గనులు తెలంగాణకు వరమా? శాపమా?

తెలంగాణ స్వతంత్ర పాలన, రాష్ట్ర ఏర్పాటు నినాదాలు కనుమరుగైనయి. సంసద్‌యాత్ర చప్పగా అయిందనే చెప్పుకోవాలి. దున్నపోతు మీద వాన పడితే ఎట్లానో మన కార్యక్రమాలు కూడా అట్లాగే ఉన్నయి. అదే బీజేపీ, అదే అగ్నివేష్‌, అవే ప్రజాసంఘాలు వెరసి సంసద్‌యాత్ర. ఇప్పుడు కొత్తగా వచ్చిన డిమాండ్‌ బయ్యారం గనులు. ఇక్కడ ఇనుప ఖనిజం ఉన్నట్టు ఆంధ్రోళ్లు కొత్తగా కనుగొ న్నట్టు చెప్తున్నరు. ఆ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తు సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని నిరసిస్తున్నట్టు ఫోజు లు కొడుతూ కొన్ని పార్టీలు ఉద్యమాలు చేపట్టినయి. కోతికి కొబ్బ రికాయ దొరికినట్టు కొన్ని రోజులు హంగామా చేసే అవకాశం ఆ పార్టీలకు దక్కింది. గనులు ఎవరి కోసం ఎందుకోసం అనే విష యం ఎప్పటిలాగే మరుగునపడ్డది. మున్ముందు మరింత మరుగున పడుతుంది. అదీ కాకపోతే మనం మనం మాట్లాడడానికి ఇష్టప డము. దాదాపు అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఒక్క తాటిపైకి వచ్చి ‘బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు’ అంటున్నాయి. ఇనుప ఖనిజం తవ్వకం వల్ల వచ్చే లాభాలు, ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగా లు అభివృద్ధి అని నమ్మకం కలిగిస్తున్నారు. ఇనుము, ఉక్కు, గ్రానై ట్‌, సున్నపురాయి అనేక రకాల ఖనిజాలున్న ప్రాంతం తెలంగాణ. నిజంగా విలువైన ఖనిజ నిల్వలు గల ప్రాంతం. దేశం అభివృద్ధి చెందితే ఈపాటికి భారతదేశం సంపన్నదేశాల సరసన చేరాలి. లేదా మన ప్రజలు కనీస సౌకర్యాలతో జీవించగలగాలి. కానీ మనకు ఈ తవ్వకాల వల్ల మిగిలింది వల్లకాడే. ఇప్పటి వరకు బొగ్గు తవ్వకాలతో మిగిలిన చేదు అనుభవాలు. మళ్లీ బాగు చేసుకోలేని సహజ వనరులు. పూడ్చుకోలేని నష్టాలు. కన్నీళ్లు.. వలసలు.. బానిస బతుకులు మాత్రమే.నిజమే ఎక్కడి వనరులు అక్కడ మాత్ర మే ఉపయోగించాలి. అక్కడ ఉన్న ప్రజల అనుమతితో మాత్రమే వనరుల వినియోగం జరగాలి. వారి అభివృద్ధిని వారే నిర్వ చించుకునే అవకాశం కల్పించాలి. అభివృద్ధిలో భూమి కోల్పోతున్న ప్రజలు, ఆ భూమిపై ఆధారపడి బతుకుతున్న వారిని భాగస్వామ్యం చేయాలి. ఇవన్నీ చట్టంలో న్యాయంలో ఎక్కడో ఉన్నాయి కాని ఈ దేశంలో జరుగుతాయనే నమ్మకం ఉందా? బయ్యారం ఇనుప ఖని జాన్ని రక్షణ స్టీల్స్‌కు కట్టబెట్టినపుడు ఇంత గొడవ చేయలేదు మనం. అక్కడో ఇక్కడో కొద్దిగా మాట్లాడి ఉంటాం. ఇప్పుడు మనం అడుగుతున్న స్టీల్‌ ప్లాంట్‌ పర్యవసనాలు తెలుసుకోవాలంటే వాటిని సింగరేణి వెలుగులోనే చూడాల్సి వుంటుంది.