గబ్బిలాలు నిఫా వైరస్‌కి కారణం కాదు

తిరువనంతపురం(జ‌నం సాక్షి): ప్రాణాంతక నిఫా వైరస్ కేవలం కేరళనే కాదు యావత్‌ భారత్‌నూ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దాని దాటికి కేరళలో 16 మంది మృతి చెందినా ఇంత వరకు నిఫా వైరస్‌ విజృంభించడానికి సరైన కారణాన్ని నిర్ధరించలేకపోతున్నారు.అయితే నిఫా వైరస్‌ బయటపడిన వెంటనే దానికి పండ్లపై వాలే గబ్బిలాలు(ఫ్రూట్‌ బ్యాట్‌) కారణమనే వార్తలు వినిపించాయి. దీనిపై కేరళ చర్యలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్రూట్‌ బ్యాట్లకు చెందిన 13 నమూనాలను కేరళ ప్రభుత్వం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజ్‌(ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపారు. ఈ నమూనాలన్నింటినీ పరీక్షించిన ఈ సంస్థ వీటిలో నిఫాను కలిగించే లక్షణాలు లేవని తేల్చింది. దీంతోపాటు ఎలుకల నమూనాలను కూడా పరీక్షించారు. ఇందులోనూ నిఫావైరస్‌ను వ్యాప్తి చేసే లక్షణాలు లేవని తెలిసింది. అంతేకాకుండా పందులు, మేకలు, గేదెలు వంటి పశువుల నమూనాల్లోనూ నెగటివ్‌ అనే వచ్చింది.దీనిపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ మాట్లాడుతూ…‘ నిఫా వైరస్‌ కారకాలుగా అనుమానించిన అన్ని నమూనాలను ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీకు పంపాం. అన్నింట్లోనూ నెగటివ్‌ అనే తేలింది. దీంతో నిఫా వైరస్ వ్యాప్తికిగల కారణాన్ని అన్వేషించడానికి మరో ప్రయత్నం మొదలు పెట్టాం. త్వరలోనే దీనికి గల కారణాలు కనుక్కొని సమూలంగా నియంత్రిస్తాం.’ అని తెలిపారు.