గవర్నర్‌తో అడ్వకేట్‌ జనరల్‌ భేటీ స.హ.కమిషనర్ల నియామకంపై చర్చ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (జనంసాక్షి):
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను ఆదివారంనాడు అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి కలిశారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకం, తొలగింపు తదితర అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. సమాచార హక్కు కమిషనర్ల నియామకానికి సంబంధించి గవర్నర్‌కు న్యాయసలహాలు ఇచ్చేందుకు అడ్వాకేట్‌ జనరల్‌ ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా సమాచార హక్కు కమిషనర్‌ నమీత్‌శర్మ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అడ్వాకేట్‌ జనరల్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. రాష్ట్రంలో సమాచార హక్కు కమిషనర్ల నియామకం వివా దాస్పదమైంది. తొలిత ప్రభుత్వ సూచించిన ఎనిమిది మంది కమిషనర్ల పేర్లలో నలుగురికి రాజకీయ నేపథ్యం ఉన్నందున గవర్నర్‌ కేవలం నలుగురి నియామకాన్ని ఆమోదించి మిగిలిన నలుగురు పేర్లను తిరస్కరించారు. అయినప్పటికీ ప్రభుత్వం మొండి పట్టుదలగా గవర్నర్‌ తిరస్కరించిన కాంతీయ కుమారితో సహా మరో ముగ్గురు పేర్లను సిఫార్సు చేస్తూ గవర్నర్‌ వద్దకు ఆమోదం కోసం మళ్లీ పైలును పంపింది. దీనిపై గవర్నర్‌ న్యాయసలహా కోరారు.