధ్య, గిరిజన పూజారులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా సమ్మక్కను గద్దెపైకి చేర్చి  వరంగల్‌ రేంజ్‌ డిఐజి బి.మల్లారెడ్డి, రూరల్‌ ఎస్పీఅంబర్‌కిషోర్‌ ఝా ఆధ్వర్యంలో గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కను ప్రతిష్టించారు. జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ,  ఐటిడిఎ పిఓ అమయ్‌కుమార్‌,దేవాదాయశాఖ డిప్యూటి కమిషనర్‌ రమేష్‌బాబు, జిల్లా అధికారులు, సమ్మక్క సారలమ్మల పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావులు వెంట రాగా, పూజారులు సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చారు. గిరిజన పూజారుల సాంప్రదాయబద్దమైన పూజలతో సమ్మక్కను గద్దెపైన నిలుపడంతో మేడారం మహాజాతరలో కీలకఘట్టం చోటు చేసుకున్నది. ఈ సన్నివేశం కోసమే ఎదురుచూసిన లక్షలాది మంది జనం సమ్మక్క సారలమ్మలను కొలిచేందుకు కిలోమీటర్ల కొద్ది బారులు తీరి దర్శించుకుంటున్నారు. మేడారం గ్రామానికి చుట్టూ ఆరు కిలోమీటర్ల వెడల్పులో ఎటు చూసినా పోటెత్తిన భక్తజనంతో మేడారం జనసంద్రంగా మారింది. బస్సులు, ప్రైవేట్‌ వాహనాల ద్వారా తరలివస్తున్న ప్రజలను కట్టడి చేసేందుకు పోలీసుల తరం కావడం లేదు. గురువారం రాత్రి వరకు చేరుకున్న మొత్తం భక్తుల సంఖ్య గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి ప్రవాహంలా తరలివస్తున్న ప్రజలు గద్దెలపై నెలకొన్న సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. బుధవారం రోజే సమ్మక్క బిడ్డ సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను గిరిజన పూజారులు గద్దెలపై ప్రతిష్టించగా, గురువారం సమ్మక్కను కూడా గద్దెపైకి తేవడంతో ఇక శుక్రవారం రోజు పూర్తిగా మొక్కుబడులు చెల్లించనున్నారు. కాగా గురువారం మేడారం జాతరకు ప్రముఖుల తాకిడి కూడా జరిగింది. పలువురు వివిధ పార్టీల  రాష్ట్ర, జిల్లా నాయకులు సమ్మక్క, సారలమ్మలను గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తమ నిలువెత్తు బంగారం (బెల్లం)ను అమ్మవార్లకు సమర్పించుకున్నారు. సీనియర్‌ ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు, పలువురు నేతలు దర్శించుకోవడంతో విఐపిల తాకిడి పెరిగింది.కాగా ఈ నెల 19న శుక్రవారం రాష్ట్రముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేడారాన్ని సందర్శించనున్నారు.

జన సంద్రమైన మేడారం

అధిక సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. అమ్మవార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. దీంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రెండు క్యూలైన్లను ఏర్పాటు చేసి గద్దెలకు ఇరువైపులా ఒకేసారి వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈ రోజు రాత్రి 7గంటలకు సమ్మక్క గద్దెపైకి రానుంది. ఆ సమయంలో రద్దీ మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

నేడు మేడారానికి సీఎం కేసీఆర్‌

సమ్మక్క-సారక్కల జాతర మేడారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం రానున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్‌ఆపట్లు చే/-తోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక జరుగుతన్న తొలి జాతర కావడంతో సిఎం రాకకు ప్రాధాన్యం ఏర్పడింది.  శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా నేరుగా సీఎం మేడారం చేరుకుంటారు. తల్లుల దర్శనం తరువాత అక్కడే భోజనం చేస్తారు. తిరిగి మేడారం నుంచి మడికొండకు హెలికాప్టర్‌ ద్వారా చేరుకుంటారు. మడికొండలో ఏర్పాటు చేయనున్న ఐటీపార్కు పనులను సీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు కలెక్టర్‌ వాకాటి కారుణ, ఎస్పీ అంబర్‌ కిసోర్‌ ఝాలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిఎం వచ్చే విషయాన్ని టిఆర్‌ఎస్‌ జిల్లా  అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు ఒక ప్రకటనలో ధృవీకరించారు. మడికొండలో కేసీఆర్‌ సభా ఏర్పాట్లను నగర పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు పరిశీలించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పార్కింగ్‌, సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం

మేడారం మహాజాతరకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలను గురువారం తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూదనాచారి ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో సభాపతి, పర్యాటకశాఖ కార్యదర్శి వెంకటేశం దంపతులు మేడారం జాతరకు బయలుదేరారు. ఇవాళ, రేపు హెలికాప్టర్‌ సేవలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. హైదరాబాద్‌-మేడారం, వరంగల్‌-మేడారం వరకు హెలికాప్టర్‌ సేవలు అందించనున్నారు. వరంగల్‌ నుంచి మేడారం వరకు ఒకరు వెళ్లి రావడానికి టికెట్‌ ధర రూ.26,500లుగా నిర్ణయించారు. హైదరాబాద్‌-మేడారం నలుగురికి ప్యాకేజీ ధర రూ.2,75,000లు గా నిర్ణయించారు.