సింగరేణి బొగ్గు కంపెనీని మనప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడి ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో బొగ్గు నిల్వలు ఉన్నాయి కాబట్టి బొగ్గును ఇక్కడే ఖర్చు పెట్టాలని నిజాం రాజు తలచారు మొదట. ఆంధ్ర కుట్రపూరిత విలీనం తర్వాత ఈ బొగ్గుపై దేశం కన్నుపడింది. జాతీయతా భావాన్ని మన మెదళ్లపై రుద్ది దానికి దేశ సంపద అని పేరుపెట్టారు. అంతకుముందు బొగ్గును దేశానికి ఇవ్వలేదు. ఎక్కడి నుంచి బొగ్గు వెలికి తీస్తారో ఆ ప్రాంతంలోని బతుకులన్నీ మసిబారకుండా పట్టించుకునే నాథుడే లేడు. చీకటి బతుకులు, తట్టాచెమ్మాస్‌ నౌకరీలు, బతికుంటే నాలుగు మెతుకులు లేదంటే నాలుగు సారా చుక్కలు. ఇదీ జీవితం.. ఇదే జీవితం వేలాది బడుగు, బలహీన వర్గాల కులాల ప్రజలది. బహుశ అప్పుడు దేశం పేరు చెప్పుకుని బాహాటంగా వనరులన్నీ విదేశాలకు తాకట్టు పెడతారని తెలవక నమ్మి ఉన్నదంతా త్యాగం చేశారు ప్రజలు. నిజాం పాలనలో మనకు ఇక్కడ ఉన్న వనరులపై ఒక స్పష్టమైన ఉంది. ఇక్కడ నీరు, భూమి ఎట్లా వినియోగించుకోవాలి. అది ఎన్ని తరాల వరకు పనికి వస్తాయి అన్న ఆలోచనలతో పథకాలు వేసి, కట్టడాలు నిర్మించారు. ఆ నిర్మాణాలలోనే ఇంకా రాజ్యపాలన కొనసాగిస్తున్నాం. ఆ వంతెనలు, ఆ నదులపైనే ఇప్పటి కీ బతుకుతున్నాం. వారి పాలన ప్రజాహితమైనదని కళ్ల ముందు కనబబుతోంది. ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది. అప్పటి నీటి, రవాణా, వైద్య, విద్య వసతులపైనే ఇంకా ఆధారపడి ఉన్నాం అంటే వారి ముందు చూపు ఎంత మేరకు ఉందో ఊహ లకందని నిజం. విప్లవోద్యమాల ద్వారా అప్పటి భూస్వామ్య వ్యవస్థని, దొరల గడీలను కూల్చివేయగాలిగాం కొంతవరకు. కానీ రూపం మార్చిన పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్న పరిస్థితుల్ని పూర్తిగా పసిగట్టలేకపోయాం. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో విలీనమైనప్పటి నుంచి భౌగోళికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా అన్యాక్రాంతమవుతూ, అస్థిత్వాన్ని కోల్పోతూ వస్తోంది.
బొగ్గుకి, ఉక్కుకి విలువలో, వాడకంలో తేడా ఉండొచ్చు. కానీ వాటి వెనుక ఉన్న శక్తులు పరిస్థితులు ఒక్కటే. అది ఆంధ్రా అయినా తెలంగాణ అయినా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, జార్ఖండ్‌ అయినా ఇప్పుడు పెట్టుబడిదారి శక్తులు ఉక్కుకోసం వేటకుక్కల్లా గాలిస్తు న్నయి. ఎందుకంటే అత్యధికశాతం ఇది యుద్ధ సామగ్రి కోసం ఉపయోగపడుతుంది అని పరిశోధనలు తెలుపుతున్నాయి. బొగ్గు కూడా ఇక్కడి ప్రాంతానికి కరెంట్‌ కోసమో లేదా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చడానికో అన్న భ్రమలు ఎవరికీ లేవు. అన్నిటికంటే ముఖ్యంగా అత్యధికంగా నిర్వాసితులవుతున్న ఆది వాసీలు, దళితులు ఇతర వెనుకబడిన వర్గాల జీవనోపాధులకు విఘాతం కలుగుతోంది. అంతేకాదు