గర్వంగా ఉంది: రామోజీ ఫిలిం సిటీపై సీఎం కేసీఆర్ మళ్లీ

ramoji
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి రామోజీ ఫిలిం సిటీ పేరును పలవరించారు. ఆదివారం నాడు శిల్పకళావేదికలో బస్తీ పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఆ మధ్య అమితాబ్ బచ్చన్ తమ ఇంటికి వచ్చారని, భారత దేశంలో అత్యధికంగా సినిమాల నిర్మాణం చేపట్టేది హైదరాబాదులోనే అని చెప్పారని, ఎక్కువగా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయని కూడా అన్నారని అప్పుడు తనకు గర్వంగా అనిపించిందని అన్నారు. అయితే, రామోజీ ఫిలిం సిటీ గురించి కేసీఆర్ మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని హెచ్చరించాడని వార్తలు వచ్చాయి.అయితే, కొద్ది నెలల క్రితం కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీని సందర్శించి ప్రశంసలు కురిపించారు. ఆ సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు లక్ష నాగళ్ల అంశాన్ని ప్రస్తావించారు. దానికి తాను అలా చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఇటీవలే కేసీఆర్‌కు చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో నీటి గొడవ విషయమై ఈనాడా ఆంధ్రానాడా అని వచ్చింది. తాజాగా, ఇప్పుడు బస్తీ పాటల విడుదల సందర్భంగా కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీ పేరును పలవరించడం గమనార్హం. ఇది చర్చనీయాంశమవుతోంది. అయితే, రామోజీ ఫిలిం సిటీ వేరు, మీడియా, అన్యాయాన్ని ప్రశ్నించడం వేరని చెబుతున్నారు.