స్వల్ప అగ్నిప్రమాదం

మేడారం మహాజాతర సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన గుడారాల్లో గురువారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. భక్తులు వంట చేస్తుండగా ఓ గుడారానికి నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని స్థానికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మేడారంలో అటో టిప్పర్ల సేవలు

నిన్నమొన్నటివరకు జీహెచ్‌ఎంసిలో సేవలందించిన ఆటో టిప్పర్లను మేడారం జాతరలో సేవలకు వినిచయోగిస్తున్నారు. మేడారం సమ్మక్కసారాలమంమ జాతర ఈనెల 20వరకు కొనసాగనుంది. అయితే ఇందులో చెత్త చెదారం ఎక్కువమొత్తంలో సమకూరనున్నందున దానిని తొలగించేందుకుగాను హైదరాబాద్‌కు చెందిన అధునాతన ఆటో టిప్పర్లను కేటాయించాలని కోరగా జీహెచ్‌ఎంసి 20 టిప్పర్లను పంపించింది. వీటిని ఇక్కడనుంచి చెత్త తొలగించేందుకు వినియోగిస్తున్నారు. 35 కేటాయించగా ముందు 20 మేడారం చేరుకున్నాయం. వీటిని వినియోగించడం ప్రారంభించినట్లు కలెక్టర్‌ వాకాటి కరుణ తెలిపారు. ఈజాతరలో ప్రతిరోజు 5వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామన్నారు. అంతేకాక పారిశుద్య పనులను నిర్వహించేందుకుగాను రాజమండ్రినుంచి కూడా 5వేల మంది పారిశుద్య కార్మికులను ఆంద్రాప్రభుత్వం కేటాయించిందని వారు కూడా విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు. దాదాపుకోటిమంది హాజరయ్యే ఈజాతరలో చిన్న సైజులో ఉన్న ఆటో టిప్పర్లద్వారా చెత్త తొలగించడం సాద్యం కాదని గుర్తించడమేకాక ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేందుకుగాను వీటిని తెప్పించామన్నారు. చెత్త రహిత జాతరగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసి టిప్పర్లు, రాజమండ్రి నుంచి వచ్చిన పారిశుద్య కార్మికుల ద్వారా పారిశుద్య నిర్వహణ సులువుగా మారిందని పంచాయితీ అదికారి పడ్మజ తెలిపారు. గతంలో వంద ట్రాక్టర్లను వినియోగించేవారమని ప్రస్తుతం జీహెచ్‌ఎంసికి చెందిన 35 ఆటో టిప్పర్లద్వారానే ఆపనిని సులువుగా పూర్తి చేస్తున్నామన్నారు. దేశంలోనే మొదటి సారిగా జీహెచ్‌ఎంసిలో ప్రవేశపెట్టిన ఆటో ట్రాలీలను వినియోగించడం పట్ల జీహెచ్‌ఎంసి చీఫ్‌ పీఆర్‌ఓ వెంకటరమణ ఆనందం వ్యక్తం చేశారు.

భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

మేడారం జాతరంటేనే గిరిపుత్రులు అటు నాన్‌వెజ్‌ ఇటు మద్యం సేవించడం ఆనవాయితీగా చేసుకుంటారు. అయితే గతంలో ప్రజల ప్రాణాలకు భారంగా మారిన గుడుంబా, కల్తీ సారాలను ఈసారి అదికారులు నిషేదించడంతో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయని ఎక్సయిజ్‌ అధికారులు పేర్కొంటున్నారు. మంగళవారం సాయంత్రానికే  మూడు కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సయిజ్‌ అదికారులు లెక్కలు తేల్చారు. బుదవారం ఎంతలేదన్నా మరో 50 లక్షలు వరకు అమ్మకాలు జరిగి ఉంటాయని ఉత్సవాలలో తొలి ఘట్టం సందర్బంగా బారీగా జనం తరలివచ్చారని ఆయన తెలిపారు. జాతర ముగిసే సరికే 6నుంచి 8 కోట్ల రూపాయల వరకు మద్యం అమ్మకాలు సాగే అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు.