విలువైన వన్యప్రాణలు, అడవు లు, భూగర్భ జలాలను తెలంగాణ ప్రాంతం కోల్పోతుంది. ఈ ప్రాంతం బొందలగడ్డలా మారుతోంది. లేదు మనమే మార్చేసు న్నాం. ఇదే సింగరేణి వల్ల తెలంగాణ ప్రాంతానికి ఒనగూరిన మేలు. ఇప్పటికే సింగరేణి ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రభుత్వ భూమి 2063.07, పట్టా భూమి 27,885, అటవీ భూమి 12,665.33 (సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన వివరాలు) దాదాపు 450 గ్రామాలను పొట్టనబెట్టుకుంది. లేక్కలు లేనన్ని చిన్న చిన్న వాగులు, నదులు దాదాపు పూర్తిగా ఎండిపోయాయి. కొంతలో కొంత బాగున్నట్టు అనిపించినా ఉద్యోగాల కోసమని తమ సమాధులు తామే తవ్వుకుం టున్నప్పుడు ఇక్కడి ప్రజలు తెలుసుకోలేకపోయారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి దాదాపు 75 శాతానికి పైగా ఉక్కు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడి అవసరాలకు కేటాయింపులు తక్కువే నని మనకు తెలుసు.ఇప్పుడు బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ పెట్టేందుకు అక్కడ ఉన్న వారి మీద పడే పర్యావరణ ప్రభావం అటుంచి పర్యావరణ నాశనం గురించి ఆలోచించే వారే లేరు. ఇది కూడా పక్కన పెడితే అక్కడ రేపు తీసే ఉక్కును ఎక్కడికి పంపిస్తాము. ఎంతవరకు వచ్చిన సొమ్మును ప్రజలకి ఇస్తాం. ఏ ప్రజలకు దీని అవసరాలకు ఉన్నాయి అన్న విషయం కూడా అవసరమే. వచ్చిన లాభాల్లో వారిని భాగస్వామ్యం చేస్తామా లేదా అనేవి మౌలిక ప్రశ్నలు. ఇప్పుడు ఉక్కు ఒకటే కాదు దాని సంబధిత పరిశ్రమలకి భూములు కేటాయించాల్సి వస్తుంది. అక్కడ పనులు చేసే వాళ్లం దరూ మన వాళ్లే అనుకున్నా కొద్ది రోజుల్లో ప్రైవేటు పెట్టుబ డిదారులకి లొంగి సింగరేణిలో లాగా ‘గోల్డెన్‌ షేక్‌ హ్యాండ్‌’ ఇచ్చే పరిస్థితి రావొచ్చు. ప్రైవేటు కాంట్రాక్ట్‌లన్నీ బయటివారికి పోవచ్చు. ఈ మధ్యే ఒక పెద్దాయన చెప్పినట్టు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు దేశం నలుమూలల నుంచి రావొచ్చు దాని వల్ల మనకు ఒరిగేది ఏమిటీ? దమ్ము బూడిద రోగాలు. ఇప్పటికే గ్రానైట్‌ తవ్వకాలతో ఈ నాలుగు జిల్లాలు సాగు, తాగునీటికి దూరమవుతున్నాయి. తాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. బొగ్గు ఓపెన్‌ కాస్టుల బ్లాస్టింగులతో ఉన్న ఇళ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలు భయాందోళ నలతో జీవితాలు వెళ్లదీస్తున్నారు. తెలంగాణ ప్రాంతాని కి కానీ, ప్రజలకి కాని అభివృద్ధి ఛాయలు ఏమాత్రం కూడా సింగరేణి ద్వారా వచ్చిన దాఖలాలు లేవు. ఆంధ్ర ప్రాంతం వారు ఆఫీసర్లుగా, వ్యాపా రులుగా చోటామోటా నాయకులుగా చక్రం తిప్పుతున్నారు. కొం దరు బడా నాయకులుగా అవతరించి బాగుపడ్డారు.
