గవర్నర్‌కు యెడ్యూరప్ప రాజీనామా

వెనువెంటనే ఆమోదం
బెంగళూరు,మే19( జ‌నం సాక్షి): రెండున్నర రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్‌ యడ్యూరప్ప తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ వజూభాయ్‌ వాలాకు అందజేశారు. సంఖ్యాబలం నిరూపించు కోలేనందునే తాను పదవికి రాజీనామా చేశానని, తన రాజీనామాను అంగీకరించాలని గవర్నర్‌ను ఆయన కోరారు. శనివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో అసెంబ్లీలో యడ్యూరప్ప  ప్రసంగిస్తూ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. బలపరీక్షకు ముందే తన రాజీనామాను ప్రకటించిన యడ్యూరప్ప ఆ వెంటనే అక్కడి నుంచి రాజ్‌వన్‌కు చేరుకుని గవర్నర్‌ను కలిశారు. ఏకైక పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుకు తమను ముందుగా ఆహ్వానించడంపై గవర్నర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన యడ్యూరప్ప తన భావోద్వేగ ప్రసంగం ముగింపులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు. తన రాజీనామాను సమర్పించేందుకు రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో మే 21న కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల మద్దతుతో జేడీఎస్‌ ముఖ్యనేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.