భక్తజనంతో ఉప్పొంగిన అగ్రంపాడ్‌

తల్లి సమ్మక్క…ఆహా..గొబ్బియా… మమ్ముళను సల్లంగా చూడుతల్లి గొబ్బియా.. అంటూ శివసత్తుల పూనకాలు, భక్తి ప్రపత్తుల మధ్య వేలాది భక్తజనం తన్మయంతో ఆత్మకూర్‌ మండలంలోని ఆగ్రంపాడ్‌ జాతర పూనకాలు ఎత్తింది.మండలంలోని  రాఘవాపురం నుంచి పూజారులు గోనె సారంగపాణి, వెంకన్న, శ్రీనివాస్‌, గోనె సాంబశివరావులు సమ్మక్క తల్లిని అగ్రంపాడ్‌ గద్దెపైకి తీసుకువచ్చారు. అధికారులు, పోలీసు యంత్రాంగం రోప్‌ వలయంలో గురువారం 6గంటలకు సమ్మక్కను గద్దెకు తీసుకువచ్చారు. అప్పటి నుంచి భక్తులు దర్శనం కోసం రావడంతో స్థలం లేక జాతర ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. మూడు కిలోమీటర్ల పొడవునా చౌళ్లపల్లి, అక్కంపేట, పెద్దాపూర్‌, అగ్రంపాడ్‌ గ్రామాలు జనసందోహంతో మునిగిపోయాయి. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఆర్డీఓ వెంకటమాధవరావు, డీఎస్పీ ,  తహసిల్దార్‌, సిఐలు, ఎస్సైలు, రెవెన్యూ సిబ్బందిల ఆధ్వర్యంలో జాతరను పర్యవేక్షించారు. భక్తుల సందడి పెరుగడంతో అదుపు చేయడం కోసం పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు. సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులు క్యూలో నిలబడగా, సాయంత్రం వేళ అధికంగా దర్శనం చేసుకున్నారు. సమ్మక్కకు ఎదురుకోళ్లతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ పార్టీల నాయకులు,ప్రజాప్రతినిధులు దర్శించుకొని  పూజలు నిర్వహించారు.

తప్పిపోయిన వారిని అప్పగించడానికి క్యాంపు ఏర్పాటు

స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ

మేడారం మహాజాతర సందర్భంగా పలువురు భక్తులు తప్పిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన జిల్లా యంత్రాంగం ముందస్తుగా క్యాంపులను ఏర్పాటు చేసింది. జాతరను పురష్కరించుకని మూడు రోజులుగా భక్తుల రాక అధికం కావడంతో జాతరలో పిల్లలు, వృద్ధులు తప్పిపోవడంతో క్యాంపుల ద్వారా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం కోసం ప్రత్యేకంగా మైక్‌సెట్లను ఉపయోగించి తప్పిపోయిన వారి సమాచారాన్ని అధికారులు తెలుపుతున్నారు. సంబంధిత అధికారులతో పాటు పోలీసులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు తప్పిపోయిన వారిని వారి కుటుంబ సభ్యులకు చేరవేస్తున్నారు.జాతరకు వచ్చిన భక్తులు వారి వారి బందువులకు పూర్తి చిరునామాతో, ఫోన్‌నెంబర్‌తో చీటీలు రాసి జెబులలో పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ సూచిస్తున్నారు.