పార్లమెంటరీ రాజకీయాలు, విప్లవ రాజకీయాలతోమ పాటు ప్రజలకి కూడా రాజకీయాలున్నాయి అన్న విషయం ఈ పాలకులు తెలుసుకునేది ఎన్నడు? ముఖ్యంగా తెలంగాణ ప్రజల అస్తిత్వం, స్వయం పాలన, వనరుల రక్షణ వారి రాజకీయాలలో భాగం. వణ్యప్రాణులతో, భూగర్భ జలాలతో నిండుగా పచ్చగా ఉన్న తెలంగాణని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. అందుకోసం అనేక పోరాటాలు చేస్తున్నారు. అవి అనేక సంఘాల మద్దతుతో ముందుకు సాగుతున్నాయి. కానీ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు అన్ని పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయి వనరులని పూర్తిగా పీల్చిపిప్పి చేసి ఈ ప్రాంతాన్ని మరో బొలివియాలాగా తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి మౌనంగా ఉండడం సరికాదు. ఇది మేధావులు చేస్తున్న పెద్ద నేరం. ఒక ప్రజాస్వామిక డిమాండ్‌ను పక్కకు పెట్టడానికి బడా బాబులు ఆడుతున్న నాటకాలలో ఇది కూడా ఒకటి. ఇది నేరమే.0వనరులు ఉన్నాయి అంటే దాని అర్థం తవ్వి తీయడానికి అని మాత్రమే కాదు. అవి ఎవరికీ చెందనివి. ఆ తవ్వకాల వల్ల జరిగే నష్టం ఎంత? అద అటవీ ప్రాంతం అయితే.. ఆదివాసీలు వాటిపై ఆధారపడితే ఇప్పుడున్న చట్టాలకు అనుగుణంగా ఎట్లా వాటిని దృష్టిలో పెట్టుకొ ని ముందుకుపోవాలి అన్న విషయాల గురించి ముందుగా చర్చిం చాలి. అసలు తవ్వాలనుకుంటున్న ఇనుము ఎవరి అవసరార్థం తవ్వుతున్నారనేది ప్రజలు తెలుసుకోవాలి. అప్పటి వరకు వారికి ఆమోదం అయితేనే తవ్వకాలపై మాట్లాడాలి.
బయ్యారం గనులు ఎట్లా ఉన్నా కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ఉక్కు ఇస్తే మాత్రం వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలకు విపరీతమైన నష్టం జరిగే అవకాశముంది. భీమదేవరపల్లి చుట్టుపక్కన ఉన్న గ్రామాలు, పంటపొలాలు అన్నీ నాశనం అవుతాయి. ముప్పారం, ఎర్రబెల్లి, కొత్తపల్లి, దామెర, కుడికచెర్ల గ్రామాల్లోని చెరువులు వట్టిపోనున్నాయి. గుట్టను ఆనుకొని ఉన్న ధర్మసాగర్‌ చెరువు నీటిపై ఆధారపడి వరంగల్‌, కాజీపేట, హన్మకొండ ప్రాంతాలకు ఉన్నాయి. వంగర నుంచి హుస్నాబాద్‌ వరకు దాదాపు 18 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న గుట్టలపైనా ఇప్పటికే కన్ను ఉంది. ఇంతటి అపారమైన నష్టాన్ని రేపు వేలు ఇచ్చినా, పది పైసలకు కిలో బియ్యం ఇచ్చి రోజూ ఉపాధి హామీ కింద వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా సరిపోని భారం పడుతుంది. ఇప్పటి వరకూ గ్రానైట్‌ గుట్టలకు, బొగ్గు గనులకు, సెజ్‌లకు, పోలవరంలాంటి మెగా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రాణ లొడ్డి అడ్డం పడుతున్న ప్రజల గోడు ఎన్నడూ ఈ పాలకులు వినలే దు. కనీసం ఇప్పటికైనా ఆలోచించి నిపుణులను సంప్రదించి చట్టబ ద్ధంగా వ్యవహరించాలి. వనరులను భావి తరాల వారికోసం కాపాడుకోవాలి. లేకపోతే మరో ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లాంటి పరిస్థితి తెలంగాణ ఎదుర్కోవాడినికి ఎంతో సమయం పట్టదు. ఇక్కడి ఖనిజాల కోసం మాత్రమే రేపు పోరాటాలు జరిగి, పెట్టుబడిదారుల అండతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడిచినా ఆశ్చర్యం అవరసరం లేదు. ఇంకా పెట్టుబడి కులాలు, వర్గాలు ఎవరెవరో మనకు తెలు సు. పీడనకు, దోపిడీకి గురయ్యేది బలహీనవర్గాల ప్రజలు మాత్రమేనని వేరే చెప్పక్కర్లేదు.
– సుజాత సూరేపల్లి
ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రచయితల వేదిక