గల్ఫ్‌ బాధితులను రప్పిస్తాం

శ్రీధర్‌బాబు
అఖిలపక్షంలో ప్రభుత్వ చొరవకు టీఆర్‌ఎస్‌ డిమాండ్‌
హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) :
గల్ఫ్‌ దేశాల్లో విసా ఆంక్షల కారణంగా చిక్కుకుపోయిన తెలుగువాళ్లను స్వదేశానికి రప్పిస్తామని  రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి సుమారు 11 వేల మంది గల్ఫ్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నారని, వారు అక్కడ అక్రమంగా నివసిస్తున్న అక్కడి పాలకులు వేధింపులకు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్‌ ఆరోపించింది. శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన గల్ఫ్‌ బాధితుల సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది. సమావేశంలో పాల్గొన్న అనంతరం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం ప్రకటించినట్లుగా బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మూడు నెలలక్రితమే గల్ఫ్‌ దేశాలు అక్రమంగా ఉన్న వారిని వెల్లిపోవాలని ప్రకటించిందని గుర్తు చేశారు. మూడు నెలలనుంచి నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించిన ప్రభుత్వం మరో పది రోజుల్లో గడువు ముగుస్తుండగా అఖిల పక్ష సమావేశం పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించామన్నారు. ఢల్లీికి అఖిలపక్ష ప్రతినిధులను తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేసి గడువును పొడిగించేలా చేయడంతో పాటు, చిక్కుకున్న వారికి వీసా రెన్యూవల్‌, టిక్కెట్‌లు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని రవీందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇది జరుగక పోతే రెండున్నర సంవత్సరాలు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. స్వస్థలాలకు తీసుకువచ్చిన వెంటనే వారి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేరళ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. జూలై 3వ తేదీతో ముగియనున్న గడువును పెంచేందుకు ప్రయత్నాలు చేయాలని ఇందుకోసం ఢల్లీికి వెళ్లి ఒత్తిడి తేవాలని కోరడం జరిగిందన్నారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలకు చెందిన వారే 10వేల 863 మంది స్వస్థలాలకు రావడానికి దరఖాస్తులు చేసుకున్నారని, అయితే వారికి సంబందించిన వీసాలు గడువు ముగిసాయని, టిక్కెట్లకు డబ్బులు లేక అక్కడినుంచి వారి వారి కుటుంబాలకు ఫోన్లు వస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. శ్రీధర్‌బాబు బదులిస్తూ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా స్వస్థలలాకు రప్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.