మినీ భారత్‌ను తలపిస్తున్న మేడారం

సమ్మక్క,సారలమ్మలకు మొక్కులు

లక్షలాది మంది తరలిరావడంతో మేడారం జనసంద్రంగా మారింది.తెలంగాణా నుండే కాక రాష్ట్రంలోని వివిద జిల్లాల నుండి,దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా గిరిజనులు తరలి రావడంతో మేడారం మినీ భారతాన్ని తలపిస్తున్నది. నాలుగు రోజుల మేడారం సందడి గురువారానికి పతాక స్థాయికి చేరింది.బుదవారం సారలమ్మ, గురువారం రోజున సమ్మక్కలు గద్దెపైకి చేరుకున్నారు. సమ్మక్క – సారలమ్మలు గద్దెలపై కొలువు తీరడంతో మొక్కుబడులు చెల్లించుకునేందుకు భక్తుల రాక వరద ప్రవాహంలా సాగింది. మేడారం చుట్టూ నాలుగు గ్రామాల పరిదిలో జనం తాత్కాలిక గుడారాలు వేసుకోవడంతో ఎటుచూసినా కిలోమీటర్ల కొద్దీ జనమే జనం. మొన్నటి వరకు చిన్న కుగ్రామంగా ఉన్న మేడారం నాలుగు రోజులుగా మహా నగరాన్ని తలపిస్తున్నది. కోటి మందికి పైగా ప్రజలు తరలి వస్తారని అధికారులు అంచనా వేసారు. భారీ స్థాయిలో ప్రజలు రావడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు.వరంగల్‌ నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం గ్రామం గత రెండు రోజులుగా జనారణ్యంగా మారిపోయింది. ఎక్కడ విన్నా, ఎటు చూసినా మేడారం, సమ్మక్క – సారలమ్మల మాటలు, పాటలే వినబడుతున్నాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ అతిపెద్ద గిరిజన జాతర మేడారం గురువారం రోజు శిఖరాగ్రస్థాయికి చేరుకొన్నది. సమ్మక్క – సారలమ్మల ఆగమణంతో మేడారం జన సంద్రంగా మారిపోయింది. వరంగల్‌ నుండి జాతర వరకు 24 గంటల పాటు వాహనాలు తరలి వస్తూనే ఉన్నాయి. వేలాది ప్రైవేటు వాహనాలతో పాటు ఆర్టీసి సంస్థ 4000 బస్సులను ఏర్పాటు చేసినా ప్రయాణీకులకు అవస్థలు తప్పడంలేదు.  మేడారం గ్రామం చుట్టూ 5 కిలో మీటర్ల దూరం నుండి జనం కాలి నడకన వస్తున్నారు. కనుచూపు మేరలో గుడారాలు వేసుకొని ఉన్న పరిస్తితి నెలకొంది.అడవి నిండా, నాలుగు గ్రామాల పరిదిలో ప్రజలు తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. జన ప్రవాహం గంట గంటకు పెరుగుతుండటంతో మేడారంలోని గద్దెల ప్రాంతం, జంపన్నవాగు కిటకిటలాడుతున్నాయి. జంపన్నవాగులో జనాల రద్దీ పెరగడంతో నీరు కలుషితమైనా భక్తులు అవేవి పట్టించుకోకుండా పుణ్యస్నానాలతో పులకించి పోతున్నారు. కన్నెపల్లి నుండి సారలమ్మను, చిలకల గుట్ట నుండి సమ్మక్కను అధికార లాంచనాలతో ఉద్విగ్న క్షణాలమద్య గద్దెలకు కుంకుమ భరిణల రూపంలో చేర్చడం సజావుగా సాగడంతో జిల్లా అదికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక మొక్కుబడులే తరువాయంటూ భక్తులు పోటీ పడ్డారు. పూనకాలతో ఊగిపోతున్న శివసత్తులు, భక్తకోటి ఎదురుకోళ్ల మద్య మేడారం సన్నివేశం పతాక స్థాయికి చేరింది. ఒకే సారి సమ్మక్క – సారలమ్మలను దర్శించుకునే క్రమంలో భక్తులు పులకించిపోయారు. దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు తిరుగు ప్రయాణం చేపట్టేందుకు కూడా సిద్దమయ్యారు. బుదవారం, గురువారం ప్రముఖుల రాకతో, వనదేవతలు గద్దెలపైకి చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. భక్తుల భద్రత కోసం దాదాపు 10వేల మంది పోలీసులను మోహరించి డిఐజి, ఎస్పీ తదితర అధికారులు పర్యవేక్షిస్తున్నా ఇబ్బందులు తొలగలేదు. ఇక జాతరలో మంచి నీరు దొరకక, సరైన పారిశుద్య వసతులు లేక వేలాది మంది కష్టాల బారిన పడ్డారు. మరో వైపు మాంస వ్యర్థ పదార్థాలతో దుర్వాసన వ్యాపిస్తున్నా పారిశుద్య చర్యలను అధికారులు ఆశించిన మేరకు చేపట్టడం లేదని భక్తులు వాపోయారు. తాగు నీటిలో కలుషితం వల్లనే అధిక సంఖ్యలో రోగాల భారిన పడే ప్రమాదం వున్నా స్వచ్చమైన తాగునీటిని అందించేందకు అధికారులు చర్యలు చేపట్టలేక పోయారు. మరో వైపు క్యూ లైన్లలో గంటల తరబడి భక్తులు నిల్చున్నారు. మహిళలు, వృద్దులు, చిన్నపిల్లలు అటు ఎండతో పాటు ఇటు దాహార్తితో సమతమమయ్యారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ నుండే కాక మహారాష్ట్ర, చత్తీష్‌గడ్‌, ఒరిస్సా, మద్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలనుండి లక్షలాది మంది ప్రజలు జాతరకు తరలి వచ్చారు. వివిధ రాష్ట్రాల, వివిద ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా గిరిజనులు తరలి రావడంతో మేడారంలో వారివారి సంస్కృతి, ఆచారాలు కలగలిసి మిని భారత్‌ను తలపిస్తున్నది. జాతరలో భక్తుల సౌకర్యాలపై కలెక్టర్‌, ఇతర ఉన్నతాదికారులు మేడారంలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాగా లక్షల మంది ప్రజలు జాతరకు రానుండడం, గిరిజన ప్రజల మెప్పును పొందాలని పలు పార్టీల ప్రముఖులు జాతరకు తరలి వచ్చారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అనేక మంది ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల  రాష్ట్ర, జిల్లా నేతలు జాతరను సందర్సించారు.